
బెంగాల్‌కు దుశ్శాసనుడు వచ్చాడు:సీఎం మమత
ఎన్నికలు రాగానే దుర్యోధన, దుష్శాసనులు కనిపించడం మొదలవుతుంది. ఇప్పుడు బెంగాల్‌కు ఒక దుశ్శాసనుడు వచ్చాడు. శకుని శిష్యుడిలా సమాచారం సేకరించేందుకు వచ్చాడని సీఎం మమతా తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తీవ్ర వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఘాటుగా బదులిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వాన్ని భయం, అవినీతితో పోల్చుతూ, సరిహద్దు కంచె నిర్మాణానికి భూమి ఇవ్వలేదని అమిత్ షా ఆరోపించడంపై ఆమె మండిపడ్డారు. బీజేపీ నేతలను మహాభారతంలోని దుర్యోధన, దుష్శాసనులతో పోల్చుతూ విమర్శలు చేశారు. ఒక ప్రజాసభలో మాట్లాడిన మమతా బెనర్జీ సరిహద్దు కంచె నిర్మాణానికి భూమి ఇవ్వలేదన్న ఆరోపణలను ఖండించారు. నేను భూమి ఇవ్వలేదని అంటున్నారు. నేను భూమి ఇవ్వకపోతే ఏమయ్యేది? పెట్రపోల్‌లో భూమి ఎవరు ఇచ్చారు? అండాల్‌లో భూమి ఎవరు ఇచ్చారు?అంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన ప్రాంతాల్లో భూమి ఇచ్చిందని స్పష్టం చేశారు.
అమిత్ షా అక్రమ వలసల అంశాన్ని జాతీయ భద్రతగా చిత్రీకరించడంపై కూడా మమతా తీవ్రంగా స్పందించారు. వలసదారులు అందరూ బెంగాల్ నుంచే వస్తారని చెబుతున్నారు. మరి పహల్గామ్‌లో జరిగిన దాడి ఎవరు చేశారు? ఢిల్లీలో జరిగిన ఘటన వెనుక ఎవరు ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. బీజేపీనే అవినీతిపరుల పార్టీగా పేర్కొంటూ, ఓటర్ సమగ్ర జాబితా సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ప్రజలను వేధిస్తున్నారని ఆరోపించారు.
ఇక్కడ సంపాదించే హక్కు ఒక్క భాయ్‌పోకే
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై, ఆమె మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో లంచాలు, అవినీతి రాజ్యమేలుతున్నాయని ఆరోపిస్తూ ఇక్కడ సంపాదించే హక్కు ఒక్క భాయ్‌పోకే (మేనల్లుడు) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మాకు చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వం లేకపోయినా, అక్కడ ఇలాంటి పరిస్థితులు లేవు. ప్రధాని వందే భారత్ రైలును ప్రారంభించేందుకు వచ్చినప్పుడు మమతా జీ వేదికపైకి కూడా రాలేదు. డీవోపీటీ నిబంధనలను తనకు అనుకూలంగా మలుస్తున్నారు. డీజీపీల నియామకాల్లో తీవ్ర ఏకపక్షత ఉందని విమర్శించారు. రిటైర్ అయిన పోలీసు అధికారులను సలహాదారులుగా నియమించి, ‘ప్రాక్సీ డీజీపీలు’లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం సిండికేట్ రాజకీయం, కట్ మనీ సంస్కృతిని ప్రోత్సహించింది. బీజేపీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలోని ప్రస్తుత సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. మటువాలకు భయపడాల్సిన అవసరం లేదు. వేధింపులకు గురై బెంగాల్‌కు వచ్చిన శరణార్థులు భారత పౌరులే. వారికి ఎవరూ, మమతా బెనర్జీ కూడా హాని చేయలేరు అని స్పష్టం చేశారు.
సరిహద్దు కంచెకు భూమి ఇవ్వని ప్రభుత్వం మీది. అక్రమ వలసదారులు మొదట బెంగాల్‌కే ఎందుకు వస్తున్నారు? పోలీస్ స్టేషన్లు, పట్వారీలు ఏమి చేస్తున్నారు? అసోం, త్రిపురాల్లో ఆగిపోయిన చొరబాట్లు బెంగాల్‌లో ఎందుకు ఆగడం లేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
