
బెంగాల్‌కు వచ్చే గవర్నర్ బీజేపీ కేడరే: సీఎం మమత
పశ్చిమ బెంగాల్‌కు కొత్త గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ఆర్‌ఎన్.రవిని ‘బీజేపీ కేడర్’గా అభివర్ణిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుత గవర్నర్ సీవీ.ఆనందబోస్ ఆకస్మికంగా పదవి వీడటానికి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడే కారణమని ఆమె ఆరోపించారు. ఓటర్ల జాబితాలో పేర్లు తొలగింపుపై నిరసనగా చేస్తున్న ధర్నాలో పాల్గొన్న మమతా బెనర్జీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం లోక్ భవన్‌ను రాజకీయ కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీవీ. ఆనందబోస్‌ను ఎలా తొలగించారో మీకు తెలుసా? నాకు అన్నీ తెలుసు. ఆయనను బెదిరించారు. లోక్ భవన్ నుంచి డబ్బులు పంపిణీ చేయాలని, దాన్ని బీజేపీ కార్యాలయంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అందరూ ఢిల్లీ చెప్పినట్లు నడుచుకోరు అని మమతా అన్నారు.
ఆర్.ఎన్. రవి గతంలో తమిళనాడు గవర్నర్‌గా ఉన్న సమయంలో సుప్రీం కోర్టు నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారని విమర్శించారు. ఇప్పుడు బెంగాల్‌కు వస్తున్న వ్యక్తి బీజేపీ కేడర్ మనిషే. తమిళనాడులో మీరు ఏం చేశారో కానీ బెంగాల్‌లో అది సాధ్యం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను బలహీనపరుస్తోందని కూడా ఆమె ఆరోపించారు. గవర్నర్లు తమ పదవీకాలాన్ని పూర్తిగా కొనసాగించేందుకు కూడా కేంద్రం అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. ఇదే విధంగా మాజీ ఉపరాష్ట్రపతి, గవర్నర్ అయిన జగ్‌దీప్ ధన్‌ఖర్ విషయంలో కూడా జరిగిందని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ, అవి మధ్యయుగ పాలకుడు మహ్మద్ బిన్ తుగ్లక్ పాలనలాంటిదిగా ఉందని మమతా వ్యాఖ్యానించారు. మమ్మల్ని బెదిరించాలనుకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మేము ప్రయత్నిస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ఈ వారం ప్రారంభంలో సీవీ. ఆనంద బోస్ ఆకస్మికంగా గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలు ప్రారంభమయ్యాయి. గురువారం సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తనతో మాట్లాడి తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమిస్తారని తెలిపారని మమతా వెల్లడించారు. అయితే రవి ఇప్పటివరకు అధికారికంగా బాధ్యతలు స్వీకరించలేదు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి. అధికార పార్టీ ఆల్‌ఇండియా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న పరిస్థితిలో గవర్నర్ భవన్ మరోసారి రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. మమతా బెనర్జీ వ్యాఖ్యలు, రాబోయే ఎన్నికలను బెంగాల్ స్వయం ప్రతిపత్తిని కాపాడే పోరాటంగా చూపించేందుకు తృణమూల్ కాంగ్రెస్ మరోసారి ప్రయత్నిస్తోందనే సంకేతాలు ఇస్తున్నాయి.
బెంగాల్‌ను విభజించే కుట్ర విజయవంతం కాదు
ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)పై సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గ్యాస్ ధరలు పెంచడం, ఓటర్ల పేర్లు తొలగించడం ద్వారా బెంగాల్‌ను బలహీనపర్చే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. గ్యాస్ బుకింగ్‌కు కొత్తగా తీసుకొచ్చిన నియమాలను కూడా ప్రశ్నించారు. గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఇప్పుడు సిలిండర్ బుక్ చేయడానికి 21 రోజుల ముందే ఆర్డర్ పెట్టాలి అంటున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోతే ఆ 21 రోజులు ఏం తింటారు? ప్రభుత్వం ప్రజలకు ఆహారం డెలివరీ చేస్తుందా? కిరోసిన్ కోటాను కూడా తగ్గించారు. ప్రతిరోజూ ధరలు పెంచుతున్నారని ఆమె విమర్శించారు.
బెంగాల్‌పై రాజకీయంగా దాడి చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. అందుకే ఓటర్ల పేర్లు తొలగించాలని చూస్తున్నారు. బెంగాల్‌ను విభజించాలనుకుంటున్నారు. మీకు ఇతరులు భయపడవచ్చు కానీ మేము భయపడము. మీ అసలు ఉద్దేశాలను బయటపెడతామని ఆమె అన్నారు. ఎల్పీజీ ధరల పెంపు, కిరోసిన్ కొరత, ఎస్ఐఆర్ ప్రక్రియలో మహిళల పేర్లు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని కూడా ఆమె ప్రకటించారు. బెంగాల్‌ను బలహీనపర్చే ‘భాంగ్ బెంగాల్’ అనే కుట్ర జరుగుతోందని ఆరోపించిన మమతా, బెంగాల్‌ను విభజించే ప్రయత్నం ఎప్పటికీ సఫలం కాదు. అది కేవలం ప్రణాళికగానే మిగిలిపోతుందని అన్నారు.
ఇదిలా ఉండగా పేద వర్గాలకు మద్దతుగా రెండు సంక్షేమ పథకాలను వెంటనే ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. బంగ్లార్ యువ సాథి, భూమిహీన్ కేత్ మజ్దూర్ అనే పథకాలు మొదట ఏప్రిల్‌లో ప్రారంభించాల్సి ఉండగా, వాటిని ఇప్పుడే అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ పథకాల ద్వారా వలస కార్మికులు, జూట్ పరిశ్రమ కార్మికులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. సుమారు 10 లక్షల మంది కార్మికులు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని ఆమె తెలిపారు. అలాగే తమ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాల అమల్లో దేశంలో ముందంజలో ఉందని మమతా పేర్కొన్నారు. అందుకే రాజకీయ ప్రత్యర్థులు బెంగాల్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
బెంగాల్‌లో నిరుద్యోగులకు నెలకు రూ.1,500 భృతి
పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 భృతి అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. శనివారం నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. టీఎంసీ అధినేత్రి అయిన మమతా బెనర్జీ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో పేర్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
‘యువ సాథి’ పథకం కింద భృతి
21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన యువకులు, యువతులు నెలకు రూ.1,500 చొప్పున పొందుతారని తెలిపారు. ఈ పథకం కింద సుమారు ఒక కోటి మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. మొదట ఈ భృతిని ఏప్రిల్ 1 నుంచి ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగానే మార్చి 7 నుంచే అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాకుండా, స్కాలర్‌షిప్ మాత్రమే పొందుతున్న విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులని చెప్పారు.
