Let's talk: editor@tmv.in
బెంగాల్‌కు చొరబాట్లే అతిపెద్ద సవాలు: ప్రధాని మోడీ

బెంగాల్‌కు చొరబాట్లే అతిపెద్ద సవాలు: ప్రధాని మోడీ

Pinjari Chand
18 జనవరి, 2026

పశ్చిమ బెంగాల్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అక్రమ చొరబాట్లేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పెద్ద ఎత్తున అక్రమ వలసలు రాష్ట్ర జనాభా సమతుల్యతను మార్చేశాయని, అల్లర్లకు దారితీస్తున్నాయని ఆరోపించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ పోషణ, ‘సిండికేట్ రాజ్’ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న మాల్దా జిల్లాలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఎన్నికల జాబితాలపై జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) వివాదం నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో మతపరమైన వేధింపుల నుంచి తప్పించుకుని భారత్‌కు వచ్చిన మాతువా సమాజం సహా శరణార్థులు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. బెంగాల్ ముందు నిలిచిన అత్యంత తీవ్రమైన సవాలు చొరబాట్లే. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలు కూడా అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లో కూడా చొరబాటుదారులను తొలగించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు.

చోరబాట్లే అల్లర్లకు కారణం

బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ చొరబాట్లపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో అక్రమ వలసలను పూర్తిగా అడ్డుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చొరబాట్ల ప్రభావం ఇప్పటికే నేలమీద స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జనాభా స్వరూపం మారిపోయింది. మాట్లాడే భాష, మాండలికాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. మాల్దా, ముర్షిదాబాద్ సహా పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగడానికి ఇదే కారణమని మోడీ అన్నారు. టీఎంసీ పార్టీ ‘సిండికేట్ వ్యవస్థ’ ద్వారా అక్రమ వలసదారులను రాష్ట్రంలో స్థిరపరుస్తోందని, పాలక పార్టీకి చొరబాటుదారులతో అవినాభావ సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. ఈ కూటమిని మీరు విడగొట్టాలి. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే అక్రమ చొరబాట్లపై, చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆశ్రయం పొందిన మాతువా సమాజం వంటి శరణార్థులను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ మతపరమైన వేధింపుల కారణంగా భారత్‌లో ఆశ్రయం తీసుకున్న శరణార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) హామీతో 2019 నుంచి మాతువాలు బీజేపీకి కీలక ఓటుబ్యాంకుగా మారిన విషయం తెలిసిందే.

టీఎంసీపై విమర్శలను మరింత పదునెక్కించిన ప్రధాని, పేదలను బెదిరించే రాజకీయాలు, గుండాయిజం త్వరలోనే ముగుస్తాయని అన్నారు. అన్ని వైపులా బీజేపీ పాలిత రాష్ట్రాలతో చుట్టుముట్టిన బెంగాల్‌లో మార్పు తప్పనిసరి అయింది. మంచి పాలనకు ఇప్పుడు బెంగాల్ కూడా సిద్ధంగా ఉందని అన్నారు. బీహార్‌లో బీజేపీ విజయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు నేను ‘ఇప్పుడు బెంగాల్ వంతు’ అని చెప్పాను. మూడు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు బీజేపీకి ఘన విజయం అందిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.

సంక్షేమ పథకాలను టీఎంసీ అడ్డుకుంటోంది

పేదల కోసం కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టీఎంసీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధాని ఆరోపించారు. ఉచిత విద్యుత్ వంటి పథకాల ప్రయోజనాలు బెంగాల్ ప్రజలకు రావాలా వద్దా? టీఎంసీ అడ్డంకులు తొలగితేనే నిజమైన సంక్షేమం సాధ్యమవుతుందని ప్రశ్నించారు. టీఎంసీ ప్రభుత్వం అవినీతితో ప్రజాధనాన్ని దోచుకుంటోందని, కేంద్రం పంపిన నిధులు పేదలకు చేరకుండా పోతున్నాయని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు, అర్హులైన వారికి ఉచిత రేషన్ అందాలి. కానీ టీఎంసీ నేతలు ఆ డబ్బును దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం అమలు కావడం లేదని కూడా ప్రధాని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అమలు కాని ఏకైక రాష్ట్రం బెంగాల్. ప్రజలకు ఈ ప్రయోజనాలు దక్కకుండా టీఎంసీ అడ్డుకుంటోంది. ఇలాంటి కఠిన హృదయ ప్రభుత్వానికి బెంగాల్ వీడ్కోలు చెప్పాలని పిలుపునిచ్చారు. మాల్దా అభివృద్ధిపై హామీ ఇస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే జిల్లా పాత వైభవాన్ని తిరిగి తీసుకువస్తామని చెప్పారు. మాల్దా మామిడి ఆర్థిక వ్యవస్థను కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం. రైతులు, యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తామని మోడీ హామీ ఇచ్చారు.

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు, కేరళలో బీజేపీ పురోగతిని ప్రస్తావించిన ప్రధాని, పార్టీ అభివృద్ధి మోడల్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఈ సభలో మీ ఉత్సాహాన్ని చూస్తుంటే, ఈసారి బెంగాల్ ప్రజలు కూడా బీజేపీని గెలిపిస్తారన్న నమ్మకం మరింత బలపడుతోందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.

వందే భారత్ సేవలను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు సేవలను పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇవి సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, స్మరణీయంగా మారుస్తాయని అన్నారు. రైల్వే ఆధునికీకరణ దిశగా ఇది ఒక చారిత్రాత్మక ముందడుగని పేర్కొన్నారు. మాల్దాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి సంబంధించి అనేక రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయని తెలిపారు. కొత్త రైలు సేవలతో ప్రజల ప్రయాణాలు సులభమవుతాయి. వాణిజ్యం, వ్యాపారాలకు ఇది మేలు చేస్తుంది. ట్రాక్ నిర్వహణకు ఏర్పాటైన కొత్త సదుపాయాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని మోడీ అన్నారు.

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు హౌరా–గువాహటి (కామాఖ్య) మార్గంలో నడుస్తుందని ప్రధాని తెలిపారు. మాతృకాళి భూమి నుంచి మాతృకామాఖ్య భూమిని కలుపుతున్న ఈ రైలు త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని అన్నారు.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు నాలుగు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు లభించాయని వెల్లడించారు. అవి: న్యూ జల్పాయిగురి – నాగర్‌కోయిల్, న్యూ జల్పాయిగురి – తిరుచిరాపల్లి, అలీపుర్ద్వార్ – బెంగళూరు, అలీపుర్ద్వార్ – ముంబయి. ఇవన్నీ ఉత్తర బెంగాల్‌ను దక్షిణ, పశ్చిమ భారతదేశంతో మరింత బలంగా అనుసంధానిస్తాయని చెప్పారు.

భారతీయ రైల్వేలు సంపూర్ణ మార్పు దశలో ఉన్నాయని, వేగంగా విద్యుదీకరణ, స్టేషన్‌ల ఆధునికీకరణ జరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, ఈ అభివృద్ధి ఫలితాలు బెంగాల్ ప్రజలకు నేరుగా అందుతున్నాయని చెప్పారు. మాల్దాలో కార్యక్రమం అనంతరం ప్రధాని అస్సాంలో జరగనున్న ‘బగురుంబ ద్హౌ 2026’ అనే బోడో సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొననున్నారు. జనవరి 18న గువాహటి–రోహ్తక్, డిబ్రుగఢ్–లక్నో మార్గాల్లో రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు.

బెంగాల్‌కు చొరబాట్లే అతిపెద్ద సవాలు: ప్రధాని మోడీ - Tholi Paluku