
బెంగళూరులో భారీ సైబర్ మోసం
సాంకేతిక రాజధానిగా పేరొందిన బెంగళూరులో సైబర్ భద్రతకు సవాల్ విసురుతూ ఒక సంచలన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ విజ్డమ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలపై జరిగిన భారీ సైబర్ దాడి కేసులో బెంగళూరు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ సైబర్ దొంగతనంలో హ్యాకర్లు విదేశీ ఐపీ అడ్రస్‌లను ఉపయోగించి ఏకంగా రూ. 48 కోట్ల భారీ మొత్తాన్ని అక్రమంగా ఇతర ఖాతాలకు మళ్లించారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ మొత్తం కుట్ర దుబాయ్ నగరం కేంద్రంగా, పక్కా ప్రణాళికతో అంతర్జాతీయ హ్యాకర్ల ముఠా సహకారంతో జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మోసానికి తెరతీసిన ఐపీ అడ్రస్‌లు
కంపెనీ సీనియర్ మేనేజర్ ఆగస్టు 7న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 6, 7 తేదీల్లో తమ కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి అనధికారిక లావాదేవీలు జరిగాయని, ఈ లావాదేవీలన్నీ విదేశీ ఐపీ అడ్రస్‌ల ద్వారా జరిగినట్లు కంపెనీ అంతర్గత విచారణలో గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక పోలీసుల దర్యాప్తు ప్రకారం హ్యాకర్లు మొత్తం 1,782 లావాదేవీలు చేసి, రూ. 47 కోట్లకు పైగా నిధులను 656 వేర్వేరు ఖాతాలకు మళ్లించారు. కాగా ఈ కేసులో తొలుత రూ. 27.39 లక్షలు అందిన ఒక వ్యక్తిని సెప్టెంబర్ 25న అధికారులు అరెస్టు చేశారు.
దుబాయ్ కేంద్రంగా భారీ మోసం
పోలీసుల దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ, ఈ మోసం వెనుక ఉన్న అంతర్జాతీయ లింకులు బయటపడ్డాయి. ఈ భారీ సైబర్ దొంగతనానికి దుబాయ్‌లో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. వీరు ఐదు సర్వర్‌లను అద్దెకు తీసుకుని, హాంకాంగ్‌కు చెందిన ప్రొఫెషనల్ హ్యాకర్లను నియమించుకొని ఈ నేరానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. నియమిత హ్యాకర్లు బ్యాంకు సంబంధిత ఏపీఐ వ్యవస్థలో భద్రతా లోపాలను ఉపయోగించుకుని అనధికారిక నిధుల బదిలీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ అక్రమ బదిలీల హ్యాకర్లు హాంకాంగ్, లిథువేనియా వంటి దేశాల ఐపీ అడ్రస్‌లను సైతం ఉపయోగించారు.అయితే బదిలీ అయిన నిధుల్లో రూ. 5.5 కోట్లు హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ఖాతాకు చేరినట్లు పోలీసులు గుర్తించారు.ఈ భారీ సైబర్ కుంభకోణం, ఆర్థిక సంస్థలు తమ డిజిటల్ భద్రతా వ్యవస్థలను అత్యంత కట్టుదిట్టం చేసుకోవాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తుచేసింది. ప్రస్తుతం పోలీసులు ముఠాలోని మిగిలిన సభ్యుల కోసం అదేవిదంగా అక్రమంగా బదిలీ అయిన నిధుల రికవరీ కోసం గాలిస్తున్నారు
