

బుర్కినా ఫాసోకు భారత్ మానవతా సాయం
అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజల కోసం 1,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మానవతా సాయంగా పంపింది. అక్కడి నిరుపేదలు, అంతర్గతంగా నిరాశ్రయులైన వారికి ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ భారీ విరాళాన్ని భారత్ పంపిణీ చేసింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. గ్లోబల్ సౌత్ దేశాలకు భారత్ ఎల్లప్పుడూ నమ్మకమైన అభివృద్ధి, విపత్తు సహాయక భాగస్వామిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
బలోపేతం అవుతున్న దౌత్య సంబంధాలు
భారత్, బుర్కినా ఫాసో దేశాల మధ్య దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. 1996లో న్యూఢిల్లీలో బుర్కినా ఫాసో తన మిషన్‌ను ఏర్పాటు చేయగా, 2011లో దానిని రాయబార స్థాయికి పెంచింది. భారత్ కూడా 2019 మార్చిలో బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగౌలో తన రెసిడెంట్ మిషన్‌ను పునఃప్రారంభించింది. ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా జరుగుతున్న రాజకీయ చర్చలు, సంప్రదింపులు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ఉన్నత స్థాయి పర్యటనలు రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంచుతున్నాయి.
సాంకేతిక రంగంలోనూ భారత్ చేయూత
గత నవంబర్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, బుర్కినా ఫాసో తాత్కాలిక శాసనసభ అధ్యక్షుడు ఉస్మాన్ బౌగౌమాతో భేటీ అయ్యారు. భారత పార్లమెంటులో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచేందుకు 'డిజిటల్ సంసద్', 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' వంటి సాంకేతికతలను ఎలా వాడుతున్నారో ఆయన వివరించారు. భవిష్యత్తులో బుర్కినా ఫాసో శాసనసభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఓం బిర్లా హామీ ఇచ్చారు. బుర్కినా ఫాసో అభివృద్ధి లక్ష్యాలకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
