Let's talk: editor@tmv.in
బెంగళూరులో రిటైర్డ్ అధికారి పోస్ట్ కలకలం

బెంగళూరులో రిటైర్డ్ అధికారి పోస్ట్ కలకలం

Panthagani Anusha
31 అక్టోబర్, 2025

ఒక పౌరుడి పట్ల పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదు బెంగళూరు నగర పోలీసు శాఖలో పెను ప్రకంపనలు సృష్టించింది. తన కుమార్తె మరణించిన తర్వాత అడుగడుగునా లంచాలు, వేధింపులు ఎదుర్కొన్నానంటూ ఒక రిటైర్డ్ అధికారి పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన బెల్లందూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ (పీఎస్ఐ), ఒక కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారిని సస్పెండ్ చేశారు.

బాధిత తండ్రి పోస్ట్‌లో ఆవేదన

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో రిటైర్డ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేసిన శివకుమార్ కె. తన కుమార్తె (34) బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించిన తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాన్ని లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వివరించారు. ఈ పోస్ట్‌లో ఆయన ప్రధానంగా లంచం, అహంకారపూరిత ప్రవర్తనపై ఆరోపణలు చేశారు.అంతేకాక అంబులెన్స్, ఎఫ్‌ఐఆర్ కాపీ, దహన సంస్కారాలు, చివరికి మరణ ధృవీకరణ పత్రం (దీనికోసం కార్పొరేషన్ సిబ్బందికి) వంటి ప్రతి పని కోసం తాను డబ్బు చెల్లించవలసి వచ్చిందని శివకుమార్ ఆరోపించారు. అదేవిదంగా బెల్లందూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి, సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో పాటు అహంకారంతో వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా వద్ద డబ్బు ఉంది కాబట్టి నేను చెల్లించగలిగాను మరి పేదవాళ్లకు ఇలాంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది? అని శివకుమార్ ప్రశ్నించారు.

శివకుమార్ అనుభవాన్ని పంచుకున్న పోస్ట్ నెట్టింట విస్తృతంగా వ్యాపించడంతో, నెటిజన్లు దీనిని బెంగళూరు పోలీసులకు, వైట్‌ఫీల్డ్ డీసీపీ (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్) అధికారిక 'X' (ట్విట్టర్) ఖాతాలకు ట్యాగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ పోస్ట్ చుసిన వైట్‌ఫీల్డ్ డీసీపీ కార్యాలయం వెంటనే స్పందిస్తూ ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

బెంగళూరులో రిటైర్డ్ అధికారి పోస్ట్ కలకలం - Tholi Paluku