Let's talk: editor@tmv.in
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల

Shaik Mohammad Shaffee
1 నవంబర్, 2025

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో, అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) శుక్రవారం పాట్నాలో తమ ఎన్నికల మేనిఫెస్టోను 'సంకల్ప్ పత్ర' పేరుతో విడుదల చేసింది. రాష్ట్ర యువత, మహిళలు, రైతులు, పేద వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఈ మేనిఫెస్టోలో భారీ హామీలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరి, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్ తదితర కీలక నేతలు హాజరయ్యారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే

యువతకు ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ: రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలోని యువతకు ఒక కోటి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని తెలిపారు. ఉద్యోగావకాశాలను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్లు, గ్లోబల్ స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బీహార్‌ను 'గ్లోబల్ స్కిల్లింగ్ హబ్'గా మార్చడమే లక్ష్యమని తెలిపారు. నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలు కల్పించేందుకు రాష్ట్రంలో 'స్కిల్స్ సెన్సస్' నిర్వహిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

మిషన్ కోటీశ్వరి: 'మిషన్ కోటీశ్వరి' ద్వారా ఒక కోటి మంది మహిళలను 'లక్షపతి దీదీలు'గా (ఏడాదికి రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే మహిళలు) తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' కింద మహిళలు వ్యాపారాలు ప్రారంభించడానికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు.

విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాలు

పేద కుటుంబాల పిల్లలకు కేజీ నుండి పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) వరకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తామని ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పేర్కొంది. ఉన్నత విద్యలో చదువుతున్న ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఆర్థిక సహాయం అందిస్తామని, పాఠశాలల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు.

పేదల కోసం 'పంచామృత్ గ్యారెంటీ': ఈ పథకం కింద ఉచిత రేషన్, 125 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం, 50 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం, సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది.

రైతులకు సాయం: కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.3 వేల సాయాన్ని అందిస్తామని, వారికి మొత్తం రూ.9 వేల లబ్ధి జరిగేలా చేస్తామని తెలిపారు.

ఈబీసీ అభివృద్ధి: ఈబీసీలలోని వివిధ వృత్తుల నిపుణులకు రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈబీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి, వారి అభ్యున్నతికి చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సులు చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీ ఛైర్మన్‌గా కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు.

మౌలిక సదుపాయాలు: నాలుగు నగరాల్లో (పాట్నా సహా) మెట్రో ట్రైన్ సర్వీసులు, ఏడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని, ఏడు ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తామని, 3,600 కి.మీ. రైల్వే మార్గాల ఆధునీకరణ పనులు చేపడుతామని, ప్రపంచ స్థాయి మెడిసిటీ, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నిర్మిస్తామని ఎన్డీఏ 'సంకల్ప్ పత్ర'లో పేర్కొంది.

పరిశ్రమలు: 10 కొత్త ఇండస్ట్రియల్ పార్కులు, 100 ఎమ్ఎస్ఎంఈ పార్కులు, డిఫెన్స్ కారిడార్, సెమీకండక్టర్ తయారీ పార్కులు ఏర్పాటు చేస్తామని, ఐదేళ్లలో రూ.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

'సీతాపురం'గా పుణౌరా ధామ్: సీతామర్హి జిల్లాలోని పుణౌరా ధామ్ జానకి మందిరం పేరును ‘సీతాపురం’గా మారుస్తామని కూడా ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రకటించింది.

ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఈ హామీలు, రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ ఇచ్చిన హామీలతో పోటీ పడుతున్నాయి. బీహార్‌లో నవంబర్ 6 మరియు 11 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.