Let's talk: editor@tmv.in
బీహార్ లో తొలి దశ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

బీహార్ లో తొలి దశ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

Pinjari Chand
6 నవంబర్, 2025

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు (గురువారం) 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దశలో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం, పోలింగ్ కేంద్రాల సంఖ్య 45,341 కాగా, వీటిలో మహిళలకు, వికలాంగులకు ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు. కొత్తగా ఓటర్ల జాబితాలో చేరినవారు 10.72 లక్షలు కాగా, 18-19 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు 7.78 లక్షలు ఉన్నారు. మొత్తం ఈ నియోజకవర్గాల జనాభా 6.60 కోట్లుగా ఉంది.

పోలింగ్‌కు ముందు అధికారులకు ఈవీఎంల పంపిణీ పూర్తయ్యింది. శాంతియుతంగా ఓటింగ్ జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జోన్ స్థాయి, సూపర్ జోన్ స్థాయిల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. క్యాప్ఫ్, రాష్ట్ర పోలీసులు అన్ని కేంద్రాల్లో మోహరించారు. నదీ ప్రాంతాల్లో పోలింగ్ పార్టీల రాకపోకల కోసం పడవల సదుపాయమూ కల్పించామని పాట్నా సెంట్రల్ సిటీ ఎస్పీ దీక్షా తెలిపారు.

ఈ దశలో రాష్ట్ర ప్రముఖ నేతల భవితవ్యాలు తేలనున్నాయి. రాఘోపూర్ నుంచి మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి ప్రసాద్ యాదవ్ బరిలో ఉన్నారు. 2020లో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్‌తో ఆయన పోటీపడుతున్నారు. తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కొత్తగా స్థాపించిన ‘జనశక్తి జనతా దళ్’ తరఫున మహువా నుంచి పోటీ చేస్తున్నారు. ముంగేర్ జిల్లా తరాపూర్ నుంచి ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత సమ్రాట్ చౌదరి, ఆర్‌జేడీ అభ్యర్థి అర్యణ్ కుమార్, జనసురాజ్ అభ్యర్థి సంతోష్ కుమార్ సింగ్‌ల మధ్య త్రిపక్ష పోటీ ఉంది. లఖిసరాయ్ నుంచి ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా, కాంగ్రెస్ అభ్యర్థి అమరేశ్ కుమార్‌ల మధ్య పోటీ జరుగుతోంది. మొకామా నియోజకవర్గం కూడా చర్చనీయాంశంగా మారింది. హత్యకేసులో అరెస్టైన జేడీయూ అభ్యర్థి ఆనంద్ సింగ్, మాజీ ఎంపీ సురజ్‌భాన్ సింగ్ భార్య వీనా దేవి మధ్య గట్టి పోటీ నెలకొంది. దర్భంగా నియోజకవర్గంలో బీజేపీ గాయని మైథిలీ ఠాకూర్‌ను బరిలోకి దించింది. ఆమె 25 ఏళ్ల వయసులోనే ఎన్నికల్లో పోటీ చేస్తూ, గెలిస్తే రాష్ట్రంలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నిలుస్తుంది.

తొలి దశలో మహిళా అభ్యర్థులు 122 మంది బరిలో ఉన్నారు. జనసురాజ్ పార్టీ ఈ దశలో 119 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎన్‌డీఏ కూటమిలో జేడీయూ 57, బీజేపీ 48, ఎల్జేపీ (రాం విలాస్) 14 స్థానాల్లో పోటీ చేస్తోంది. మహాఘట్‌బంధన్‌లో ఆర్‌జేడీ 73, కాంగ్రెస్ 24, సీపీఐ (ఎంఎల్) 14 స్థానాల్లో పోటీ చేస్తోంది.

ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. భద్రతా కారణాల వల్ల కొన్నిచోట్ల ఓటింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటలకు పరిమితం చేశారు. అంతర్జాతీయ ఎన్నికల పరిశీలకుల బృందం కూడా ఈ దశ పోలింగ్‌ను వీక్షించనుంది. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్–2025’లో భాగంగా 2014 నుంచి ఈ విధానం కొనసాగుతోంది.

బీహార్ లో తొలి దశ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి - Tholi Paluku