
బెంగాల్‌లో ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో కీలక అధికారుల బదిలీలను ఎన్నికల కమిషన్ చేపట్టింది. బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 13 మంది ఐఏఎస్ అధికారులను జిల్లా కలెక్టర్లు (డీఎంలు)-కమ్-జిల్లా ఎన్నికల అధికారులుగా (డీఈఓలు) నియమించగా, ఐదుగురు ఐపీఎస్ అధికారులను డీఐజీలుగా నియమించింది. జిల్లా స్థాయిలో ఎన్నికల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వహించే డీఎంలు-కమ్-డీఈఓలుగా జితిన్ యాదవ్ (కూచ్ బీహార్), సందీప్ ఘోష్ (జల్పైగురి), వివేక్ కుమార్ (ఉత్తర దినాజ్‌పూర్), రాజన్వీర్ సింగ్ కపూర్ (మాల్డా), ఆర్ అర్జున్ (ముర్షిదాబాద్) నియమితులయ్యారు. ఇక శ్రీకాంత్ పల్లి (నాదియా), శ్వేత అగర్వాల్ (పూర్బ బర్ధమాన్), శిల్పా గొరిసారియా (ఉత్తర 24 పరగణాలు), అభిషేక్ కుమార్ తివారి (దక్షిణ 24 పరగణాలు), హరిశంకర్ పనిక్కర్ (డార్జిలింగ్), టీ బాలసుబ్రమణియన్ (అలిపుర్దువార్)లకు కూడా అదే బాధ్యతలు అప్పగించారు. కొల్‌కత్తా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా స్మితా పాండే నియమితులై, కొల్‌కత్తా ఉత్తర డీఈఓగా వ్యవహరించనున్నారు. రంధీర్ కుమార్‌ను కొల్‌కత్తా దక్షిణ డీఈఓగా నియమించారు. స్వేచ్ఛా, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు నిర్వహించడంలో ఈ అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తూ పర్యవేక్షణ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారని ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారి తెలిపారు.
ఐదుగురు ఐపీఎస్‌లను డీఐజీలుగా నియామకం
ఇదే సమయంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను డీఐజీలుగా నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. రాథోడ్ అమిత్‌కుమార్ భారత్‌ను రాయ్‌గంజ్ రేంజ్ డీఐజీగా, అజీత్ సింగ్ యాదవ్‌ను ముర్షిదాబాద్ డీఐజీగా నియమించారు. శ్రీహరి పాండే (బర్ధమాన్), కంకర్ ప్రసాద్ బరూయి (ప్రెసిడెన్సీ రేంజ్), అంజలి సింగ్ (జల్పైగురి)లకు కూడా డీఐజీ బాధ్యతలు అప్పగించారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని, మార్చి 19లోపు విధుల్లో చేరిన వివరాలను సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. బదిలీ అయిన అధికారులను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల సంబంధిత బాధ్యతలకు నియమించరాదని స్పష్టం చేసింది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం ముఖ్య కార్యదర్శి నందిని చక్రవర్తి, హోం కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనా బదిలీలు, అనంతరం డీజీపీ పీయూష్ పాండే, కొల్‌కతా పోలీస్ కమిషనర్ సుప్రతిమ్ సర్కార్ తొలగింపులు జరిగిన నేపథ్యంలో ఈ తాజా మార్పులు చోటుచేసుకున్నాయి. 294 స్థానాల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
