
బూటకపు ప్రకటనలతో మోసం
గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని సత్యసాయిజిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం సానిపల్లి గ్రామంలో ఆదివారం ఆమె పర్యటించారు. ఉల్లికి గిట్టుబాటు ధరలేక.. దాదాపు 200 క్వింటాళ్ల ఉల్లిని చెత్తలో పారబోసిన రైతు వీరాంజిని కలిసి పరామర్శించారు. గిట్టుబాటు ధరలు లభించేంత వరకు రైతుల తరపున పోరాడుతామని ఉషశ్రీ చరణ్ హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉల్లి, పత్తి, మిరప పంటలకు కనీస గిట్టుబాటు లభించడంలేదని ఆరోపించారు. ఉల్లిని రూ. 1200కు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా, ఎక్కడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని విమర్శించారు. ఉల్లికి హెక్టారుకు రూ. 50వేలు ప్రకటించినా సరిపోదని అన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు. బూటకపు ప్రకటనలు చేస్తూ మోసగిస్తోందని మండిపడ్డారు.
అధికారంలోకి రాకముందు ఒకలా.. అధికారంలోకి వచ్చాక ఒకలా టీడీపీ వ్యవహరిస్తోందని ఉషశ్రీచరణ్ గుర్తుచేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. రెండు ఎకరాలలో ఉల్లి పంట సాగు చేసి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా తమకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేదని రైతు ఈడిగ అనితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లికి మద్దతు ధరలేక ఏమి చెయ్యాలో అర్దం కాక పారబోశానని అన్నారు. ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి ఏమి పట్టించుకోవడం లేదన్నారు.
