
బీహార్ ఎన్డీయేలో కుదిరిన సీట్ల సర్దుబాటు
బీహార్ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు కుదిరింది. ఎన్డీయే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం ఇంతకాలం ఓ కొలిక్కి రాలేదు. తాజాగా సర్దుబాటు పూర్తయ్యింది. బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేయబోతున్నాయి. ఎల్‌జేపీ (రామ్ విలాస్) 29 స్థానాల్లో, రాష్ట్రీయ లోక్ మోర్చా, హిందుస్తానీ అవాం మోర్చా చెరో ఆరు స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పుకున్నాయి. ఈ మేరకు బీహార్ బీజేపీ ఇన్‌చార్జ్ వినోద్ తావడే సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వ్యవస్థీకృతమైన, అంకితభావంతో కూడిన ఎన్డీయే... రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు, పరస్పర అంగీకారంతో సీట్ల పంపిణీ పూర్తి చేసుకున్నదని చెప్పారు.
సీట్ల పంపిణీపై చిరాగ్ పాసవాన్ మాట్లాడుతూ, మళ్లీ ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించేందుకు బీహార్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత, రాజ్యసభ సభ్యుడు ఉపేంద్ర కుశ్వాహా కూడా తమ సోషల్ మీడియాలో సీట్ల పంపిణీపై ప్రకటన చేశారు.
ఎన్నికల తేదీలను ప్రకటించిన తరువాత ఎన్డీయే పక్షాలు సీటు పంచకంపై తీవ్ర చర్చలు జరిపాయి. కాగా, ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం ఇందుకు సంబంధించిన నిర్ణయం వెలువడింది. కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిత్యానంద్ రాయ్, సర్బనందా సోనోవాల్, ధర్మేంద్ర ప్రధాన్ సమావేశానికి హాజరయ్యారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, కేంద్ర మంత్రి, బీహార్ కో-ఇన్‌చార్జ్ సీఆర్ పాటిల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీహార్ ఉపముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి, బీహార్ బీజేపీ ఇన్‌చార్జ్ వినోద్ తావడే, బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్, ఇతర ప్రముఖులు కూడా సమావేశానికి చేరుకున్నారు.
ఎన్డీయే పరిస్థితి ఏమిటి?
బీహార్‌లో ఎన్డీయే బలమైన కూటమిగా ఉన్నప్పటికీ ఆ కూటమికి అనేక రాజకీయ సవాళ్లు కూడా ఉన్నాయి. సీట్ల సర్దుబాటు కుదిరినప్పటికీ స్థానికంగా నేతలు ఎంతమేరకు సహకరించుకుంటారో వేచి చూడాలి. ఎన్డీయే నేతలు ఈ ఎన్నికల్లో తమ కూటమి గెలుపు సాధ్యమని ప్రకటిస్తున్నారు. సర్వేలు, పూర్వ ఎన్నికల రికార్డుల ఆధారంగా కూటమిలోని పార్టీలు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. యువత, మైనార్టీలు, దళితుల ఓట్లు ఆ దఫా కీలక పాత్ర పోషించనున్నాయి.
బీహార్ రాజకీయ వాతావరణం ఎప్పుడూ మార్పు చెందే స్వభావాన్ని కలిగి ఉంది. చివరి ఫలితానికి ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల స్థానిక ప్రభావం మరియు ఎన్నికల రోజు ఓటు కీలకం అవుతుంది. అందువల్ల, ఎన్డీయే అధికారికంగా గెలుపు అంచనాలను ధృవీకరిస్తున్నప్పటికీ, సవాళ్లను పక్కన పెట్టకూడదని విశ్లేషకులు అంచనా వేస్తున్్నారు. అదే సమయంలో మహాఘట్ బంధన్ సైతం ఈ ఎన్నికల్లో గెలవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. బీసీలు, దళితులు, మైనార్టీల ఓట్లను ఏకీకృతం చేయాలని చూస్తోంది. ఒకవేళ ఆ వ్యూహం కుదిరితే ఎన్నికల ఫలితాలు మారే అవకాశం ఉంది.
గతంలో కొన్ని బీసీ కులాలు ఏకపక్షంగా ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చినప్పటికీ ఆ సారి ఆ పరిస్థితి ఉంటుందని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఇక యాదవ సామాజికవర్గం మద్దతు మహాగట్ బంధన్ కూటమికి ఉండొచ్చు. మరికొన్ని బీసీ కులాల మద్దతు కూడా ఆ కూటమికి దక్కొచ్చు. అయితే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితుల్లో అనేక మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
