
బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ సరావోగి
బీజేపీ జాతీయ నాయకత్వం పార్టీ సంస్థాగతంగా ఖాళీ అయిన పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. ఇప్పటికే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నబీన్ నితిన్ నియమించడం, యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పంకజ్ చౌధరిని నియమించింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, మాజీ మంత్రి అయిన సంజయ్ సరావోగిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం బీహార్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.
57 ఏళ్ల సరావోగి ప్రస్తుతం దర్భంగా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రెండేళ్ల పదవి కాలం కూడా పూర్తి కాకముందే పదవి నుంచి తప్పుకున్న దిలీప్ జైస్వాల్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ఆమోదంతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సాధారణ కార్యకర్తకు కూడా బీజేపీ ఆగ్రస్థానం కల్పిస్తోంది: సరావోగి
బీజేపీ ఒక సాధారణ కార్యకర్తను కూడా అగ్రస్థాయికి తీసుకెళ్లే పార్టీ. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తాను. పార్టీ నాకు తల్లిలాంటిది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
సీఎం నితీశ్ శుభాకాంక్షలు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సరావోగికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ సరావోగి నియమితులైన సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సంజయ్ సరావోగి జీకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఆయన మా కేబినెట్‌లో మంత్రిగా నా సహచరుడిగా కూడా పనిచేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ కొత్త బాధ్యతలో ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. సంజయ్ సరావోగి నియామకం బీజేపీకి ‘డబుల్ డోస్’ లాంటిది. 2029–30 ఎన్నికలకు పార్టీ మరింత బలంగా నిలబడుతుందని డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి కూడా అభినందనలు తెలియజేశారు.
‘ఒక వ్యక్తి – ఒక పదవి’ అనే బీజేపీ విధానం ప్రకారమే జైస్వాల్‌ను మార్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏబీవీపీ విద్యార్థి కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన సరావోగి, అనంతరం బీజేపీ యువమోర్చాలో పనిచేశారు. 2005లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, అప్పటి నుంచి దర్భంగా నుంచి వరుసగా గెలుస్తున్నారు. వైశ్య వర్గానికి చెందిన సరావోగి, బీహార్‌లో సంఖ్యాపరంగా పెద్ద వర్గం కాకపోయినా, బీజేపీకి కీలక మద్దతుదారులుగా ఉన్న సామాజిక వర్గానికి ప్రతినిధిగా భావిస్తున్నారు.
