
బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించింది: ప్రధాని మోడీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం అభివృద్ధి రాజకీయాలకు దక్కిన తీర్పు అని, బంధుప్రీతి రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విజయం ఆర్జేడీ 'జంగిల్ రాజ్' కారణంగా కష్టాలు ఎదుర్కొన్న బీహార్ మహిళల విజయమని ప్రధాని మోడీ అన్నారు. రికార్డు సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘంపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇది దేశ ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని బలోపేతం చేసిన ప్రజాస్వామ్య విజయమని అన్నారు. గతంలో బీహార్‌లో రీ-పోలింగ్ లేకుండా ఎన్నికలు జరిగేవి కావు, కానీ ఈసారి పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశం ఇప్పుడు నిజమైన సామాజిక న్యాయం కోసం ఓటు వేస్తోందని అన్నారు. బీహార్ ఫలితాలు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి,అసోం, బెంగాల్‌లోని కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయని, బెంగాల్‌లో కూడా జంగిల్ రాజ్‌ను అంతం చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న విధానాలపై పార్టీ శ్రేణుల్లో "తీవ్ర నిరాశ, ఆగ్రహం" పేరుకుపోయిందని, త్వరలో ఆ పార్టీలో "అతిపెద్ద చీలిక" సంభవించే అవకాశం ఉందని ప్రధాని మోడీ అన్నారు. కాంగ్రెస్ "ముస్లింలీగీ మావోవాది కాంగ్రెస్"గా మారిందని, ఆ పార్టీ మొత్తం ఎజెండా దీని చుట్టూనే తిరుగుతోందని ఆయన ఆరోపించారు.
"కాంగ్రెస్ రాజకీయాలకు ఆధారం ఇప్పుడు కేవలం ప్రతికూల రాజకీయాలు మాత్రమే. ఒకసారి 'చౌకీదార్ చోర్ హై' అని నినాదం ఇస్తుంది, మరోసారి పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తుంది, కొన్నిసార్లు సంస్థలపై దాడి చేస్తుంది, కొన్నిసార్లు ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తుతుంది, కొన్నిసార్లు ఎన్నికల సంఘాన్ని దూషిస్తుంది, మరికొన్నిసార్లు 'ఓట్ల చోరీ' అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తుంది, కులం, మతం పేరుతో ప్రజలను విభజిస్తుంది, దేశ శత్రువుల ఎజెండాను ముందుకు తెస్తుంది" అని ఆయన ధ్వజమెత్తారు.
గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడంకెల సంఖ్యను కూడా అందుకోలేకపోయిందని ప్రధాని గుర్తు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య "మేము ఈ రోజు (బీహార్‌లో) గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య కంటే తక్కువగా ఉంది" అని ఆయన ఎత్తి చూపారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీపై ప్రజల విశ్వాసం నిరంతరం తగ్గుతోందని అన్నారు. బీహార్‌లో 35 సంవత్సరాలు, గుజరాత్‌లో 30 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాలు, పశ్చిమ బెంగాల్‌లో ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉందని ఆయన గుర్తు చేశారు.
"కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా దాని ప్రతికూల రాజకీయాల కారణంగా అందరినీ ముంచుతోందని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాయి," అని ప్రధాని మోడీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ మత్స్యకారులతో సంభాషిస్తూ చెరువులోకి దిగిన ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ "కాంగ్రెస్ 'నామ్‌దార్' చెరువులో మునిగి, ఇతరులను కూడా ముంచేయడానికి సాధన చేస్తున్నారని నేను బీహార్ ఎన్నికల సమయంలోనే చెప్పాను" అని ఆయన ఎద్దేవా చేశారు.
