Let's talk: editor@tmv.in
బెంగళూరులో విద్యార్థిని ‘టెర్రరిస్ట్’గా పిలిచిన ప్రొఫెసర్‌.. ఎఫ్ఐఆర్ నమోదు

బెంగళూరులో విద్యార్థిని ‘టెర్రరిస్ట్’గా పిలిచిన ప్రొఫెసర్‌.. ఎఫ్ఐఆర్ నమోదు

Pinjari Chand
29 మార్చి, 2026

తరగతి గదిలో ఓ విద్యార్థిని ‘టెర్రరిస్ట్’గా పిలుస్తూ అవమానకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో, బెంగళూరులోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి చెందిన అడ్జంక్ట్ ప్రొఫెసర్‌పై పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మార్చి 24న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తరగతి సమయంలో విద్యార్థి క్లాస్‌కు అంతరాయం కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ ప్రొఫెసర్ అతనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం బాధిత విద్యార్థి కాలేజ్ అధికారులను ఆశ్రయించగా, విచారణ అనంతరం శుక్రవారం ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రకారం, విద్యార్థి నుంచి అధికారిక ఫిర్యాదు రాకపోయినా, వైరల్ వీడియో ఆధారంగా స్వయంగా సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, ప్రొఫెసర్ తరగతి గదిలో పలుమార్లు ఆ విద్యార్థిని టెర్రరిస్ట్గా పిలుస్తూ దూషించాడు. ఇరాన్ యుద్ధం మీలాంటి వాళ్ల వల్లే జరిగింది. ట్రంప్ మిమ్మల్ని తీసుకెళ్తాడు. మీరు మూర్ఖులు, నరకానికి వెళ్తారు వంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్‌లో ఉంది. ఈ వ్యాఖ్యలు సుమారు 60 మంది విద్యార్థుల సమక్షంలో చేయడంతో బాధిత విద్యార్థికి తీవ్ర అవమానకర వాతావరణం ఏర్పడినట్లు పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఈ ఘటనకు కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పారదర్శకత, బాధ్యతలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత విద్యార్థికి మద్దతుగా మాట్లాడిన కొందరు విద్యార్థులను క్లాస్‌లో మాట్లాడారు అనే కారణంతో సస్పెండ్ చేసినట్లు కూడా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రొఫెసర్ తరువాత కాలేజ్‌కు క్షమాపణ లేఖ రాసినప్పటికీ, బాధిత విద్యార్థికి ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పలేదని తెలుస్తోంది. విభాగాధిపతి అతని తరఫున క్షమాపణ చెప్పడంతో పాటు, ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లవద్దని విద్యార్థిని పరోక్షంగా హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ ) ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించి, ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజా క్షమాపణ వీడియో విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బెంగళూరులో విద్యార్థిని ‘టెర్రరిస్ట్’గా పిలిచిన ప్రొఫెసర్‌.. ఎఫ్ఐఆర్ నమోదు - Tholi Paluku