
బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: తేజస్వి యాదవ్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మార్పు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని ఆర్జేడీ నేత, మహాగఠ్బంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన వరుస కీలక హామీలు ప్రకటించారు.
పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న 20 ఏళ్ల 'దూరదృష్టి లేని ప్రభుత్వం'లో అవినీతి, నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 20 నెలలలోనే బీహార్‌ను అభివృద్ధిలో నంబర్ 1 రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
తేజస్వి యాదవ్ కీలక హామీలు
మహాగఠ్బంధన్ కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో కీలక వర్గాలకు అందించే ప్రయోజనాలను గణనీయంగా పెంచుతామని ఈ సందర్భంగా తేజస్వి ప్రకటించారు. గ్రామ కోర్టుల ప్రతినిధులతో సహా పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రతినిధుల భత్యాలను రెట్టింపు చేస్తామన్నారు. వీరికి రూ. 50 లక్షల బీమా సౌకర్యం, పెన్షన్ కూడా అందిస్తామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారుల క్వింటాల్‌కు అందించే మార్జిన్ మనీని గణనీయంగా పెంచుతామని హామీ ఇచ్చారు. నాయి బ్రాహ్మణులు, కుమ్మరులు, వడ్రంగులు వంటి కుల ఆధారిత వృత్తులలో నిమగ్నమైన కష్టజీవులకు ఐదు సంవత్సరాల పాటు రూ. 5 లక్షల వడ్డీ లేని ఏకమొత్తం రుణం అందిస్తామన్నారు.
అంతేకాదు తేజస్వి యాదవ్ ఈ సమావేశంలో మరికొన్ని కీలక సంక్షేమ, ఉద్యోగ హామీలను వెల్లడించారు. విద్య, ఆరోగ్యం, పరిపాలన విభాగాలలో పని చేస్తున్న అన్ని తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులను అలాగే గ్రామీణ జీవనోపాధి కార్యక్రమంలో పనిచేసే మహిళా జీవిక దీదీలను శాశ్వత ఉద్యోగులుగా మారుస్తామన్నారు. మహిళా జీవిక దీదీలకు నెలకు రూ.30 వేలు, రూ. 5 లక్షల బీమా కవరేజ్, రెండేళ్ల వడ్డీ లేని క్రెడిట్ ఇస్తామన్నారు. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ. 1,500 పెన్షన్, పేద దిగువ మధ్యతరగతి మహిళలకు 'మాయి బెహన్ మాన్' పథకం ద్వారా నెలకు రూ. 2,500 నగదు అందిస్తామన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజులలో 'స్పెషల్ జాబ్ ఎంఫ్లాయ్‌మెంట్ యాక్ట్'ను ఆమోదిస్తామని, ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తారు.
ప్రభుత్వంపై విమర్శలు
భూమి లేకపోవడం వల్ల బీహార్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయలేమని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారని, గుజరాత్‌లో మోదీ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారన్న బీజేపీ వ్యూహాలను ప్రజలు అర్థం చేసుకున్నారని తేజస్వి వివరించారు. మహాగఠ్‌బంధన్‌లో చీలికలు ఉన్నాయని ఎన్డీఏ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను, ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ముకేశ్ సహనీ కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నామని, త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ప్రచారాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
243 సీట్ల బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీలలో రెండు దశల్లో జరుగనున్నాయి. ఫలితాలు నవంబర్ 14న ప్రకటిస్తారు. మహాగఠ్బంధన్ కూటమి తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ముకేశ్ సహానీని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేతృత్వంలోని మహాగఠ్బంధన్‌లో కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, సీపీఐ, సీపీఎం, ముకేశ్ సహానీ వీఐపీ పార్టీలు ఉన్నాయి.
