
బీహార్ లో జేడీయూ మొదటి జాబితా విడుదల
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు సంబంధించి జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) పార్టీ 57 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. పార్టీ ప్రకటన ప్రకారం ఈ జాబితాకు జేడీయూ జాతీయ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఆమోదం తెలిపారు. ప్రకటించిన జాబితాలో ముఖ్య నాయకులకు టికెట్లు కేటాయించారు. జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ ఖుష్వాహా మహనర్ నుంచి పోటీ చేయనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ నలంద, సునీల్ కుమార్ భోర్ (ఎస్సీ) నుంచి బరిలో నిలిచారు.
ఇప్పటికే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా 71 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ ఆమోదించిన పేర్లలో మంగళ్ పాండే (సివాన్), తర్కీశోర్ ప్రసాద్ (కతిహార్), రామ్‌క్రిపాల్ యాదవ్ (దనాపూర్),నితిన్ నబీన్ (బ్యాంకిపూర్), రేణు దేవి (బెట్టియాహ్), ప్రీమ్ కుమార్ (గయా టౌన్), శ్రేయసీ సింగ్ (జముయి), డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా (లఖీశరాయ్), మరో డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి (తారపూర్) నుంచి పోటీ చేస్తారని బీజేపీ అధ్యక్షుడు వినోద్ తావ్డే ప్రకటించారు.
అదే సమయంలో జన్ సురాజ్ పార్టీ సోమవారం 65 మంది అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసి ఇతర పార్టీల కంటే ముందుంది. పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ ఈ జాబితా సమాజంలోని వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ప్రయత్నంలో భాగం అని వివరించారు.
ఇప్పటి వరకు విడుదలైన మొత్తం 116 అభ్యర్థులలో 25 సీట్లు రిజర్వ్ కాగా, మిగిలిన 91 సాధారణ సీట్లలో 31 సీట్లు ఈబీసీలకు, 21 ఓబీసీలకు, 21 ముస్లిం అభ్యర్థులకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. మొదటి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో విడత నవంబర్ 11న జరగనుంది. మొదటి విడత పోలింగ్ లో భాగంగా 121 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్డీఏ కూటమి ఇప్పటికే సీట్ల పంపకాలను పూర్తి చేసింది. బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ ) 29 సీట్లు, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం), హిందుస్తానీ ఆవామ్ మోర్చా (హ్యామ్) చెరో 6 సీట్లలో పోటీ చేయనున్నాయి. మహాగట్భందన్ ఇంకా సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోలేదు.
