
బీహార్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడి పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. నేడు (బుధవారం) కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతున్నది. ఇదే రోజు బీహార్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం వర్చువల్‌గా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఈసీ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దక్షిణ అమెరికా దేశాల పర్యటనలో ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో సమావేశానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఈసీ ఇతర సభ్యులైన సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్ ఇతరులు కూడా హాజరుకానున్నారు.
సీట్ల పంపకం కాకముందే..
కాంగ్రెస్ బిహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ), సీపీఐ, సీపీఐ (ఎంఎల్) వంటి వామపక్ష పార్టీలు మహాఘట్ బంధన్ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి బీజేపీ, జేడీ(యూ), ఎల్‌జేపీ (ఆర్‌వీ), హామ్స్ వంటి పార్టీలతో కూడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)తో తలపడనున్నది. కాంగ్రెస్ తన కూటమి భాగస్వాములతో సీట్ల పంపకం ఒప్పందాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ ఇటీవల రాహుల్ గాంధీ, ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ నాయకత్వంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలను కవర్ చేస్తూ ఓటర్ అధికార్ యాత్రను ముగించింది.
మార్పును కోరుకుంటున్న ప్రజలు : కాంగ్రెస్
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హరీష్ రావత్, బిహార్ రాష్ట్రం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దేశమంతటికీ మార్పు మార్గాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించించిన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. చివరి ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లుగా ఉంది, జూన్ 24, 2025 నాటికి 7.89 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం, డ్రాఫ్ట్ జాబితా నుండి 65 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఆగస్టు 1, 2025 నాటికి డ్రాఫ్ట్ జాబితాలో ఓటర్ల సంఖ్య 7.24 కోట్లుగా ఉంది.
సీట్ల కేటాయింపు విషయంలో గందరగోళం
రాష్ట్రంలో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య సీట్ల పంపకాల విషయంలో, కేటాయింపులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం 243 స్థానాలకు గాను ఆర్జేడీ 125 నుంచి 130 స్థానాలు కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ అందుకు ఒప్పుకుంటుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాంగ్రెస్ మొదట 78 సీట్లు కోరిందని సమాచారం. తర్వాత 60-65కి తగ్గించింది. కాంగ్రెస్‌కు కేవలం 60 స్థానాల్లోనూ కేటాయిస్తామని ఆర్జేడీ నేతలు అంటున్నారు. ఇది 2020లో కాంగ్రెస్ పోటీ చేసిన 70 సీట్ల కంటే తక్కువ. అయితే సీట్ల కేటాయింపులో ఏదైనా గందరగోళం జరిగితే టికెట్ ఆశించిన నేతలు ఇతర పార్టీల్లో చేరిపోవడమో లేదంటే స్వతంత్రంగా పోటీ చేయడమో జరుగుతూ ఉంటుంది. దీని వల్ల అంతిమంగా కూటమికి నష్టమే. మరి ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.
