
బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌కు అడ్డంకులను కల్పించొద్దు: సుప్రీం
పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సర్(ఎస్ఐఆర్) పక్రియను రాష్ట్రంలో నిలిపివేయాలన్న వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.అయితే భారీగా ఓటర్లను తొలగించకూడదని, అలాగే మైక్రో అబ్జర్వర్లుగా ఉన్న ఎన్నికల సిబ్బంది ఆ దిశగా ఆలోచించవద్దని పేర్కోంది. ఈ ప్రక్రియ నిజాయితీగా, నిబంధనల ప్రకారం జరుగుతుందా లేదా గమనించడం మాత్రమేనని వ్యాఖ్యానించింది. అలాగే ఈ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని సూచించింది.
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కలుపుకొని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ ఎన్‌వీ అంజారియా సభ్యులుగా ఉన్న ధర్మాసనం సోమవారం విచారించింది. అలాగే గడువును పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో, మైక్రో-ఆబ్జర్వర్లు ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం లేదని స్పష్టంగా పేర్కొంది. ఈ ప్రక్రియకు ఎవరూ అడ్డంకులు సృష్టించడానికి అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల పేర్లను తొలగించడం లేదా చేర్చడంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్లకే ఉంటుందని, మైక్రో-ఆబ్జర్వర్లు కేవలం పర్యవేక్షణ పాత్ర మాత్రమే నిర్వహిస్తారని ధర్మాసనం తెలిపింది.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భారీ సంఖ్యలో ఓటర్లు తొలగించే ప్రమాదం ఉందన్న మమతా బెనర్జీ ఆందోళనల నేపథ్యంలో, ధర్మాసనం స్పందిస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగనివ్వం. ఈ విషయం రాష్ట్రాలకు స్పష్టంగా తెలియాలి. అవసరమైన ఆదేశాలు లేదా స్పష్టీకరణలు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్‌ను కోర్టు పరిశీలించింది. ఇందులో ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నోటీసులను కొందరు దుండగులు కాల్చివేశారని పేర్కొనగా, ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని కూడా ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ డీజీపీ ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ భారత రాజ్యాంగం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్న సందేశం స్పష్టంగా వెళ్లాలన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి అందించిన 8,505 గ్రూప్-బీ అధికారుల జాబితాను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వీరికి శిక్షణ ఇచ్చి ఎస్‌ఐఆర్ పనుల్లో వినియోగించవచ్చని పేర్కొంది. అయితే, వీరి పని విధానం, బాధ్యతలు ఎలా ఉండాలన్నది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణపై తుది నిర్ణయం మాత్రం ఎలక్టోరల్ రోల్ అధికారులదేనని ధర్మాసనం స్పష్టంగా తెలిపింది. విచారణ సందర్భంగా మమతా బెనర్జీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను పెద్ద సంఖ్యలో తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపునకు మేము అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.
కోల్‌కత్తా మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీగా పెరిగిన డొమిసైల్ సర్టిఫికెట్ దరఖాస్తులు
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) నేపథ్యంలో కోల్‌కత్తా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)లో డొమిసైల్ (నివాస) సర్టిఫికెట్లకు దరఖాస్తులు అనూహ్యంగా పెరిగాయి. ఒకటిన్నర నెలల కాలంలో మొత్తం 18,600కు పైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 6 వరకు లభ్యమైన గణాంకాల ప్రకారం, మొత్తం 18,605 దరఖాస్తులు కేఎంసీకి చేరాయి. సాధారణంగా నెలకు 200కు మించని దరఖాస్తులు మాత్రమే వచ్చేవని, తాజా పెరుగుదల గతంలో ఎప్పుడూ లేనంతగా ఉందని మున్సిపల్ వర్గాలు పేర్కొన్నాయి.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల చిరునామా ధ్రువీకరణ కీలకంగా మారడంతో, ఓటరు జాబితాలో పేర్లు గుర్తించిన లేదా తొలగించిన వారు డొమిసైల్ సర్టిఫికెట్‌ను ప్రధాన ఆధారంగా వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. అందిన దరఖాస్తుల్లో 18,482ను ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం కోల్‌కత్తా పోలీసులకు పంపించగా, ఇప్పటివరకు 16,555 విచారణ నివేదికలు అందాయి. వీటి ఆధారంగా 14,590 డొమిసైల్ సర్టిఫికెట్లు జారీ కాగా, ప్రతికూల నివేదికల కారణంగా 1,287 దరఖాస్తులు తిరస్కరించినట్లు వెల్లడించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించడంతో, కేఎంసీ ప్రధాన కార్యాలయం సహా బరో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం ఆశ్చర్యకరమని మేయర్-ఇన్-కౌన్సిల్ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అవసరాల కోసమే ప్రధానంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఎలక్టోరల్ రివిజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, డొమిసైల్ సర్టిఫికెట్లకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందని కేఎంసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
