Let's talk: editor@tmv.in
బీహార్ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నాయకుడు ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

బీహార్ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నాయకుడు ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

Pinjari Chand
3 డిసెంబర్, 2025

బీజేపీ అగ్రనేత, అనుభవజ్ఞుడు,ఇటీవల గయా టౌన్ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి గెలిచిన ప్రేమ్ కుమార్ మంగళవారం బిహార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రోటెం స్పీకర్ నరేంద్ర నారాయణ్ యాదవ్ సభకు తెలియజేస్తూ స్పీకర్ పదవికి ప్రేమ్ కుమార్ పేరు మాత్రమే నామినేషన్‌లో ఉందని ప్రకటించారు. ఆ తర్వాత వాయిస్ వోట్ ద్వారా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. సంప్రదాయం ప్రకారం ప్రేమ్ కుమార్‌ను ముఖ్యమంత్రి నీతీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌లు స్పీకర్ సీటుకు వరకు తోడ్కొని వెళ్లారు.సభ్యులందరూ లేచి నూతన స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలపాలని ముఖ్యమంత్రి కోరగా, 74 ఏళ్ల జేడీ(యూ) అధినేత నీతీష్ కుమార్ కొందరు సభ్యులు కూర్చొని ఉండటంపై మందలించారు. వారు లేవగానే నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి

తేజస్వీ యాదవ్ తన ప్రసంగంలో స్పీకర్ గెలిచిన స్థానం భగవాన్ విష్ణువు, బుద్ధుడితో ముడిపడిన పుణ్యక్షేత్రాలకు నిలయమని గుర్తు చేశారు. ప్రతిపక్షం అనేది ప్రభుత్వానికి అద్దం లాంటిది. తమ తప్పులను ప్రభుత్వం సొంతంగా చూడలేకపోవచ్చు. కాబట్టి మమ్మల్ని అధికంగా చర్చలో పాల్గొనేలా చూడాలని ఆశిస్తున్నామని ఆర్‌జేడీ నాయకుడు అన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్‌గా ఎన్నికైన ప్రేమ్ కుమార్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు చెప్పారు, సహకారం ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజు సమావేశాలను ముగించే ముందు సభ సాఫీగా నడవాలంటే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరమని, అది డిసెంబర్ 4న జరుగుతుందని ఆయన ప్రకటించారు.

స్పీకర్ ఎన్నిక కంటే ముందు మొదటి రోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని సభ్యులు ఈ రోజు ప్రమాణం చేశారు. వీరిలో భోజ్‌పురీ నుంచి ఎన్నికైన గాయకుడు ఎమ్మెల్యే వినయ్ బిహారీ (లౌరియా నియోజకవర్గం) కూడా ఉన్నారు. ఆయన తన మాతృభాషలోనే (భోజ్‌పురీ) ప్రమాణం చేయాలని పట్టుబట్టారు. ప్రోటెం స్పీకర్ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృతం లేదా మైథిలీ భాషల్లో మాత్రమే చదవాలని చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారు.

బీహార్ అసెంబ్లీ స్పీకర్‌గా బీజేపీ నాయకుడు ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక - Tholi Paluku