Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో అణచివేత పాలన సాగుతోంది: రాజ్‌నాథ్ సింగ్

బెంగాల్‌లో అణచివేత పాలన సాగుతోంది: రాజ్‌నాథ్ సింగ్

Pinjari Chand
8 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్‌సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో అణచివేత, ప్రజలపై ద్రోహం జరుగుతున్న పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని బారక్‌పూర్‌‌లో మంగళవారం నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని దెబ్బతీసిందని అన్నారు. 2021 ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఇచ్చిన ‘బాంగ్లా నిజేర్ మేయేకే చాయ్’ (బెంగాల్ తన కూతురినే కోరుకుంటుంది) అనే నినాదాన్ని ప్రస్తావిస్తూ, బెంగాల్ ప్రజలు మూడు సార్లు తమ కూతురిని ఎన్నుకున్నారు. కానీ ఆ కూతురు బెంగాల్‌ను మోసం చేసిందని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

బెంగాల్‌కు పెట్టుబడులు రావడం లేదు

దేశంలోని ఇతర రాష్ట్రాలు పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు వెళ్తుండగా, పశ్చిమ బెంగాల్ మాత్రం వెనుకబడి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం లేదని ఆరోపించారు. దేశం మొత్తం పరిశ్రమల అభివృద్ధిలో ముందుకు సాగుతోంది. కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం పెట్టుబడులు రావడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు రావడానికి అనుమతించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా బయటకు వెళ్లిపోతున్నాయని, పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు కూడా భయంతో ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. సభ అనంతరం రాజ్‌నాథ్ సింగ్ బారక్‌పూర్‌లో రోడ్‌షో కూడా నిర్వహించారు.

ఇదిలా ఉండగా, ఖరగ్‌పూర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిలీప్‌ ఘోష్‌ కూడా తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ప్రజలను బెదిరించి, ప్రతిపక్షాలను అడ్డుకోవడం ద్వారా టీఎంసీ విజయం సాధిస్తుందని ఆయన ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ప్రభావం క్రమంగా తగ్గిపోతుందని, ప్రజలు ఈసారి స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.