
బీహార్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
బీహార్‌లో తాజాగా ఎన్నికైన 18వ శాసనసభ సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ నరేంద్ర నారాయణ యాదవ్ ప్రమాణం చేయించారు. సభలో హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం, మైతిలీ భాషల్లో ప్రమాణం చేసుకునే అవకాశం ఉన్నట్లు స్పీకర్ వివరించారు. మొదటగా కేబినెట్ మంత్రులతో కార్యక్రమం ప్రారంభమైంది.
తారాపూర్ నుంచి గెలిచిన డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరి మొదటగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వరుసగా నాలుగోసారి లఖీసరాయ్ స్థానాన్ని కాపాడుకున్న మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులు ప్రోటెం స్పీకర్‌తో పాటు శాసన మండలి సభ్యుడైన ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అభివాదం చేశారు. ఆ తరువాత స్పీకర్ పదవికి ప్రధాన అభ్యర్థిగా భావిస్తున్న బీజేపీ సీనియర్ నేత ప్రేమ్‌కుమార్ ప్రమాణం చేశారు. స్పీకర్ ఎన్నిక మంగళవారం జరగనుంది.
ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం
తర్వాత ప్రతిపక్ష నేత పదవిని కొనసాగించే అవకాశమున్న ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. ఇతర సభ్యుల్లో కొందరు ముఖ్యంగా మంత్రి ఆనంద్ శంకర్ ప్రసాద్‌తో సహా పలువురు మైతిలీ భాషలో ప్రమాణం చేశారు. సీమాంచల్ ప్రాంతానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఉర్దూలో ప్రమాణం చేయగా, కొంతమంది సంస్కృతంలో కూడా ప్రమాణం చేశారు. దరౌలీ నుంచి ఎన్నికైన విష్ణుదేవ్ పాశ్వాన్ మాత్రం ఇంగ్లీషులో ప్రమాణం చేశారు.
రేపు గవర్నర్ ప్రసంగం
ఐదు రోజుల ఈ సమావేశంలో బుధవారం గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ రెండు సభలను ఉద్దేశించి సంయుక్త ప్రసంగం చేస్తారు. అదే రోజున రెండో అనుబంధ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్నారు. గురువారం గవర్నర్ ప్రసంగంపై కృతజ్ఞతా తీర్మాన చర్చకు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. శుక్రవారం రెండో అనుబంధ బడ్జెట్‌పై చర్చ అనంతరం అనుమతి బిల్లును ఆమోదిస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని సాధించి 243 స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు కేబినెట్ సభ్యులు ఆనందోత్సాహంతో ఫోటోలు దిగుతూ, పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పొందడం సమావేశ ప్రాంగణంలో కనిపించింది.
