Let's talk: editor@tmv.in
బీహార్ లో ఛాత్ మహాపర్వ్ ప్రారంభం

బీహార్ లో ఛాత్ మహాపర్వ్ ప్రారంభం

Pinjari Chand
26 అక్టోబర్, 2025

బీహార్ లో ఎంతో ఆత్మీయంగా జరుపుకునే నాలుగు రోజుల ఛాత్ పర్వ్ శనివారం ప్రారంభమైంది. తొలి ఆచారం ‘నహాయ్-ఖాయ్’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు పవిత్ర స్నానం చేసి సూర్య నమస్కారాలు చేశారు.డానాపూర్‌లోని ఫక్కర్ మహతోఘాట్, గురుద్వారా ఘాట్, నారియల్ ఘాట్ వంటి ప్రాంతాల్లో మహిళా భక్తులు సంప్రదాయ ఛాత్ పర్వ్ గీతాలు పాడుతూ, నైవేద్యం సిద్ధం చేస్తూ ఆ ఆచారం వెనుక ఉన్న ఆధ్యాత్మికతను ఆలపించారు.

‘పాట్నాకు చెందిన స్వాతి అనే భక్తురాలు మాట్లాడుతూ ప్రకృతితో ఓ భావన ముడిపడి ఉంది. ఛాత్ అంటే ప్రకృతి ఆరాధన. మనం సూర్యుడిని పూజిస్తాం, నీటిని పూజిస్తాం. ప్రకృతి మనకు మంచిని ప్రసాదించాలని వేడుకుంటాం అన్నారు. మరో భక్తురాలు రీనా సింగ్ మాట్లాడుతూ మేం ప్రతి సంవత్సరం ఈ పండుగ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తాం. జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ ఛాత్ మనకు ఉత్సాహంతో ఎదగడం, ప్రకృతి పట్ల శ్రద్ధ వహించడం,మన చుట్టూ ఉన్న ప్రజలను జాగ్రత్తగా చూసుకోవడం నేర్పుతుందని’ తెలిపారు.

ఔరంగాబాద్‌లోని దేవ్ సూర్య దేవాలయానికి ఈ పర్వదినాల్లో దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు.ఈ ఆలయాన్ని త్రేతాయుగానికి చెందినదిగా విశ్వసిస్తారు. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు పర్వదినాల్లో పాల్గొననున్నట్లు అంచనా. దేశవ్యాప్తంగా ఈ పండుగను సుమారు 3 కోట్ల మంది జరుపుకుంటారు. పండుగలో నహాయ్-ఖాయ్, ఖర్ణా, సంధ్యా అర్ఘ్య (అస్తమించే సూర్యునికి నైవేద్యం), ఉషా అర్ఘ్య (ఉదయించే సూర్యునికి నైవేద్యం) వంటి ఆచారాలు ఉంటాయి. చివరి రోజున 36 గంటలపాటు కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం పాటిస్తారు.ఈరోజు నహాయ్-ఖాయ్ కోసం భక్తులు దేవ్ సూర్య కుండ్‌లో పవిత్ర స్నానం ఆచరించారు. సూర్య భగవానుడిని పూజించే ముందు అర్వా బియ్యం, పప్పు, గుమ్మడికాయ కూరగాయలతో ప్రసాదం తయారు చేసి, ఈ పండుగను శుభప్రదంగా ప్రారంభించారు.

ఛాత్ పర్వదినాలు : అక్టోబర్ 25న నహాయ్-ఖాయ్ (చతుర్థీ), అక్టోబర్ 26 ఖర్ణా (పంచమి), అక్టోబర్ 27న ఛాత్ పూజ (షష్ఠి), అక్టోబర్ 28న ఉషా అర్ఘ్య (సప్తమి)ని నిర్వహించుకుంటారు.

బీహార్‌లో ఛాత్ పర్వ్ ప్రత్యేకత

ఛాత్ పూజను వేల సంవత్సరాలుగా బీహార్‌లో నిర్వహించుకుంటున్నారు. ఇది వేదకాలం నుంచే ఉన్న పండుగగా భావిస్తారు. సూర్యదేవుడు (ప్రకాశం, జీవనాధారం) ఆయన సోదరి ఛఠీ మయ్యాకు అంకితం చేసిన ఈ పూజ అత్యంత పవిత్రమైనది.

ప్రకృతి పూజ:

ఈ పండుగలో దేవతా పూజ కంటే ప్రకృతి పూజ ప్రధానమైనది. సూర్యుడు, నీరు, భూమి, గాలి ఇవన్నీ జీవనానికి ఆధారం అనే తాత్విక భావన. అందుకే దీనిని ప్రకృతి ఆరాధన పండుగ అంటారు.

ఉపవాస కాఠిన్యత: ఛాత్ వ్రతం చాలా కఠినమైనది. భక్తులు 36 గంటల పాటు నీరు కూడా తాగకుండా ఉపవాసం పాటిస్తారు. మానసిక, శారీరక శుద్ధిని కోరుకునే ఈ ఆచారం భక్తి, నిబద్ధతకు చిహ్నం.

మహిళల ప్రధాన పాత్ర: ఈ పూజలో మహిళలే ప్రధాన పాత్రధారులు.వారు కుటుంబ శ్రేయస్సు, సంతానం ఆరోగ్యం, సుఖశాంతి కోసం సూర్యుడిని ప్రార్థిస్తారు.

సామాజిక ఐక్యత: ఛాత్ పండుగలో కుల, మత, సామాజిక భేదాలు లేవు. అందరూ కలిసే నదీ తీరాల్లో ప్రార్థనలు, పవిత్ర స్నానాలు చేస్తారు. ఇది బీహార్ సమాజంలో సమానత్వం, ఐక్యతకు చిహ్నం.

ఇతర రాష్ట్రాల్లో

బీహార్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇది భక్తితో, ఉత్సాహంగా చేసుకుంటారు. ముఖ్యంగా వారాణసి, బల్లియా, గోరఖ్‌పూర్, రాంచీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంబురంగా చేస్తారు.బీహారి వలసదారులు ఎక్కువగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్ కతా, అలాగే నేపాల్, మారిషస్, ఫిజీ, ట్రినిడాడ్ లాంటి విదేశీ ప్రాంతాల్లో కూడా ఈ పండుగ ఇప్పుడు ఎంతో ఆదరణ పొందుతోంది.

బీహార్‌లోని దేవ్ సూర్య దేవాలయాన్ని ఛాత్ పర్వ్ సమయంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది ఔరంగాబాద్ జిల్లా, దేవ్ పట్టణంలో ఉంది. ఈ దేవాలయాన్ని త్రేతాయుగం నాటి స్మారకంగా భావిస్తారు. అంటే రామాయణ కాలంలోనే దీనికి మూలం ఉంది అని పురాణాలు చెబుతున్నాయి. పురాణల ప్రకారం త్రేతాయుగంలో శ్రీ రాముడు జానకీదేవితో కలసి అశ్వమేధ యాగం చేసిన తరువాత సూర్యుడి దర్శనం కోసం ఇక్కడ ఆగారని చెబుతారు. ఆ సందర్భంలోనే ఈ సూర్య దేవాలయం ఆవిర్భవించిందని స్థానిక ప్రజల విశ్వాసం.

చరిత్రాత్మక నిర్మాణం:

పురాణ మూలాల తర్వాత ప్రస్తుత కట్టడం గుప్త సామ్రాజ్య కాలంలో (సుమారు క్రీస్తు శకం 4వ–5వ శతాబ్దం) నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం. కొందరు పరిశోధకుల ప్రకారం ఈ దేవాలయాన్ని రాజా అయోధ్యా దేవ్ లేదా రాజా దత్త సూర్యవంశీ అనే స్థానిక పాలకుడు నిర్మించినట్లు ఆధారాలు చెబుతున్నాయి.

వాస్తుశిల్పం:

ఈ దేవాలయం మూడు ముఖాలతో ప్రత్యేకంగా ఉంటుంది .

• ఒక ముఖం ఉదయించే సూర్యుడు వైపు

• రెండవది మధ్యాహ్న సూర్యుడు వైపు

• మూడవది అస్తమించే సూర్యుడు వైపు ఉంది.

ఈ నిర్మాణ శైలిని భారతదేశంలో చాలా అరుదుగా చూడవచ్చు. ఇక్కడ సూర్యదేవుడి ప్రతిమ రథంపై ఏడు గుర్రాలతో ఉంది. ఇది వేద సంస్కృతిలోని సప్తాశ్వ సూర్యుడు రూపానికి ప్రతీక.