Let's talk: editor@tmv.in
బుదౌన్‌లో వింత ఘటన: రైతా తిని రేబీస్ టీకా తీసుకున్న 200 మంది

బుదౌన్‌లో వింత ఘటన: రైతా తిని రేబీస్ టీకా తీసుకున్న 200 మంది

Pinjari Chand
30 డిసెంబర్, 2025

అంత్యక్రియల తరువాత పెట్టే భోజనం చేశాక ఆ గ్రామంలో సుమారు 200 మంది రేబీస్ టీకాలు తీసుకున్నారు. అలా ఎందుకు తీసుకున్నారు. ఏమైంది అన్న వివరాలు తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లా పిప్రౌలి గ్రామంలో జరిగిన ఒక అంత్యక్రియల కార్యక్రమంలో వడ్డించిన రైతా (పెరుగుతో చేసిన వంటకం) తిన్న దాదాపు 200 మంది గ్రామస్తులు రేబీస్ టీకాలు తీసుకున్నారు. ఇది పూర్తిగా ముందు జాగ్రత్త చర్యగా చేపట్టినదని వైద్య అధికారులు తెలిపారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం డిసెంబర్ 23న జరిగిన అంత్యక్రియల భోజనంలో రైతా వడ్డించారు. అయితే ఆ రైతా తయారీలో ఉపయోగించిన పాలు ఇచ్చిన గేదెకు కొద్ది రోజుల ముందు కుక్క కాటు వేసిందని తర్వాత తెలిసింది. ఆ గేదె డిసెంబర్ 26న మృతి చెందింది, దీంతో గ్రామంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే గ్రామస్తులు ఉజ్హాని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అయితే అందరూ రేబీస్ టీకాలు తీసుకున్నారు.

ప్రతి ఒక్కరికీ టీకా వేశాం

జిల్లా ముఖ్య వైద్యాధికారి డా. రామేశ్వర్ మిశ్రా మాట్లాడుతూ ఆ గేదెకు రేబీస్ లక్షణాలు ఉన్నాయని సమాచారం వచ్చింది. పాలను మరిగించిన తర్వాత సాధారణంగా రేబీస్ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉండదు. అయినప్పటికీ ‘నివారణే ఉత్తమం’ అనే ఉద్దేశంతో సందేహం ఉన్న ప్రతి ఒక్కరికీ రేబీస్ టీకా వేశామని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి వ్యాధి రాలేదని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజల్లో అపోహలు, భయాందోళనలు వ్యాపించకుండా గ్రామంలో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. టీకాలు అందించేందుకు శనివారం, ఆదివారం కూడా ఆరోగ్య కేంద్రాలను తెరిచి ఉంచారు. గ్రామస్తుడు ధర్మపాల్ మాట్లాడుతూ కుక్క కాటు వల్ల గేదె అనారోగ్యం పాలై చనిపోయింది. అదే గేదె పాలతో రైతా తయారైందన్న విషయం తెలిసిన తర్వాత భయంతో టీకాలు తీసుకున్నామని తెలిపారు. అయితే ఒక్కసారి రేబీస్ వచ్చిందంటే అది వంద శాతం ప్రాణాంతకం అని వైద్యులు తెలిపారు.

బుదౌన్‌లో వింత ఘటన: రైతా తిని రేబీస్ టీకా తీసుకున్న 200 మంది - Tholi Paluku