
బెంగళూరులో యువ జంట ఆత్మహత్య
బెంగళూరు సమీపంలోని అనేకల్ కళ్లబాలు గ్రామంలో ఓ యువ దంపతులు తమ అద్దె ఇంట్లో మృతిచెందిన విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా ఈ యువ జంట మధ్య ఉన్న వ్యక్తిగత వివాదం కారణంగానే వారు ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.
మృతుల సమాచారం ప్రకారం రాకేష్ పత్ర (25) మరియు సీమా నాయక్ (23) గా గుర్తించారు. కాగా ఈ జంట ఒడిశా రాష్ట్రం నుంచి మూడునెలల క్రతమే వలస వచ్చి బెంగళూరులో ఉంటున్నట్లు సమాచారం. అయితే రాకేష్ సమీప పరిశ్రమల ప్రాంతంలోని ప్రైవేటు కంపెనీలో హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు
ఈ క్రమంలో ఆదివారం నుంచి ఈ ఇద్దరు దంపతులు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని వెళ్లి తలుపు కొట్టిన ఎవరూ స్పందించలేదు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బలవంతంగా తలుపు తెరిచి చూడగా ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
స్థానికుల కథనం ప్రకారం రాకేష్ మద్యం తాగి వచ్చి సీమతో తరుచు గొడవపడేవాడని ఎప్పుడు చూసినా వారి గది నుండి గొడవ పడిన శబ్దాలు వినిపించేవని వివరించారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా శుక్రవారం జరిగిన గొడవ తర్వాత రాకేష్ దుపట్టా ఉపయోగించి ఆత్మహత్య చేసుకున్నాడు. సీమా మొదట అతన్ని రక్షించడానికి ప్రయత్నించగా రాకేష్ అప్పటికే మృతి చెందడంతో సీమ కూడా అదే దుపట్టాను ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు.
