Let's talk: editor@tmv.in
బీహార్​ ‘సర్​’ ప్రక్రియ విజయవంతం

బీహార్​ ‘సర్​’ ప్రక్రియ విజయవంతం

Pinjari Chand
1 అక్టోబర్, 2025

బీహార్​ లో స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​(సర్​)పై ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్న ఎలక్షన్​ కమిషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. తుది జాబితాలో ఓటర్లు సుమారు 7.42 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్​ 24 నాటికి 7.89 ఓటర్లు ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం ముసాయిదా జాబితా నుంచి దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించింది. అయితే ఇదే ఏడాది ఆగష్టు 1 నాటికి ముసాయిదా జాబితాలో 7.24 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై రాజకీయ పార్టీలు బీహార్​ ఓట్ల తొలగింపు అంశంపై గగ్గోలు పెట్టాయి.

ఎన్నికల కమిషన్​ పై ఆరోపణలు చేశాయి. ఓటర్లను తొలగించి కేంద్ర ప్రభుత్వానికి ఈసీఐ సహయపడుతుందని విమర్శించారు. అయితే మంగళవారం తుది జాబితాను ప్రచురించింది. ‘సర్​’ ప్రక్రియలో భాగంగా అర్హులైన వారి నుంచి ఫాం–6 లో చేర్చడంతో 7.42 కోట్లకు చేరింది. దీని ద్వారా దాదాపు 18 లక్షల మంది ఓటర్లను జాబితాలో చేర్చారు. జూలై 20, 2025 నాటికి ఓటర్ జాబితాలో ఉన్న వలసవచ్చిన వారిని, మరణించినవారిని, కొత్తగా చేరిన వారి వివరాలు సేకరించి తుది జాబితాను ఇచ్చారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడంతో ప్రజలు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ భారత ఎన్నికల సంఘం అభినందించింది.

పార్టీలకు డిజిటల్​ కాపీలు

బీహార్ లోని ఓటర్ల జాబితాకు సంబంధించిన డిజిటల్ జాబితాను ఆయా రాజకీయ పార్టీలతో పంచుకున్నామని, ఓటరు తనిఖీకి సంబంధించి లింక్​ ను కూడా పత్రిక ప్రకటనలో ఇస్తామన్నారు. రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం ‘అర్హత కలిగిన ఏ ఓటరును తొలగించకూడదు. అనర్హులను ఓటర్ జాబితాలో చేర్చకూడదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఓటర్ల జాబితాలో పేర్లు రాని వారు ఎన్నికల నామినేషన్​ కు 10 రోజుల ముందు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎవరైనా ఓటర్​ జాబితా పట్ల అసంతృప్తిగా ఉంటే ఆర్పీ చట్టం 1950లోని సెక్షన్​ 24 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్​(కలెక్టర్)కు మొదటి అప్పీల్​ చేసుకోవాలని, అక్కడి నుంచి సరైన సమాధానం రాకుంటే రెండో అప్పీల్​ కింద చీఫ్ ఎలక్షన్​ ఆఫీసర్ కు చేయవచ్చని తెలిపింది.

ఓటర్​ జబితా సవరణలో బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి, 38 జిల్లాల ఎన్నికల అధికారులు, 243 మంది ఎలక్టోరల్​ రిజిస్ట్రేషన్​ అధికారులు, 2,976 మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, దాదాపు లక్ష మంది బూత్ లెవల్‌ అధికారులు(బీఎల్వోలు) అలాగే లక్షలాది మంది వాలంటీర్లు, 1.6 లక్షల మంది బూత్ లెవల్ ఏజెంట్లు, 12 ప్రధాన రాజకీయ పార్టీల సహకారంతో ఓటరు సవరణ జాబితా విజయవంతమైందని ఎన్నికల అధికారులు వివరించారు. ‘సర్’ వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను అక్టోబర్​ 7న విచారించనుంది. అంతకంటే ముందుగానే ఓటర్ తుది జాబితాను కమిషన్​ విడుదల చేసింది. దీంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

బీహార్​ ‘సర్​’ ప్రక్రియ విజయవంతం - Tholi Paluku