Let's talk: editor@tmv.in
బీహార్ శాసనసభ పక్ష నేతగా నితీశ్ ఎన్నిక

బీహార్ శాసనసభ పక్ష నేతగా నితీశ్ ఎన్నిక

Pinjari Chand
20 నవంబర్, 2025

బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతకంటే ముందు జేడీయూలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జేడీయూ పక్షం ఎమ్మెల్యేల సమావేశంలో నితీశ్‌కుమార్‌ను శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని జేడీయూ నాయకులు శ్రవణ్‌ కుమార్‌ ప్రకటించారు. పాట్నాలోని సీఎం కార్యాలయ సముదాయంలో ఉన్న ‘సంవాద్‌’లో బుధవారం జరిగిన ఈ సమావేశానికి కొత్తగా గెలిచిన అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మొదటగా నితీశ్ పేరును విజయ్‌ చౌదరి, ఉమేశ్‌ కుష్వాహా ప్రతిపాదించగా, బిజేంద్ర యాదవ్‌ మద్దతు తెలిపారు. అనంతరం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్‌ ఝా, కేంద్ర మంత్రి లలన్ సింగ్‌ కూడా సమర్థించారు. శాసనపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత నితీశ్ కుమార్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడాలి అంటూ ప్రజాప్రతినిధులకు సూచించారు.

ఇప్పటికే ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలోనూ నితీశ్‌ను కూటమి నేతగా ఎన్నుకునే అవకాశం ఖాయమైందని శ్రవణ్‌ కుమార్ వెల్లడించారు. గురువారం గాంధీ మైదానంలో నితీశ్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం గవర్నర్‌ అరీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటకు చర్యలు ప్రారంభించాలని కోరనున్నారు. ఎన్డీయే మిత్రపక్షాల మద్దతు తెలిపిన వివరాలను కూడా గవర్నర్‌కి అందజేయనున్నారు. ప్రస్తుత అసెంబ్లీని బుధవారమే రద్దు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసి 202 స్థానాలు గెలుచుకుంది. ఇందులో బీజేపీ–89, జేడీయూ–85, ఎల్జేపీ–19, హెచ్ఏఎం–5, ఆర్ఎల్ఎం–4 సీట్లు దక్కాయి.

ఎన్నికల కంటే ముందు నితీశ్ కుమార్ వృద్ధాప్య పింఛన్లు, జీవిక, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు స్కాలర్ షిప్లు, మహిళా రోజ్గార యోజన వంటి కీలక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వీటి ప్రభావం కూడా పోలింగ్‌లో కనిపించిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. జయప్రకాశ్ నారాయణన్ ఉద్యమం నుంచే రాజకీయాల్లోకి ప్రవేశించిన నితీశ్ (1951–బఖ్తియార్పూర్‌ లో జన్మించారు), 1977లో తొలి ప్రయత్నంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా, 1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

బీజేపీ శాసనపక్ష నేతగా సామ్రాట్‌..డిప్యూటీగా విజయ్‌ సింహ

బీజేపీలో కీలక నియామకాలు పూర్తయ్యాయి. బుధవారం బీహార్ లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో సామ్రాట్‌ చౌదరిని శాసనపక్ష నేతగా, విజయ్‌కుమార్‌ సింహాను ఉప నేతగా పార్టీ ఎన్నుకుంది. ఈ విషయాన్ని బీజేపీ కేంద్ర పరిశీలకుడు, ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఇద్దరికీ కేంద్ర పరిశీలకులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ మళ్లీ నాపై నమ్మకం ఉంచింది. ఆ విశ్వాసానికి తగ్గ పని చేస్తానని సామ్రాట్‌ చౌదరి అన్నారు. బీహార్‌ అభివృద్ధికే తమ కృషి అంకితం కానుందని స్పష్టం చేశారు. విజయ్‌కుమార్‌ సింహా మాట్లాడుతూ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, జాతీయ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ నేత ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ నవంబర్‌ 20న జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం ‘చారిత్రాత్మకంగా నిలుస్తుంది’ అన్నారు. ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని చెప్పారు.