Let's talk: editor@tmv.in
బెంగళూరు జైల్లో ‘వీఐపీ ట్రీట్మెంట్’ పై పెనుదుమారం

బెంగళూరు జైల్లో ‘వీఐపీ ట్రీట్మెంట్’ పై పెనుదుమారం

Pinjari Chand
11 నవంబర్, 2025

ఖైదీలు జైలులో మొబైల్‌ ఫోన్లు, టీవీలు వాడుతున్నారంటూ బయటపడ్డ వీడియోలతో పరప్పన అగ్రహార జైలు వ్యవహారం కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేసింది. బీజేపీ సీఎం ఇంటిని ముట్టడించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయాల్లో పెను దుమారం రేపింది. దీంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ నెల 9న ఓ పత్రికలో వార్తా కథనం రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సోమవారం రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర వెల్లడించిన వివరాల ప్రకారం జైలు సూపరింటెండెంట్‌ మాగేరీ, ఏఎస్పీ అశోక్‌ భజంత్రిని బర్తరఫ్‌ చేశారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ కె. సురేశ్‌ను తక్షణమే బదిలీ చేశారు.

మీడియాలో వచ్చిన వీడియోల్లో కొన్ని 2023 నాటివి ఉన్నాయి. మరికొన్ని మూడు-నాలుగు నెలల క్రితానికి చెందినవిగా గుర్తించారు. అయినప్పటికీ జైలు నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నట్టు తేలింది. ఇకపై పరప్పన అగ్రహార జైలును ఒక ఐపీఎస్ స్థాయి అధికారి పర్యవేక్షణలో నడుస్తుందని తెలిపారు. జైళ్లలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయడానికి ఒక హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశాం. అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వమని ఆదేశించామని వివరించారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలో ఖైదీలు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు పొందుతున్నట్లు, మొబైల్‌ ఫోన్లు, టీవీలు వాడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. వీరిలో సీరియల్‌ కిల్లర్‌ ఉమేష్‌ రెడ్డి, బంగారం స్మగ్లింగ్‌ కేసు నిందితుడు తరుణ్‌ రాజ్, ఇంకా దుబాయ్‌ నుంచి ఎన్ఎస్ఏ తీసుకొచ్చిన ఒక ఐసిస్‌ ఆపరేటివ్‌ కూడా ఉన్నారని సమాచారం. ఈ వీడియోలు కలకలం సృష్టించిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని బాధ్యులపై కఠిన నిర్ణయం తీసుకుంది.

సీఎం ఇంటిని ముట్టడించిన బీజేపీ

బెంగళూరు సెంట్రల్‌ జైలులో ఖైదీలకు ‘వీఐపీ ట్రీట్మెంట్‌’ ఇస్తున్న వీడియోలు వెలుగుచూసిన నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. దీంతో సీఎం ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బీజేపీ జిల్లా ఇన్‌చార్జి ఎస్‌. హరీష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో జైళ్లు జైళ్లలా లేవు. ఇవి టెర్రరిస్టులకు, నేరస్తులకు సురక్షిత ఆశ్రయం అయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న టెర్రరిస్టులు ఇప్పుడు బెంగళూరు జైలుకే ట్రాన్స్‌ఫర్‌ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వారికి విలాసవంతమైన జీవితం దొరుకుతోందని మండిపడ్డారు. రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వరప్ప తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే సి.ఎన్‌. అశ్వత్థనారాయణ కూడా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ టెర్రరిస్టులను ఆదరించే పార్టీగా మారిపోయింది. చట్టం లేదు, పరిపాలన లేదు. జైళ్లు టెర్రరిస్టులకు స్వర్గధామాలుగా మారాయి. ఇది దేశద్రోహం తప్ప మరేమీ కాదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక జైళ్లు ఇప్పుడు ప్రభుత్వం నడిపే ‘రీక్రియేషన్‌ క్లబ్‌లు’ అయ్యాయి. ఉగ్రవాదులు, రాడికల్‌ మూలాలు బయట మాత్రమే కాదు, జైల్లోపల కూడా స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఇది కాంగ్రెస్‌ పాలన ప్రత్యేకత. రాహుల్‌ గాంధీ దేశ భద్రత కంటే అధికారం కోసమే పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

పార్టీ ఐటి సెల్ నేత అమిత్ మాలవీయ ఎక్స్ లో ఖైదీల వీడియోలు షేర్ చేసి, ఉగ్రవాది, సీరియల్ కిల్లర్‌లకు జైల్లో “వీఐపీ ట్రీట్మెంట్” కల్పించడం ద్వారా జాతీయ భద్రతకే ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు.

బెంగళూరు జైల్లో ‘వీఐపీ ట్రీట్మెంట్’ పై పెనుదుమారం - Tholi Paluku