Let's talk: editor@tmv.in
బీహార్ సీఎం పదవికి నేడు నితీష్ కుమార్ రాజీనామా

బీహార్ సీఎం పదవికి నేడు నితీష్ కుమార్ రాజీనామా

Panthagani Anusha
14 ఏప్రిల్, 2026

బీహార్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో శాసించిన నితీష్ కుమార్ శకం ముగియనుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలో రాష్ట్రంలో తొలిసారిగా తమ సొంత పార్టీకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు రంగం సిద్ధమైంది. నేడు జరగనున్న వరుస రాజకీయ పరిణామాలతో పట్నా వేదికగా అధికార మార్పిడి ప్రక్రియ వేగవంతం కానుంది.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు ఉదయం 11 గంటలకు తన నివాసంలో చివరిసారిగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీలో కేబినెట్ రద్దుకు సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన నేరుగా రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. కాగా ఇటీవల ఆయన రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ రాజీనామా ఒక రాజ్యాంగపరమైన ప్రక్రియ అని మంత్రి దిలీప్ జైస్వాల్ వెల్లడించారు.

ఢిల్లీ నుంచి పర్యవేక్షణ

నూతన ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర పరిశీలకుడిగా పట్నాకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ పక్ష నేతలందరూ భేటీ అయి కొత్త నాయకుడిని అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత రానుంది.

ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్ చౌధరీ

కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, కోయరి సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌధరీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీ అగ్రనేత అమిత్ షా ఆశీస్సులు ఆయనకు ఉండటం యువతలో ఆయనకున్న క్రేజ్ కలిసొచ్చే అంశాలు. అయితే అనూహ్యంగా కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అనూహ్య వ్యక్తులను ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం బీహార్ విషయంలోనూ అదే తరహా ‘సర్ప్రైజ్’ ఇస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

మారిన సామాజిక సమీకరణాలు

బీహార్‌లో ఇన్నాళ్లూ నితీశ్ కుమార్ ‘లవ్-కుశ్’ (కోరి-కుర్మి) సమీకరణంపై పట్టు సాధించారు. ఇప్పుడు బీజేపీ సొంతంగా అధికార పగ్గాలు చేపట్టనుండటంతో ఓబీసీ నాయకత్వాన్ని బలపరిచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. 243 స్థానాలున్న అసెంబ్లీలో జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ బలం ఉండటంతో నిర్ణయాధికారం పూర్తిగా కమలదళం చేతుల్లోనే ఉంది. మరోవైపు నితీశ్ కుమారుడు నిషాంత్‌ను కొత్త కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో జేడీయూ కార్యాలయంలో పాత నినాదాలతో కూడిన పోస్టర్లను తొలగించడం రాష్ట్రంలో రాబోయే పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. నేటి సాయంత్రం వెలువడనున్న ప్రకటనతో బీహార్ కొత్త సారథి ఎవరన్న ఉత్కంఠకు తెరపడనుంది.