Let's talk: editor@tmv.in
బీహార్ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు: చంద్రబాబు

బీహార్ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు: చంద్రబాబు

Dantu Vijaya Lakshmi Prasanna
21 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గురువారం రోజున బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు, తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి హాజరయ్యారు.

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్, మహరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘావాల్, బీజేపీ అగ్ర నేత శ్రీ రవిశంకర్ ప్రసాద్, బీహార్ బీజేపీ, జేడీయూకు చెందిన పలువురు నేతలు సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు.

"ఈ రోజు పట్నాలో జరిగిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ఆయనకు ఆయన కొత్త మంత్రివర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషంగా ఉంది," అని చంద్రబాబు 'ఎక్స్' ఖాతా లో పోస్ట్ చేశారు.

"విజయవంతమైన, ప్రజల కేంద్రంగా ఉండే పాలన కోసం బిహార్‌లోని ఎన్డీయే నాయకత్వానికి నా శుభాకాంక్షలు" అని టీడీపీ అధినేత పేర్కొన్నారు.

కాగా జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వ సారి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన భారత రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. నితీష్ కుమార్ తో పాటు, ఈ సందర్భంగా 26 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బీజేపీ నుండి 14 మంది, జేడీ(యూ) నుండి 8 మంది, ఎల్‌జేపీ(ఆర్వీ) నుండి 2, హెచ్‌ఏఎం నుండి 1, ఆర్‌ఎల్‌ఎం నుండి 1 ఉన్నారు. వారిచే గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పదవీ ప్రమాణాలు చేయించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర అగ్రశ్రేణి ఎన్డీయే నాయకులు, అలాగే ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

నితీష్ కుమార్ (71) దేశంలో అత్యధిక కాలం పనిచేసిన 10 మంది ముఖ్యమంత్రులలో ఒకరు. అలాగే 19 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో, ఎన్డీయే కూటమి తూర్పు రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చింది, 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో 202 సీట్లు గెలుచుకుంది, ఇందులో బీజేపీ 89, జేడీ(యూ) 85, ఎల్‌జేపీ(ఆర్వీ) 19, హెచ్‌ఏఎం 5, ఆర్‌ఎల్‌ఎం 4 సీట్లు సాధించాయి.

బీహార్ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు: చంద్రబాబు - Tholi Paluku