
బీహార్ రాజకీయాల్లో మరో ‘వారసుడు’.. జేడీయూలోకి నిశాంత్
బీహార్ రాజకీయాల్లో మరో ‘సన్‌రైజ్’కు వేదిక సిద్ధమైంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఖరారైందని జేడీయూ (జనతదళ్ (యునైటైడ్)) సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి శ్రావణ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో పార్టీ అధికారిక ప్రకటన చేస్తుందని తెలిపారు. నిశాంత్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావడం ఫైనలైజ్ అయింది. హోలీ పండుగకు ముందు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఆయనకు పార్టీలో పెద్ద బాధ్యత ఇవ్వనున్నారని శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. రాజ్యసభకు పంపే అవకాశంపై ప్రశ్నించగా, ఏదైనా జరగవచ్చు అని సమాధానమిచ్చారు.
సామాజిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సహ్నీ కూడా నిశాంత్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తూ, పార్టీ కార్యకర్తలు ఎన్నో సంవత్సరాలుగా ఈ నిర్ణయాన్ని కోరుతున్నారు. ఇప్పుడు అది ఖరారైందన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అశోక్ చౌధరీ మాట్లాడుతూ, ఇది పార్టీ శ్రేణులకు హోలీ కానుకలాంటిది. నిశాంత్ ప్రవేశం పార్టీకి లాభదాయకం. ఆయన మన నాయకుడు నితీష్ కుమార్‌కు ఫోటోకాపీ లాంటి వ్యక్తి అన్నారు. జేడీయూ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. రాష్ట్ర పరిశ్రమల మంత్రి దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ, యువత రాజకీయాల్లోకి రావడం ఆనందకరం. నిశాంత్ విద్యావంతుడు, బీటెక్ పట్టా పొందిన నాయకుడు. సరైన సమయం వచ్చినట్టుందన్నారు.
ఎన్నికల ముందునుంచే ఊహగానాలు
2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించినప్పటి నుంచే నిశాంత్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2025లో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, నిశాంత్ సమక్షంలో మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు, మద్దతుదారులు ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. ఎప్పుడు చేరాలనే నిర్ణయం ఆయనదే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా పార్టీని స్థాపించిన నేతగా నితీష్ కుమార్ తీసుకునే నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు. కానీ తుది నిర్ణయం నిశాంత్ ఆసక్తిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ బీహార్ రాజకీయాల్లో కీలకనేతగా ఎదిగారు. ఇప్పుడు నిశాంత్ కుమార్ రావడం బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనుందనే చర్చ మొదలైంది.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యం
బీహార్ నుంచి ఐదు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ దాఖలు చివరి తేదీ మార్చి 5. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఈ ఐదు స్థానాలు అధికార ఎన్డీయే ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ రాష్ట్రీయ జనతాదళ్ కూడా అభ్యర్థులను నిలబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలు జేడీయూ నేతలు హరివంశ్ నారాయణ్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్, ఆర్జేడీకి చెందిన ప్రేమ్ చంద్ర గుప్తా, అమరేంద్ర ధారి సింగ్, అలాగే ఆర్ఎల్ఎం నాయకుడు ఉపేంద్ర కుశ్వాహా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో జరుగుతున్నాయి.
నితీష్ కుమార్ గ్రీన్ సిగ్నల్
‘వంశపారంపర్య రాజకీయాలకు’ వ్యతిరేకంగా మాట్లాడిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తన ఏకైక కుమారుడు నిశాంత్ రాజకీయాల్లోకి రావడానికి అంగీకరించినట్లు జేడీయూ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకోగా, రాజ్యసభ సభ్యత్వంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
పార్టీ కార్యాలయంలో సంబరాలు
వార్త వెలువడగానే పాట్నాలోని జేడీయూ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుని, గులాల్ రాసుకుని సంబరాలు జరుపుకున్నారు. నిశాంత్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని కొంతకాలంగా పోస్టర్లు కూడా కనిపిస్తున్నాయి. స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ ఆసక్తికర వ్యాఖ్య చేస్తూ, నితీశ్ కుమార్ తన కుమారుడిని నేరుగా ముఖ్యమంత్రిగా చేయాలని సూచించారు.
