
బీహార్ ఓటరు జాబితాపై పెద్ద దుమారం
బీహార్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రకటించిన తుది ఓటరు జాబితా (ఫైనల్ ఎలక్టోరల్ రోల్)పై పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి జైరాం రమేష్ శనివారం న్యూఢిల్లీలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం (ఈసీఐ) మొత్తం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను బీజేపీ ఆదేశాల మేరకు నడిపిందని, ఈసీఐ బీజేపీకి 'బీ-టీమ్‌గా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
ఎందుకీ వివాదం
బీహార్లో మొత్తం 47 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల గెలుపు తేడా కంటే ఈ సంఖ్య ఎక్కువ అని ఆయన అన్నారు. జూన్ 24, 2025 నాటికి ఉన్న 7.89 కోట్ల నుంచి తుది జాబితా 7.42 కోట్లకు తగ్గింది. ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల ఓటర్లను తొలగించగా, తుది జాబితాలో 21.53 లక్షల అర్హులు కొత్తగా చేరారు.
అసాధారణ నమోదు
ఒకే ఇంట్లో ఏకంగా 247 మంది ఓటర్లు నమోదు అయ్యారని, ఒకే వ్యక్తి పేరు అదే బూత్‌లో మూడు సార్లు పునరావృతమైందని జైరాం రమేష్ తెలిపారు. ఈ తీవ్రమైన అవకతవకలపై ముఖ్య ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను కూడా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని, ఓటరు జాబితా సవరణలో పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే ఈ వివాదం రాజుకుంది. కాంగ్రెస్ నాయకులు ముందు నుంచీ ఈ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
బీజేపీకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ఏకైక ఉద్దేశం బీజేపీకి, దాని మిత్రపక్షాలకు రాజకీయ లబ్ధి చేకూర్చడమేనని కాంగ్రెస్ నాయకత్వం ఆరోపిస్తోంది. ఓటరు జాబితాలోంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించడాన్ని ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న సీమాంచల్ వంటి జిల్లాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గడాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈసీఐ పౌరసత్వాన్ని నిర్ణయించే ప్రయత్నం చేస్తోందని, ఇది ఎన్ ఆర్ సి ని వెనుక దారిలో అమలు చేయడమేనని గతంలో జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.
ఆధార్ గుర్తింపు నిరాకరణ
ఓటర్ల నమోదు కోసం ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా అంగీకరించడానికి ఎన్నికల సంఘం మొదట్లో నిరాకరించడం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆధార్‌ను అంగీకరించాలని స్పష్టం చేసినప్పటికీ, ఈసీఐ అడ్డంకులు సృష్టించిందని కాంగ్రెస్ ఆరోపించింది. సుమారు 65 లక్షలు తొలగించిన ఓటర్ల జాబితా, వారు తొలగింపుకు గల కారణాలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఈసీఐ తొలుత నిరాకరించింది. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జాబితా, కారణాలను తప్పనిసరిగా ప్రచురించాలని ఆదేశించింది.
గతంలోనూ 'బీ-టీమ్' విమర్శలు
జైరాం రమేష్ గతంలోనూ అనేక సందర్భాల్లో ఎన్నికల సంఘం పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంల విశ్వసనీయత, వీవీప్యాట్ స్లిప్‌ల అంశంపై 'ఇండియా' కూటమి తరపున ఈసీఐని కలిసి అనుమానాలు వ్యక్తం చేయాలనుకున్నప్పుడు, ఈసీఐ తగినంత సమయం ఇవ్వకుండా కేవలం కొంతమందిని మాత్రమే అనుమతించడానికి అభ్యంతరం చెప్పింది. గత సాధారణ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా ఫలితాల అప్‌డేట్‌లో ఆలస్యం జరుగుతోందని ఇది పరిపాలనపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడ అని ఆరోపించారు.
బీహార్ తుది ఓటరు జాబితా చుట్టూ జరుగుతున్న ఈ వివాదం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈసీఐ తన గణాంకాలతో సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ లేవనెత్తుతున్న అసాధారణ అంశాలైన 'ఒకే ఇంట్లో 247 మంది ఓటర్లు' వంటి వాటికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జవాబు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం రాబోయే బిహార్ ఎన్నికల రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
