
బెంగళూరు ఎయిర్‌పోర్టులో మిట్టీ కేఫే మూడో కేంద్రం ప్రారంభం
ప్రపంచంలోని ఎలాంటి విమానాశ్రయానికీ లేని ప్రత్యేకతను బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సొంతం చేసుకుంది. సమానత్వం, సమావిష్కరణ కొత్త చరిత్రను రాసింది. ఇక్కడ నెలకోల్పిన మూడు మిట్టీ కేఫేలు పూర్తిగా దివ్యాంగుల చేత నడుస్తుడడం విశేషం. మిట్టీ కేఫే మూడో అవుట్‌లెట్‌ను ఇటీవల టెర్మినల్–2లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బిఐఏఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హరి మారర్ నేతృత్వం వహించారు.
ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు
కెంపెగౌడ విమానాశ్రయం ఇప్పుడు ప్రపంచంలోనే దివ్యాంగులు నిర్వహించే అత్యధిక కేఫేలు కలిగిన ఏకైక ఎయిర్‌పోర్టుగా నిలిచింది. ‘ప్రతి కప్పు కాఫీ వెనుక ఒక మార్పు కథ ఉంది‘ అనే భావనతో ఈ మూడో కేఫేను ప్రారంభించారు.
సీఎస్ఆర్ సహకారం తో
ఈ మిట్టీ కేఫే విస్తరణ బజాజ్ ఫిన్‌సర్వ్, జెడ్‌స్కేలర్ కంపెనీల సీఎస్ఆర్ కార్యక్రమాలలో భాగంగా నెలకోల్పారు. బజాజ్ ఫిన్‌సర్వ్ పలు సంవత్సరాలుగా మిట్టీ కేఫేతో భాగస్వామ్యం కొనసాగిస్తోంది. శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల రూపకల్పనలో ఆ సంస్థ కీలక పాత్ర పోషించింది. బజాజ్ ఫిన్‌సర్వ్ సీఎస్ఆర్ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్ శెఫాలీ బజాజ్ మాట్లాడుతూ అందరికీ సమాన అవకాశాలు అనేది అవగాహన స్థాయిలోనే ఆగిపోకూడదు. అది చర్యగా మారాలి. మిట్టీ కేఫేతో మాకు ఉన్న భాగస్వామ్యం పరిమితులను కాదు, ప్రతిభను, అవకాశాలను ప్రతిబింబిస్తుంది. గౌరవం ఉన్న చోటే నిజమైన సాధికారత పుడుతుందన్నారు.
జెడ్‌స్కేలర్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ జైన్ మాట్లాడుతూ సమానత్వం, సాధికారత మా సీఎస్ఆర్ విధానాల ప్రాణం. మిట్టీ కేఫేతో భాగస్వామ్యం ద్వారా ఆ ఆత్మను ప్రతి ప్రయాణికుడు అనుభవిస్తాడు అని పేర్కొన్నారు.
బిఐఏఎల్ సీఈవో హరి మారర్ మాట్లాడుతూ విమానాశ్రయాలు కేవలం ప్రయాణానికే ద్వారాలు కావు గేట్లు కావు. అవి సమాజం మనసును ప్రతిబింబిస్తాయి. మిట్టీ కేఫేతో భాగస్వామ్యం ద్వారా మేం ఇన్‌క్లూజన్ అంటే ఒక ప్రాజెక్ట్ కాదు. ఒక జీవనశైలి అని చూపించామని అన్నారు.
ఆరంభం నుంచి అగ్రస్థానానికి
మిట్టీ కేఫే స్థాపకురాలు అలీనా ఆలమ్ ఒక చిన్న టిన్ షెడ్‌లో దీన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు, పలు ప్రధాన విమానాశ్రయాల్లో మిట్టీ కేఫేలు నడుస్తున్నాయి. భారత్‌లో 30కి పైగా నగరాల్లో మిట్టీ కేఫేలు పనిచేస్తున్నాయి. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ మాకు విశ్వాసం కల్పించింది. బజాజ్ ఫిన్‌సర్వ్ మద్దతు లేకపోతే ఇంత దూరం రాలేం. జెడ్‌స్కేలర్ మా ప్రయాణంలో చేరడం ఆనందమని మిట్టీ కేఫే డైరెక్టర్లు స్వాతి కేశన్ డోకానియా, ఆయేషా ఆలమ్ అన్నారు.
ఇన్‌క్లూజన్‌కి కొత్త రూపం
కెంపెగౌడ విమానాశ్రయంలో దివ్యాంగుల కోసం ఇప్పటికే సన్ ప్లవర్ లాన్ యార్డ్ ప్రోగ్రాం (హిడెన్ డిసెబిలిటీల కోసం), సెన్సరీ రూమ్స్ (న్యూరోడైవర్జెంట్ ప్రయాణికుల కోసం) వంటి సదుపాయాలు ఉన్నాయి. మిట్టీ కేఫే వాటికి సముచితమైన కొనసాగింపుగా నిలుస్తోంది. ఇక్కడ లభించే కాఫీ, భోజనాలతో పాటు దివ్యాంగులు కూడా సాధికారులు అనే సందేశం ప్రయాణికుల హృదయాలను తాకుతోంది.
మిట్టీ కేఫే గురించిన వివరాలు
మిట్టీ కేఫే ఒక లాభాపేక్షలేని సంస్థ. దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడం దీని లక్ష్యం. ఇప్పటివరకు ఈ సంస్థ 6,500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించి, 2.2 కోట్ల భోజనాలు సర్వ్ చేసింది.
ఇది భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, యునైటెడ్ నేషన్స్, నీతి ఆయోగ్, ఫోర్బ్స్ 30 అండర్ 30 వంటి జాతీయ–అంతర్జాతీయ సంస్థల నుంచి గుర్తింపు పొందింది.
మిట్టీ కేఫే కేవలం కాఫీ సెంటర్ కాదు. ఇది గౌరవం, అవకాశం, సమానత్వం అనే మూడు పదాల కలయిక. కెంపెగౌడ విమానాశ్రయంలో ఈ మూడో కేఫే ప్రారంభించడంతో దివ్యాంగుల జీవనంలో కొత్త శకం ప్రారంభమైంది.
