Let's talk: editor@tmv.in
బీహార్‌, జూబ్లీహిల్స్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం

బీహార్‌, జూబ్లీహిల్స్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం

Pinjari Chand
10 నవంబర్, 2025

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. దీంతో దాదాపు నెలరోజులుగా సాగిన మాటల యుద్ధానికి, నాయకుల వాగ్భాణాలకు ముగింపు పలికినట్లయింది. మొదటి దశ పోలింగ్‌ నవంబర్‌ 6న 121 స్థానాల్లో జరిగింది. రికార్డు స్థాయిలో 65 శాతం ఓటింగ్‌ నమోదైంది. రెండో దశలో 122 స్థానాలకు నవంబర్‌ 11న ఓటింగ్‌ జరగనుంది. ఫలితాలు నవంబర్‌ 14న వెలువడనున్నాయి. రెండో దశలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో చకాయి (జేడీయూ మంత్రి సుమిత్‌ కుమార్‌ సింగ్‌ పోటీ), జముయి (బీజేపీ ఎమ్మెల్యే శ్రేయాంసి సింగ్‌), ధమదహా (జేడీయూ మంత్రి లేశీ సింగ్‌), చఠాపూర్‌ (బీజేపీ మంత్రి నీరజ్‌కుమార్‌ సింగ్‌) ఉన్నాయి. ప్రచారం చివరి రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ లు హోరాహోరీగా ప్రచార ర్యాలీలు నిర్వహించారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ జోరు

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు,లోక్ సభ విపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ సీమాంచల్‌ ప్రాంతంలోని కిషన్‌గంజ్‌, పూర్ణియా జిల్లాల్లో సభలు నిర్వహించారు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో మహాఘట్బంధన్ కి మద్దతు కీలకం కావడంతో ఆయన ప్రచారానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. రెండు నెలల క్రితం ఆయన చేపట్టిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లోనూ మంచి స్పందన లభించింది. ఆయన మొత్తం 15 సభల్లో పాల్గొన్నారు. అయితే ఆయన చేసిన ‘ఓట్‌ చోరీ’ ఆరోపణలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా బీహార్‌లో ప్రచారం చేశారు. 10 సభలు, ఒక రోడ్‌షో నిర్వహించారు. అయితే ఒక సభ వాతావరణం సరిగా లేనందున రద్దయింది.

బీజేపీ శిబిరం హోరాహోరీ ప్రచారం

అమిత్‌ షా మాత్రం ప్రచారంలో అంతా తానై వ్యవహరించారు. రాష్ట్రంలో అనేక రోజులుగా ఉంటూ బీజేపీ బలహీన ప్రాంతాలైన ససారాం, అర్వల్‌లలో సభలు నిర్వహించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలైన ఔరంగాబాద్‌, కైమూర్‌లలో సభలు నిర్వహించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా 14 సభలు, ఒక రోడ్‌షోలో పాల్గొని ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు.‘జంగిల్ రాజ్’ వ్యాఖ్యలతో రాజకీయ వేడిని పెంచారు.

ఎన్డీయేలో స్టార్ క్యాంపెయినర్ల ముమ్మర ప్రచారం

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, హిమంత బిశ్వశర్మ, మోహన్‌ యాదవ్‌, చిరాగ్ పాశ్వాన్, నటులు రవి కిషన్‌, మనోజ్‌ తివారి వంటి నాయకులు హోరాహోరీ ప్రచారం చేశారు. ఇతర రాష్ట్రాల నేతలు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే (శివసేన), ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ (టీడీపీ) కూడా ప్రచార బరిలో దిగారు.

నిబద్ధతత .. నిశ్శబ్దంగా నితీశ్‌

జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మాత్రం ప్రాచుర్యం లేకుండా ధృడంగా తన స్టైల్ లో ప్రచారం కొనసాగించారు. మోడీతో కలిసి సమస్తిపూర్‌లో తొలి సభలో పాల్గొన్న ఆయన తర్వాత ప్రధాని సభల్లో కనిపించకపోవడంతో మిత్ర పక్షాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. అయితే నితీశ్‌ దీనిని పట్టించుకోకుండా ఆరోగ్యం బాగోలేదన్న ప్రచారాన్ని తోసిపుచ్చి వర్షంలోనూ, రోడ్ల మీదనూ ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించారు.

తేజస్వీ ఉత్సాహం

మాజీ డిప్యూటీ సీఎం, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఉత్సాహంగా ప్రచారం చేశారు. మహాఘట్బంధన్ ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలో దిగారు. అలాగే అనేక సభల్లో పాల్గోని ప్రచార సభలను వేడెక్కించారు. అనేక హామీలు ఇచ్చారు.ఉపముఖ్యమంత్రి అభ్యర్థి ముఖేష్ సహనీ తో కలిసి సభల్లో పాల్గొన్నారు.

‘ఎక్స్‌ ఫ్యాక్టర్‌’గా జన్‌ సురాజ్‌

ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీ ఈ ఎన్నికల్లో ‘ఎక్స్‌ ఫ్యాక్టర్‌’గా నిలిచింది. దేశవ్యాప్తంగా అగ్రనేతల ప్రచార వ్యూహాలు రచించిన కిషోర్‌ ఈసారి స్వ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తలమునకలయ్యారు. డోర్‌ టు డోర్‌ శైలిలో సైలెంట్‌గా ప్రచారం సాగించారు.

రెండో దశ పోలింగ్‌కు కఠిన భద్రతా: బీహార్‌ డీజీపీ వినయ్‌కుమార్‌

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లు మొదటి దశ కంటే మరింత కఠినంగా ఉన్నాయని రాష్ట్ర డీజీపీ వినయ్‌కుమార్‌ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రెండో దశలో నియోజకవర్గాల సంఖ్య దాదాపు సమానంగానే ఉన్నా, భద్రతా దృష్ట్యా ఈ దశలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న ఏడింటితో పాటు 22 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, భారత–నేపాల్‌ సరిహద్దు పూర్తిగా మూసివేశామని, అంతర్రాష్ట్ర సరిహద్దులు కూడా 48 గంటల ముందుగానే మూసివేయనున్నామని తెలిపారు. జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల డీజీపీ‌లతో సమన్వయ చర్చలు జరిగాయని ఆయన వెల్లడించారు. సరిహద్దు జిల్లాల కోసం ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించామని, బార్డర్‌ డిస్ట్రిక్ట్‌ కోఆపరేషన్‌ కమిటీ (బీడీసీసీ) సమావేశం కూడా నిర్వహించామని చెప్పారు.

మొదటి దశ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్టు గుర్తుచేసిన వినయ్‌కుమార్‌ ఆ దశలో 1,500 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించాం. ఈ దశలో 1,650 కంపెనీల పరామిలిటరీ దళాలు, అదనంగా రాష్ట్ర పోలీస్‌ బలగాలు, 100 కంపెనీల బీహార్‌ స్పెషల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌, అలాగే అశ్వ దళం, నిఘా బృందాలు కూడా విధుల్లో ఉన్నాయని తెలిపారు.

జూబ్లీహిల్స్‌లోనూ

జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక ప్రచారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో నియోజకవర్గం అంతటా నెలకొన్న తీవ్ర రాజకీయ సందడికి తెరపడింది. ప్రచారం గడువు ముగియడంతో ఎన్నికల నియమావళి ప్రకారం నిశ్శబ్ద కాలం ప్రారంభమైంది.

ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలు చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీగా కృషి చేశారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో రోడ్డుషోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు జోరుగా సాగాయి. రాష్ట్ర స్థాయి నాయకులు సైతం ఈ ప్రచారంలో పాల్గొని తమ పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఉప ఎన్నికలో విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ బైపోల్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.పోలింగ్ కోసం 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న ఓట్ల లెక్కింపు అనంతరం వెలువడనున్నాయి.

యూసఫ్‌గూడలో కేటీఆర్‌ రోడ్‌షో

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా యూసఫ్‌గూడలో బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించిన రోడ్‌షోకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వేయే ముందు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్‌ అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నారని, ఆయన పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు.

బస్తీ దవాఖానాలు, ఉచిత నీటి సరఫరా, విద్యుత్‌ సమస్యల పరిష్కారం, వెంగల్రావు నగర్‌లో వెయ్యి పడకల ఆస్పత్రి, 42 ఫ్లైఓవర్లు, కొత్త లింక్‌ రోడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్‌ వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిందని విమర్శించారు. తులం బంగారం, పెన్షన్‌, ఆర్థిక సహాయం వాగ్దానాలన్నీ ఖాళీ మాటలేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.రేవంత్‌ రెడ్డి పాలనలో పేదల ఇళ్లు కూలగొట్టడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిలిపివేయడం, రిటైర్డ్‌ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం వంటి నిర్ణయాలపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇళ్లపై బుల్డోజర్‌ ఆపాలంటే కారు గుర్తుకే ఓటేయాలి. సునీతమ్మ గెలిస్తే 500 రోజుల్లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాం,” అని కేటీఆర్‌ తెలిపారు.జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్‌ఎస్‌ గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లోనే మార్పు వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈసారి ప్రజలు ఇచ్చే దెబ్బతో రేవంత్‌ కుర్చీ మిగిలి ఉంటుందో, ఊడిపోతుందో తేలిపోతుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

జూబ్లీహిల్స్‌లో బీజేపీ పాదయాత్రకు ప్రజా ఆదరణ

బోరబండ డివిజన్‌లో బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌కు మద్దతుగా నిర్వహించిన ఇంటింటి పాదయాత్రకు విపరీతమైన ప్రజా స్పందన లభించిందని, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.ఈ ప్ర‌చారంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని ప్రచారానికి ఊతమిచ్చారు.

పాదయాత్రలో ప్రజలు ఆత్మీయంగా పలకరించగా, వీధులంతా "బీజేపీకి ఓటు – అభివృద్ధికి మద్దతు" నినాదాలతో మార్మోగాయి. ఈ సందర్భంగా బీజేపీ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ, గత పదేళ్లుగా బీఆర్ఎస్‌, రెండేళ్లుగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రాలేదని విమర్శించారు.మెజారిటీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మైనార్టీ ఓట్ల కోసం బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మజ్లిస్‌ను భుజాలపై ఎక్కించుకుని చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని ఆయ‌న‌ తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్‌ నిజమైన అభివృద్ధి సాధించాలంటే ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై ఉండే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి దిశగా బీజేపీ మాత్రమే కట్టుబడి ఉందని మంత్రి కిష‌న్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ జోరు – నవీన్ యాదవ్ విజయం ప్రజా దిశను మారుస్తుంది: మహేష్ కుమార్ గౌడ్

ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ర్యాలీకి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను విస్మరించిందని, జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీకి లేదని విమర్శించారు. మూడు పర్యాయాలు గెలిచినా బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోయిందని అన్నారు.యువకుడు, విద్యావంతుడైన నవీన్ యాదవ్ విజయం జూబ్లీహిల్స్ దశను మార్చబోతోందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి యజ్ఞం ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వాదం అందించాలని పిలుపునిచ్చారు.