Let's talk: editor@tmv.in
బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలి: భూమన కరుణాకర్ రెడ్డి

బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలి: భూమన కరుణాకర్ రెడ్డి

Panthagani Anusha
21 మార్చి, 2026

రాబోయే ఎన్నికలే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీ కార్యకర్తలు నియోజకవర్గాల స్థాయి నేతలతో శుక్రవారం తిరుపతిలో భారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలే పార్టీకి వెన్నెముక అని బీఎల్వో స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

డబుల్ ఓటింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

గడిచిన రెండేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భూమన విమర్శించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం డబుల్ ఓటింగ్ లేకుండా చూడటమే మన ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. "నియోజకవర్గ ఇంచార్జులు, బీఏఐ ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల కమిషన్ నిర్వహించే ప్రతి సమావేశానికి హాజరై మన ఓటర్ల జాబితాను కాపాడుకోవాలి. డబుల్ ఓటింగ్ అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి, మనం కూడా బూత్ స్థాయిలో పోరాడాలి అని ఆయన దిశానిర్దేశం చేశారు.

అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు: రోజా

మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయని ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. బీఎల్వో స్థాయి అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారు. మన గ్రామంలో లేని వారు ఎక్కడున్నారో గుర్తించి దొంగ ఓట్లను ఏరిపారేయాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా చేర్పించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి అని ఆమె సూచించారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని చూసి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని సరైన సమయం చూసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రోజా పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి, పూతలపట్టు ఇంచార్జ్ డాక్టర్ సునీల్, సత్యవేడు ఇంచార్జ్ నూకతోటి రాజేష్, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, జిల్లా బూత్ కమిటీ ప్రతినిధి ముప్పాళ్ల సాయి కుమారి, యోగాంజనేయరెడ్డి భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలి: భూమన కరుణాకర్ రెడ్డి - Tholi Paluku