
‘బీహార్ అమ్మాయిలు రూ.20–25 వేలకే దొరుకుతారు’ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రి రేఖ ఆర్య భర్త అయిన గిరిధారి లాల్ సాహు బీహార్ అమ్మాయిలపైనా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. బీహార్ నుంచి రూ.20,000–25,000కే పెళ్లి చేసుకునే అమ్మాయిని తీసుకురాగలం అన్నట్లుగా ఆయన చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై అన్ని పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. బీహార్‌లో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు గత నెల ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో జరిగిన ఒక కార్యక్రమంలో చేసినవిగా పేర్కొంటున్నారు.
సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వీడియోలో సాహు మాట్లాడుతూ ‘వృద్ధాప్యంలో పెళ్లి చేసుకుంటారా? మీకు పెళ్లి కుదరకపోతే బీహార్ నుంచి ఒక అమ్మాయిని తీసుకువస్తాం. అక్కడ రూ.20 నుంచి రూ.25 వేలకే అమ్మాయి దొరుకుతుందని అన్నట్టు కనిపిస్తోంది.
బీజేపీ సీనియర్ నేత దిలీప్ జైస్వాల్ ఈ వ్యాఖ్యలను అసహ్యకరమైనవి, తప్పుగా అభివర్ణిస్తూ ఖండించారు. ఆర్జేడీ ప్రతినిధి ఏజాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు బీహార్ మహిళలను అవమానించడమేనని, బీజేపీ జాతీయ నాయకత్వానికి ఇది అగ్నిపరీక్ష అని అన్నారు. అలాగే గత నెల ప్రభుత్వ కార్యక్రమంలో ఒక మహిళా డాక్టర్ ముఖంపై ఉన్న నికాబ్‌ను సీఎం నితీశ్ కుమార్ తొలగించిన ఘటనను ప్రస్తావిస్తూ బీహార్ మహిళలను అవమానించడంలో సీఎం కూడా పాత్ర వహించారు. ఇలాంటి ఘటనలు కూటమి నేతల ధైర్యాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు. మంత్రి భర్తపై, అవసరమైతే మంత్రిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్జేడీ మహిళా విభాగం పాట్నాలో నిరసన ర్యాలీ నిర్వహించి బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేసింది. ఆర్జేడీ నేత సారికా పాస్వాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు బీహార్‌లోని మహిళలందరినీ అవమానించాయని ఆరోపించారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ కూడా ఘాటుగా స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వివాదం చెలరేగిన నేపథ్యంలో గిర్ధారి లాల్ సాహు క్షమాపణ చెప్పగా, బీజేపీ ఉత్తరాఖండ్ యూనిట్ ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ వ్యాఖ్యలను ఖండించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలను భారత మహిళలపై అవమానంగా పేర్కొంటూ బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా ముజఫర్‌పూర్ (వెస్ట్) ఏసీజేఎం కోర్టులో సాహుపై క్రిమినల్ కేసు నమోదు కాగా, ఈ వ్యాఖ్యలు బీహార్ మహిళల గౌరవాన్ని, సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నమని పిటిషనర్ ఆరోపించాడు. ఈ కేసు విచారణను జనవరి 12కు కోర్టు నిర్ణయించింది.
