Let's talk: editor@tmv.in
బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షాలపై నితీశ్ ఆగ్రహం

బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షాలపై నితీశ్ ఆగ్రహం

Pinjari Chand
25 ఫిబ్రవరి, 2026

తుపాకులు, గుళ్ల సహాయంతో ప్రభుత్వం నడుస్తోందంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో బీహార్ అసెంబ్లీలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఆర్జేడీ ఎమ్మెల్యే కుమార్ సర్వజీత్ లేచి, గ్రామీణ ‘చౌకీదార్లు’ (కావలివాళ్లు) భత్యాల పెంపు కోసం నిర్వహించిన నిరసనపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. హోం శాఖ పరిధిలో పనిచేసే చౌకీదార్లపై ఇంత దారుణంగా వ్యవహరించడం సరైంది కాదని ఆరోపించారు.

దీనికి అనుసంధానంగా ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు లేచి ‘బందూక్ గోలి కీ సర్కార్ నహీ చలేగీ’ (తుపాకులు, తూటాల ప్రభుత్వాన్ని అనుమతించం) అంటూ నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నితీశ్ కుమార్ అసంబద్ధంగా మాట్లాడవద్దు. ఈ ప్రభుత్వం ఎలాంటి అంతరాయం లేకుండా నడుస్తుంది. మీలో ఎంతమంది మిగిలారు చూసుకోండని ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. 243 సభ్యుల సభలో గత ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 స్థానాలకు పరిమితమైన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది. 2005లో తన నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్జేడీని అధికారంలో నుంచి తప్పించిన విషయాన్ని గుర్తుచేస్తూ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ పనీ చేయలేదు. అప్పట్లో చట్టం, శాంతిభద్రతలు ఎంత దయనీయంగా ఉండేవో ప్రజలు సాయంత్రం 5 తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడేవారు. కాబట్టి అర్థంలేని మాటలు మాట్లాడవద్దు అని సీఎం వ్యాఖ్యానించారు.

వాగ్వాదం మధ్య ప్రతిపక్ష సభ్యుల్లో కొందరు సభ మధ్య భాగానికి వచ్చి ఆందోళన చేపట్టడంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. చివరకు శాసనసభ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌధరీ జోక్యం చేసుకుని, చౌకీదార్ల సంఘాల ప్రతినిధులను చర్చలకు పిలుస్తాం. వారి డిమాండ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతించింది.

బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షాలపై నితీశ్ ఆగ్రహం - Tholi Paluku