
బుద్ధుని బోధనలు మానవాళికి మార్గదర్శకం: మోదీ
భగవాన్ బుద్ధుని పవిత్ర చిహ్నాలు కేవలం చారిత్రక వస్తువులు మాత్రమే కావని, అవి భారతదేశ నాగరికతలో అంతర్భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో 'ది లైట్ అండ్ ది లోటస్: రిలిక్స్ ఆఫ్ ది అవేకెన్డ్ వన్' పేరుతో ఏర్పాటు చేసిన పవిత్ర పిప్రావా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"నా జీవితంపై భగవాన్ బుద్ధుని ప్రభావం చాలా లోతుగా ఉంది. బౌద్ధ బోధనలకు నిలయమైన వడ్‌నగర్‌లో నేను జన్మించడం నా అదృష్టం. అలాగే బుద్ధుడు తన తొలి బోధనలు చేసిన సార్నాథ్ నా కర్మభూమి కావడం గర్వకారణం," అని మోదీ అన్నారు.
దాదాపు 125 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, పరాయి పాలనలో దేశం దాటి వెళ్ళిన ఈ పవిత్ర అవశేషాలు తిరిగి మాతృభూమికి చేరుకోవడం చారిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. గత ఏడాది మే నెలలో హాంకాంగ్‌లో వేలానికి సిద్ధమైన ఈ అవశేషాలను ప్రభుత్వం, గోద్రెజ్ గ్రూప్ జోక్యంతో ఇక్కడికి తీసుకురావడం సాధ్యమయ్యిందని మోదీ పేర్కొన్నారు.
తాను విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా బుద్ధుని వారసత్వాన్ని తీసుకెళ్లానని, జపాన్, చైనా మంగోలియా వంటి దేశాలకు వెళ్ళినప్పుడు బోధి మొక్కను కానుకగా తీసుకెళ్లిన విషయాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. అలాగే అణుబాంబు దాడికి గురైన హిరోషిమా (జపాన్) నగరంలోని బొటానికల్ గార్డెన్‌లో తాను నాటిన 'బోధి మొక్క' మానవాళికి శాంతి సందేశాన్ని అందిస్తోందని ఆయన అన్నారు. పవిత్ర పిప్రావా అవశేషాలు వియత్నాం, థాయ్‌లాండ్, రష్యా వంటి దేశాల్లో పర్యటించినప్పుడు అక్కడ భక్తిప్రపత్తులు మిన్నంటాయని ప్రధాని గుర్తుచేశారు. ఈ ఉమ్మడి వారసత్వం ద్వారా భారత్ కేవలం రాజకీయాలు, దౌత్యంతోనే కాకుండా.. భావోద్వేగాలు, విశ్వాసం,ఆధ్యాత్మికతతో ప్రపంచంతో ముడిపడి ఉందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మోడి, బుద్ధుని బోధనలు ఉన్న 'పాలి' భాషను ప్రాచీన భాషా హోదా కల్పించడం ద్వారా ఆ జ్ఞానాన్ని సామాన్యులకు చేరువ చేస్తున్నామని తెలిపారు.
ప్రదర్శన ప్రత్యేకత:
ఈ ఎగ్జిబిషన్‌లో 1898లో పిప్రావా వద్ద కనుగొనబడిన బుద్ధుని అస్థికలు, విలువైన రత్నాలు పురాతన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. వీటిని చూసేందుకు యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఈ ప్రదర్శనలో శతాబ్దానికి పైగా కాలం తర్వాత విదేశాల నుంచి తిరిగి తీసుకొచ్చిన పిప్రహ్వా అవశేషాలను,న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియం, కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరిచిన అసలైన అవశేషాలు, పురావస్తు సంపదతో కలిపి మొదటిసారిగా ఒకే వేదికపై ప్రదర్శించారు.
1898లో కనుగొన్న పిప్రహ్వా అవశేషాలు ప్రారంభ బౌద్దమత పురావస్తు అధ్యయనంలో అత్యంత కీలక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి భగవాన్ బుద్దునికి నేరుగా సంబంధం ఉన్న అత్యంత ప్రాచీన, చారిత్రకంగా ముఖ్యమైన అవశేషాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. పురావస్తు ఆధారాలు పిప్రహ్వా ప్రదేశాన్ని ప్రాచీన కపిలవస్తుతో అనుసంధానిస్తున్నాయి. కపిలవస్తు అనేది సన్యాసం స్వీకరించే ముందు భగవాన్ బుద్ధ తన ప్రారంభ జీవితం గడిపిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.
ఈ ప్రదర్శన భగవాన్ బుద్దుని బోధనలతో భారత్‌కు ఉన్న లోతైన, నాగరిక సంబంధాన్ని తెలియజేస్తుంది. భారత దేశ గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలనే ప్రభుత్వ నిరంతర కృషి, సంస్థాగత సహకారం, వినూత్న ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఈ అవశేషాలను ఇటీవల తిరిగి స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైంది.
ఈ ప్రదర్శనను వివిధ ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేశారు. సాంచి స్తూపం నుంచి స్పూర్తి పొందిన పునర్నిర్మిత వ్యాఖ్యానాత్మక నమూనా దీనికి ప్రధాన ఆకర్షణ. ఇందులో జాతీయ సేకరణల నుంచి తీసుకొచ్చన అసలైన అవశేషాలు, అరుదైన వస్తువులను ఒకచోట ప్రదర్శించారు. ఇతర విభాగాల్లో పిప్రహ్వా పురావస్తు విశేషాల పునశ్చరణ, బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలు, దృశ్యాదృశ్యాలు, బౌద్ధ బోధనల సౌందర్య భాష, సరిహద్దులు దాటి విస్తరించిన బౌద్ధ కళలు, ఆదర్శాలు, సాంస్కృతిక కళాఖండాల స్వదేశ పునరాగమనం, నిరంతర ప్రయత్నం వంటివి ఉన్నాయి.
సాధారణ ప్రజలకు ఈ అవశేషాల ప్రాముఖ్యత సులభంగా అర్థం కావడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో లీనమయ్యే చిత్రాలు, డిజిటల్ పునర్నిర్మాణాలు, మల్టీమీడియా ప్రదర్శనలు ఉన్నాయి. ఈ అంశాలు భగవాన్ బుద్దునిధ జీవితం, పిప్రహ్వా అవశేషాల ఆవిష్కరణ, అవి ప్రాంతాల మధ్య ప్రయాణించిన విధానం, వాటికి సంబంధించిన కళా సంప్రదాయాలపై సులభంగా అర్థమయ్యేలా అవగాహనను అందిస్తాయి.
