
బెంగళూరులో ఆంథ్రోపిక్ తొలి భారత కార్యాలయం ప్రారంభం
ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఆంథ్రోపిక్ భారతదేశంలో తన కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎంబసీ గోల్ఫ్ లింక్స్‌లో తన తొలి భారత కార్యాలయాన్ని సోమవారం అధికారికంగా ప్రారంభించింది. టోక్యో తర్వాత ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సంస్థకు ఇది రెండో కేంద్రం. తమ ఏఐ అసిస్టెంట్ 'క్లాడ్'కు ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఎదగడమే ఈ విస్తరణకు ప్రధాన కారణమని సంస్థ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఇరినా ఘోస్ ఈ భారత విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా నాయకత్వం వహించనున్నారు.
ఆదాయంలో జోరు.. సాంకేతికతలో హోరు
భారతదేశంలో ఏఐ వినియోగంపై ఆంథ్రోపిక్ సంస్థ ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది. 2025 అక్టోబరు నుంచి దేశంలో సంస్థ ఆదాయం రెట్టింపు కాగా, ప్రపంచవ్యాప్తంగా క్లాడ్ ఏఐతో జరిగే సంభాషణల్లో 6 శాతం భారత్ నుంచే వస్తుండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన ఏఐ పనులు చేసే నైపుణ్యం గల డెవలపర్లు భారత్‌లో ఉన్నారని ఈ సందర్భంగా సంస్థ కొనియాడింది. ముఖ్యంగా ఇక్కడి 'క్లాడ్' వినియోగంలో సగానికి పైగా కంప్యూటర్, మ్యాథమెటికల్ అప్లికేషన్ల తయారీకి సంబంధించిన పనులే ఉండటం భారతీయుల సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రముఖ సంస్థలతో చేతులు కలిపిన ఆంథ్రోపిక్
కార్యాలయ ప్రారంభంతో పాటు కార్పొరేట్, విద్య, వ్యవసాయ రంగాల్లో పలు కీలక భాగస్వామ్యాలను సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా తన సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, క్రెడ్ సంస్థ కొత్త ఫీచర్లను త్వరగా తీసుకువచ్చేందుకు 'క్లాడ్ ఏఐ'ని వినియోగిస్తున్నాయి. అలాగే కాగ్నిజెంట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన 3.5 లక్షల మంది ఉద్యోగులకు ఈ ఏఐ సేవలను అందుబాటులోకి తెస్తోంది. సామాజిక రంగంలో భాగంగా 'ప్రథమ్' ఎన్జీవోతో కలిసి 20 పాఠశాలల్లో విద్యార్థుల కోసం 'ఎనీటైమ్ టెస్టింగ్ మెషీన్'ను ప్రయోగాత్మకంగా నడుపుతుండగా, వ్యవసాయం, చట్టపరమైన సవాళ్లను పరిష్కరించేందుకు 'కార్య' వంటి సంస్థలతో ఆంథ్రోపిక్ చేతులు కలిపింది.
ప్రాంతీయ భాషల్లో పట్టు.. ప్రభుత్వ తోడ్పాటు
భారతీయ వినియోగదారుల కోసం తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళం సహా 10 ప్రధాన భాషల్లో క్లాడ్ ఏఐకి శిక్షణ ఇచ్చినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వ రంగంలోనూ ఏఐ ముద్ర మొదలైంది. కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల తొలి ప్రభుత్వ 'మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్' (ఎంసీపీ) సర్వర్‌ను ప్రారంభించింది. ప్రముఖ డెలివరీ యాప్ 'స్విగ్గీ' సైతం తమ వినియోగదారులు నేరుగా ఏఐ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేసేలా ఈ సాంకేతికతను వాడుకుంటోంది.
వ్యాపార విస్తరణే లక్ష్యం
"బాధ్యతాయుతమైన ఏఐని ప్రజలకు, సంస్థలకు చేరవేయడంలో భారత్ ఒక అద్భుతమైన అవకాశం" అని ఇరినా ఘోస్ పేర్కొన్నారు. త్వరలోనే అమ్మకాలు, పాలసీ, ఇంజనీరింగ్ విభాగాల్లో స్థానికంగా భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. దేశంలోని సాంకేతిక ప్రతిభ, డిజిటల్ మౌలిక సదుపాయాలే ఏఐ విప్లవానికి బలమైన పునాది అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
