Let's talk: editor@tmv.in
బెంగాల్‌ను నాశనం చేయాలనకుంటే దేశంలో అధికారం కోల్పోతారు: మమతా

బెంగాల్‌ను నాశనం చేయాలనకుంటే దేశంలో అధికారం కోల్పోతారు: మమతా

Pinjari Chand
29 మార్చి, 2026

పశ్చిమ బెంగాల్‌ను నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా అధికారం కోల్పోతారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బర్ధమాన్ జిల్లా రాణిగంజ్, పురులియా జిల్లా కాశీపూర్, రఘునాథ్‌పూర్ ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌‌) ప్రక్రియలో ఓటర్ల పేర్లు తొలగించడం ద్వారా ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆమె ఆరోపించారు. సుమారు 1.20 కోట్ల పేర్లు తొలగించారని ఆమె పేర్కొన్నారు. బీజేపీ అన్ని హద్దులు దాటుతోంది. దీనికి ఒక ‘లక్ష్మణ రేఖ’ ఉండాలి. ఈ ఎస్‌ఐఆర్‌‌ ప్రక్రియే బీజేపీకి అంత్యసూచిగా మారుతుందని ఆమె హెచ్చరించారు.

నాలుగోసారి అధికారంలోకి వచ్చాక ఢిల్లీపై దాడి చేస్తాం

రాష్ట్రంలో నాలుగోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ఢిల్లీపై దాడి చేస్తామని (అంటే కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని) ఆమె తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్ పాలన అమలు చేస్తారని, ప్రజలను బలవంతంగా బయటకు పంపే పరిస్థితి తీసుకొస్తారని ఆరోపించారు. అలాగే బెంగాల్ రాష్ట్ర హోదాను కూడా రద్దు చేసే యత్నం జరుగుతుందని ఆమె అన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోయిన వారికి టీఎంసీ ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజల ఓటు హక్కును ఎవరూ లాక్కోలేరు. అందరికీ ఓటు హక్కు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఎన్‌ఆర్‌సీ అమలు పేరుతో పేర్లు తొలగించిన వారిని డిటెన్షన్ క్యాంపులకు పంపే ప్రమాదం ఉందని కూడా ఆమె ఆరోపించారు. అది జరగనివ్వం అని ఆమె చెప్పారు.

పశ్చిమ ఆసియా యుద్ధం పేరుతో కేంద్రం మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచనలో ఉందని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. రామ్ నవమి శోభాయాత్ర సందర్భంగా ముర్షిదాబాద్‌లో జరిగిన ఘర్షణలపై స్పందిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. నేను ఎన్నికైన ముఖ్యమంత్రినే అయినా నా అధికారాలు తీసేశారని ఆమె అన్నారు. టీఎంసీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, లక్ష్మీర్ భండార్, యువసాథి వంటి పథకాలు సహాయం మాత్రమే, దానం కాదని పేర్కొన్నారు. నిరుద్యోగం 40 శాతం తగ్గించామని, 2 కోట్ల ఉద్యోగాలు కల్పించామని ఆమె అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై దాడి చేస్తూ, 2014లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఐదేళ్లుగా తగ్గించారని ఆరోపించారు.

టీఎంసీ మణిపూర్‌‌ చార్జీషీట్‌ విడుదల

ఇదిలా ఉండగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విడుదల చేసిన ‘చార్జ్‌షీట్’కు టీఎంసీ ప్రతి స్పందనగా చార్జ్‌షీట్ విడుదల చేసింది. టీఎంసీ నేతలు మహువా మొయిత్రా, బ్రత్య బసు, కీర్తి ఆజాద్ కలిసి నిర్వహించిన సమావేశంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మణిపూర్‌లో మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న హింసపై సమాధానం చెప్పాలని, మహిళల భద్రత విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అక్రమ వలసల అంశంపై కూడా కేంద్రం వైఫల్యాన్ని ఎత్తిచూపారు. దేశ సరిహద్దులు కేంద్రం నియంత్రణలో ఉన్నాయి. అక్రమ వలసలు ఉంటే బాధ్యత ఎవరిది? అని టీఎంసీ నేతలు ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బెంగాల్ ఎన్నికలు రాజకీయంగా మరింత వేడెక్కుతున్నాయి. పోలింగ్ ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.