
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణం
1974లో జయప్రకాష్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవానికి’ పిలుపునిచ్చిన చారిత్రక వేదిక నుంచి ఆయన శిష్యుడు, జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ బుధవారం రికార్డు స్థాయిలో 10వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మరో 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ, నాగాలాండ్ సీఎం నీఫియూ రియో, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తదితర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఇద్దరూ బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఎంపికయ్యారు. 2005, 2010, 2015లో కూడా ఇదే గాంధీ మైదానంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారంటే
మంత్రివర్గంలో ప్రమాణం చేసినవారు జేడీ(యూ) నుంచి విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్, లేసీ సింగ్, మదన్ సహనీ, అశోక్ చౌదరి, సునీల్ కుమార్, మహ్మద్ జమా ఖాన్. బీజేపీ నుంచి మంగళ్ పాండే, దిలీప్ కుమార్ జైస్వాల్, నితిన్ నవీన్, రామ్ కృపాల్ యాదవ్, సంతోష్ కుమార్ సుమన్ (హెచ్ఏఎం-ఎస్), సంజయ్ సింగ్ టైగర్, అరుణ్ శంకర్ ప్రసాద్, సురేంద్ర మెహతా, నారాయణ్ ప్రసాద్, రామా నిషాద్, లఖేంద్ర కుమార్ రౌషణ్, శ్రేయసీ సింగ్, ప్రమోద్ కుమార్. ఎల్జేపీ(రామ్ విలాస్) నుంచి సంజయ్ కుమార్, సంజయ్ కుమార్ సింగ్. ఆర్ఎల్ఎం నుంచి దీపక్ ప్రకాష్ ఉన్నారు.
ప్రధాని మోడీ, జైశంకర్ అభినందనలు
ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో పోస్టు చేస్తూ, ‘నితీశ్ కుమార్‌కు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు హృదయపూర్వక అభినందనలు. ఆయన నైపుణ్యం కలిగిన, అనుభవజ్ఞుడైన పాలకుడు. రాష్ట్రంలో మంచి పాలన చేసిన ఆయనకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది అని కొనియాడారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకూ అభినందనలు తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఎక్స్‌లో రాస్తూ కొత్త ఎన్డీఏ ప్రభుత్వం బీహార్ అభివృద్ధిని వేగవంతం చేస్తుందని, వికసిత్ భారత్ లక్ష్యానికి దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అని పేర్కొన్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో నితీశ్ కుమార్ మరోసారి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
నీతీశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు: తేజస్వీయాదవ్
బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గౌరవనీయులు నితీశ్ కుమార్ కు హృదయపూర్వక అభినందనలు. కొత్త మంత్రివర్గంలో బాధ్యతలు స్వీకరించిన మంత్రులందరికీ శుభాకాంక్షలు అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పెట్టుకున్న ఆశలు–ఆకాంక్షలకు కొత్త ప్రభుత్వం అండగా నిలబడి, ఇచ్చిన హామీలు–ప్రకటనలు నెరవేర్చి, బీహార్ ప్రజల జీవితాల్లో సానుకూలమైన, మెరుగైన మార్పులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సోషలిష్ట్ విలువలకు నితీశ్ కుమార్ కు కట్టుబడి ఉన్నారు: అఖిలేశ్ యాదవ్
మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ నేత నితీశ్ కుమార్ కు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజవాది పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. పూర్తి ఐదేళ్ల పదవీకాలంలో ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపాలని శుభాకాంక్షలు తెలిపారు.
తన ఎక్స్ సందేశంలో బీహార్ రాజకీయ దిశను నిర్ణయించే కీలక ఘట్టం ఇదేనని వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో విశాల అనుభవం, పరిపాలనపై పట్టు ఉన్న నితీశ్ మరోసారి అభివృద్ధి–సమాజ న్యాయం దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తారన్న నమ్మకం వ్యక్తం చేశారు. సోషలిస్టు విలువలకు నితీశ్ ఎప్పటి నుంచో కట్టుబడి ఉన్నారని, ప్రజాకేంద్రిత నిర్ణయాలు, సంక్షేమ విధానాలు ఈ కొత్త పదవీకాలంలో మరింత బలోపేతం అవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్–బీహార్ రాష్ట్రాలకు చారిత్రిక, సాంస్కృతిక, సామాజిక బంధాలు ఉన్నాయని, రెండు రాష్ట్రాలు కలిసి ప్రాంతీయ అభివృద్ధికి పనిచేయాలని ఆశిస్తున్నట్టు అఖిలేశ్ తెలిపారు.
నితీశ్ కుమార్ కు కొడుకు అభినందనలు
బీహార్ రాజకీయాల్లో అరుదైన ఘట్టంగా నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సందర్భంగా, ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఊహించిన దానికంటే భారీ మెజారిటీ ఇచ్చిన ఓటర్ల తీర్పును “చారిత్రక మద్దతు’’గా అభివర్ణించారు. ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడిన నిశాంత్ నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలకు, మొత్తం ఎన్డీఏ కుటుంబానికి అభినందనలు. మేం ఇంతకుముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నాం. మళ్లీ అలాగే చేస్తామని అన్నారు.
తండ్రి ప్రమాణస్వీకారాన్ని ‘వ్యక్తిగత గౌరవం’గా పేర్కొన్న నిశాంత్ ‘పదోసారి సీఎం అయిన నాన్నగారికి అభినందనలు. ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువగా మద్దతిచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు అన్నారు.
