
బీహార్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోట్ గురువారం మహాఘట్భంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజశ్వి యాదవ్ పేరును ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం అభ్యర్థిగా తేజశ్వి యాదవ్ పేరు రావడం సహజమే. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలందరూ తేజస్వీని సీఎం అభ్యర్థిగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా ఆయన పేరును ప్రకటించాం. అలాగే డిప్యూటీ సీఎంగా వికాశ్ షీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడైన ముఖేశ్ సహనీని ప్రకటించారు. ప్రజలు తేజశ్వికి మద్దతు ఇస్తారని నేను భావిస్తున్నా. ఆయన యువకుడు మంచి భవిష్యత్తు ఉంది. ఈ ఎన్నికలో గెలిచిన అనంతరం మేం ఆయన సారథ్యంలో బీహార్‌ను ముందుకు తీసుకెళ్తామన్నారు. మరో నాయకుడు, యువకుడైన సహనీకి కూడా మంచి భవిష్యత్ ఉంది. అణగారిన వర్గాల నుంచి వచ్చి, పార్టీ స్థాపించి కష్టపడుతున్నారని కొనియాడారు.మహాఘట్భంధన్ బీహార్ అభివృద్ధి కోసం పనిచేయడానికి సిద్ధమన్నారు. మేం కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, సీఎం కావడానికి ప్రయత్నించడం లేదు. బీహార్ అభివృద్ధి కోసం అందరం ప్రయత్నం చేస్తున్నాం. మాకు అవకాశం ఇస్తే వారు 20 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని 20 నెలల్లోపు చేసి చూపిస్తామన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పిస్తామన్నారు.
ఎన్డీయే పై తేజశ్వీ విమర్శలు
ఎన్డీయే సీఎం అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇంతవరకు ఒకసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు. మేం కూటమిలోని ఇతర పార్టీ నాయకులతో కలిసి సమావేశాలు నిర్వహించాం. సీఎం అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించాం. ఎన్డీయేలో నితీశ్ కుమార్ కు అన్యాయం జరుగుతోంది. ఇది నితీశ్ కుమార్‌కి చివరి ఎన్నిక. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని చాలా సార్లు ఆయన మీడియా ముందు చెప్పారు. జేడీయూలో కొంతమంది నేతలు పార్టీని బ్రష్టుపట్టించడానికి బీజేపీ నాయకులతో కలిసి పనిచేస్తున్నారు. బీజేపీ నాయకులు మళ్లీ నితీశ్‌ను సీఎం చేయడానికి అంగీకరించరు. అలాగే ఎన్నికల తర్వాత జేడీయూ ఎన్డీయే నుంచి బయటికి వస్తుందని జోస్యం చెప్పారు. బీహార్ లో ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న,రెండో దశ 11న, ఫలితాలు 14 వస్తాయి.
