Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ను తొందరపాటుతో చేస్తున్నారు: అమర్త్య సేన్

బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ను తొందరపాటుతో చేస్తున్నారు: అమర్త్య సేన్

Pinjari Chand
25 జనవరి, 2026

పశ్చిమ బెంగాల్‌లో చేపడుతున్న ప్రత్యేక సార్వత్రిక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్ – సర్) ప్రక్రియపై నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను అతివేగంగా, తొందరపాటుతో నిర్వహిస్తున్నారని, దీనివల్ల ప్రజాస్వామ్య భాగస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటమే ఈ ఆందోళనకు ప్రధాన కారణమని చెప్పారు. బోస్టన్ నుంచి మీడియాతో మాట్లాడిన అమర్త్య సేన్ ఓటర్ల జాబితా సవరణ అనేది ప్రజాస్వామ్యానికి బలమిచ్చే ప్రక్రియే అయినా, అది జాగ్రత్తగా, తగినంత సమయం తీసుకుని నిర్వహించినప్పుడే ఫలితం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం బెంగాల్‌లో జరుగుతున్న విధానం అలా లేదని ఆయన అన్నారు. తగినంత సమయం తీసుకుని, జాగ్రత్తగా ఓటర్ల జాబితా సవరణ చేస్తే అది ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుంది. కానీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్నది అలా కాదని సేన్ వ్యాఖ్యానించారు.

ఓటు హక్కు ఉన్నవారు అవసరమైన పత్రాలు సమర్పించుకునేందుకు సరైన సమయం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ను చాలా తొందరగా చేస్తున్నారు. దీంతో ఓటు హక్కు ఉన్నవారు తమ హక్కును నిరూపించుకునే అవకాశం కోల్పోతున్నారు. ఇది ఓటర్ల పట్ల అన్యాయం, భారత ప్రజాస్వామ్యానికి కూడా అన్యాయమని స్పష్టం చేశారు.

ఇబ్బందులు ఎదురయ్యాయి

ఎస్‌ఐఆర్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలను అమర్త్య సేన్ వివరించారు. శాంతినికేతన్ నియోజకవర్గం నుంచి తాను గతంలో ఓటు వేసినప్పటికీ, ఈసారి తన ఓటు హక్కుపై ప్రశ్నలు లేవనెత్తారని చెప్పారు. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా సరైన సమయం లేక ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. నా పేరు, చిరునామా అన్నీ అధికారిక రికార్డుల్లో ఉన్నప్పటికీ, నా ఓటు హక్కును ప్రశ్నించారు. అంతేకాదు, నా తల్లి (ఇప్పుడు లేరు) నేను పుట్టినప్పుడు ఆమె వయసు ఎంత అన్నదీ అడిగారు. ఆ వివరాలు కూడా వారి రికార్డుల్లోనే ఉన్నా ఇలా ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగించిందని సేన్ తెలిపారు.

చాలామంది భారతీయుల్లాగే తనకు బర్త్ సర్టిఫికెట్ లేదు

గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన చాలామంది భారతీయుల్లాగే తనకు బర్త్ సర్టిఫికెట్ లేదని, అందుకే అదనపు పత్రాలు సమర్పించాల్సి వచ్చిందన్నారు. ఈ సమస్య తనకే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన అనేక మందికి సాధారణమేనని చెప్పారు. ఈ సమస్య చివరకు పరిష్కారమైనప్పటికీ, తనకు మిత్రుల సహాయం లభించిందని, అలాంటి సహాయం లేని సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అన్న ఆందోళన తనను వెంటాడుతోందని చెప్పారు. నాకు స్నేహితుల సహాయం లభించింది. కానీ అటువంటి మద్దతు లేని వాళ్ల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.

ఎవరికి లాభం?

ఎస్‌ఐఆర్ వల్ల ఏ పార్టీకి లాభం కలుగుతుందన్న ప్రశ్నకు అమర్త్య సేన్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. నేను ఎన్నికల నిపుణుడిని కాదు. అయితే కొంతమంది చెప్పిన మేరకు ఈ ప్రక్రియ వల్ల బీజేపీకి లాభం కలగవచ్చని అంటున్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఎవరికైనా లాభం కలగకపోయినా, తప్పు విధానాన్ని కొనసాగించడం సరికాదు. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని అనవసరమైన తప్పిదానికి గురి చేయకూడదని అన్నారు.

పేదలు, బలహీన వర్గాలే ఎక్కువగా నష్టపోతారు

ఈ ప్రక్రియలో ఎక్కువగా నష్టపోయేది పేదలు, బలహీన వర్గాలేనని అమర్త్య సేన్ అభిప్రాయపడ్డారు. అవసరమైన పత్రాలు సేకరించడం వారికి చాలా కష్టమవుతుందని చెప్పారు. పత్రాల ఆధారిత విధానం వల్ల వర్గ వివక్ష బయటపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే కొంతమంది మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా ముస్లింలు, అలాగే కొన్ని హిందూ వర్గాలు కూడా వివక్షకు గురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు బాధ్యత

ఏ భారతీయ పౌరుడికీ ఓటు హక్కు పొందడంలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టులపై ఉందని సేన్ స్పష్టం చేశారు. తాను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అయితే ఓటింగ్ తేదీ, తన విదేశీ వృత్తి బాధ్యతలపై అది ఆధారపడి ఉంటుందని తెలిపారు. గతంలో ఒకసారి ఓటు వేయడానికి కేవలం 48 గంటల్లో ఎన్నో దేశాలు తిరిగి ప్రయాణించానని గుర్తు చేశారు. ఇప్పుడు నాకు 92 ఏళ్లు. అప్పట్లో నేను 82 మాత్రమే. అయినా ఈసారి కూడా నా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఓటు వేయగలనని ఆశిస్తున్నానంటూ అమర్త్య సేన్ తన వ్యాఖ్యలను ముగించారు.