
బెంగాల్‌ను విభజించేందుకు కేంద్రం కుట్ర: మమతా
పశ్చిమ బెంగాల్‌ను మూడు భాగాలుగా విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ (పరిధుల పునర్విభజన) ప్రక్రియను ఉపయోగించాలనుకుంటోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను బీహార్ లేదా ఒడిశాతో కలపాలని యోచిస్తున్నారని, అలా జరిగితే అక్కడ నివసించే బెంగాలీలకు ఇబ్బందులు కలుగుతాయని ఆమె అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాంకురా జిల్లాలోని ఛట్నా, ఒండా, పుర్బ బర్ధమాన్ జిల్లాలోని ఖండఘోష్ ప్రాంతాల్లో జరిగిన సభల్లో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు.బెంగాల్‌ను మూడు భాగాలుగా విభజించేలా డీలిమిటేషన్ బిల్లు తీసుకురావాలని బీజేపీ యోచిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను బీహార్ లేదా ఒడిశాతో కలపాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇది అక్కడ నివసించే బెంగాలీలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని ఆమె అన్నారు.
రూ.వేయికోట్ల డీల్
మమతా మరో ఆరోపణ చేస్తూ, తన పార్టీ టీఎంసీని అధికారంలో నుంచి దించేందుకు బీజేపీ రూ.1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారిన ఒక వీడియోను ఉద్దేశించి చేసినవిగా భావిస్తున్నారు. ఆ వీడియోలో ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ నేత హుమాయున్ కబీర్, బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు రూ.1000 కోట్ల ఒప్పందం కుదిరిందని, అందులో రూ.200 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నానని చెప్పినట్లు వినిపిస్తుంది. అయితే ఆ వీడియో వాస్తవమా? కాదా అనేదానిపై అధికారిక ధృవీకరణ లేదు. తృణమూల్ కాంగ్రెస్ దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తుండగా, బీజేపీ, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ మాత్రం ఆ వీడియోను ఏఐ సృష్టించిన నకిలీ వీడియోగా పేర్కొన్నాయి.
సర్ దేశంలో అతిపెద్ద కుంభకోణం
ఇక ఎన్నికల నిర్వహణలో కేంద్ర బలగాలు మహిళలను తనిఖీ చేసే పేరుతో అవమానకరంగా ప్రవర్తిస్తున్నాయని కూడా మమతా ఆరోపించారు. తనకు సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని, కానీ నరేంద్రమోడీ సభకు మాత్రం వెంటనే అనుమతి ఇచ్చారని ఆమె అన్నారు. అదే సమయంలో బీజేపీ ఎన్నికల ముందు ఓటర్లకు డబ్బులు ఇచ్చి ప్రభావితం చేస్తుందని, ఎన్నికల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) దేశంలో ఇటీవల జరిగిన అతిపెద్ద కుంభకోణమని కూడా ఆమె ఆరోపించారు. ప్రపంచం మొత్తం చూస్తోంది… 2026లో మీ ప్రభుత్వం కూలిపోతుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటిని రద్దు చేస్తామని మమతా అన్నారు.
అలాగే ఓటింగ్ యంత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ నెమ్మదిగా పోలింగ్ నిర్వహించడం, లెక్కింపును ఆలస్యం చేయడం వంటి వ్యూహాలతో ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇంకా ఓటర్లను మోసం చేసేందుకు మత్తు కలిపిన టీ లేదా మిఠాయిలు ఇవ్వాలని బీజేపీ యోచిస్తోందని ఆరోపిస్తూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చివరగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం ఇచ్చిన హామీపై కూడా ఆమె ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైంది? అని ఆమె ప్రశ్నించారు.
