
బుల్డోజర్ రాజకీయాలా మాకు నేర్పేది?: సీఎం రేవంత్‌పై కేరళ సీఎం ఫైర్
కేరళ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేరళకు వచ్చి ప్రగతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని విజయన్ ఎద్దేవా చేశారు.
గణాంకాలతో విజయన్ కౌంటర్
సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్‌బుక్‌లలో స్పందించిన విజయన్, తమ రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించే వ్యక్తి కేరళకు వచ్చి సామాజిక అభివృద్ధి గురించి ఉపదేశించడం విచిత్రం అని వ్యాఖ్యానించారు. కేరళ అభివృద్ధి మోడల్‌ను దెబ్బతీయాలనుకునే శక్తులకు ఆయన వక్తగా మారారని కూడా విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన అవినీతి, దుష్పరిపాలన ఆరోపణలను తిప్పికొడుతూ విజయన్ నీతి ఆయోగ్ డేటాను ప్రస్తావిస్తూ.. కేరళ దేశంలో అత్యల్ప అవినీతి ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. నీతి ఆయోగ్, ఎస్డీజీ సూచీలో కేరళ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ ఆరవ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కేరళ అభివృద్ధిని తగ్గించి చూపించడం ద్వారా తమ రాష్ట్రంలోని లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం విచారకరమని అన్నారు.
పేదరికం, అక్షరాస్యత పరంగా కూడా రెండు రాష్ట్రాల మధ్య తేడాను విజయన్ ప్రస్తావించారు. కేరళలో పేదరికం కేవలం 0.55శాతం మాత్రమే ఉందని, 2025 చివరి నాటికి దేశంలోనే అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రంగా కేరళ నిలుస్తుందని చెప్పారు. తెలంగాణలో పేదరికం 5.88శాతంగా ఉందని, అక్కడ పేదలను ఉద్ధరించడం ప్రభుత్వం మానేసిందా అని ప్రశ్నించారు .అలాగే కేరళ అక్షరాస్యత 95.3శాతం కాగా, తెలంగాణ 76.9శాతం వద్ద ఇంకా వెనుకబడే ఉందని విజయన్ ఎత్తిచూపారు. ఆరోగ్య సూచీల విషయానికొస్తే, కేరళలో శిశు మరణాల రేటు కేవలం 5 మాత్రమే ఉందని, తెలంగాణలో ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని విమర్శించారు. కేరళలో బలమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థ వల్ల సాధారణ భారతీయుడితో పోలిస్తే మలయాళీలు 5–7 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తున్నారని అన్నారు.
రాజకీయ విమర్శలు - "మోడీ బ్రదర్స్"
అంతకుముందు కొచ్చిలో యుడిఎఫ్ మేనిఫెస్టోను విడుదల చేస్తూ, కేరళలో విజయన్ చీకటి యుగం ముగిసిందని, కాంగ్రెస్ నాయకత్వంలో స్వర్ణ యుగం వస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మోహన్ లాల్ సినిమా డైలాగ్ పో మోనే విజయ (వెళ్ళిపో విజయన్) అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా, ప్రధాని మోడీ, సీఎం విజయన్ ఇద్దరూ "మోడీ బ్రదర్స్" అని, వారి మధ్య రహస్య ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపించారు.
దీనికి విజయన్ స్పందిస్తూ.. కేంద్రం కేరళపై ఆర్థిక ఆంక్షలు విధిస్తుంటే నోరు మెదపని కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి అసలైన "బి-టీమ్" అని మండిపడ్డారు. జీతాలు, పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేని తెలంగాణ ప్రభుత్వం కేరళకు పాలన గురించి నేర్పాల్సిన అవసరం లేదని, కావాలంటే కేరళ వచ్చి ప్రజా సంక్షేమం గురించి పాఠాలు నేర్చుకోవాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
తెలంగాణ ప్రభుత్వం కేరళలో రాజకీయ ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేయడంపై కూడా విజయన్ ప్రశ్నించారు. ఆ నిధులను తమ రాష్ట్రంలోని పేదరిక నిర్మూలన, విద్యాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. అలాగే సెప్టెంబర్ 2025లో తెలంగాణ రెవెన్యూ అధికారులు కేరళ డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థ గురించి అధ్యయనం చేయడానికి తిరువనంతపురం వచ్చారని విజయన్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న మోడల్‌ను కాపీ కొడుతూనే, బహిరంగంగా విమర్శలు చేయడం రేవంత్ రెడ్డి ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
ఇదిలా ఉండగా, కేరళలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనుండగా, ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 23తో ముగియనుంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సాగుతున్న ఈ గణాంకాల యుద్ధం రాజకీయ వేడిని పెంచింది.
