Let's talk: editor@tmv.in
బీహార్‌లో శాంతి భద్రతలకు ‘అంత్యక్రియలు’: తేజస్వి యాదవ్

బీహార్‌లో శాంతి భద్రతలకు ‘అంత్యక్రియలు’: తేజస్వి యాదవ్

Pinjari Chand
19 జనవరి, 2026

బీహార్‌లో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ, బీహార్‌లో లా అండ్ ఆర్డర్‌కు ఇప్పటికే అంత్యక్రియలు పూర్తయ్యాయని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. మధేపురా, ఖగారియా, పాట్నా ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులపై జరిగిన అమానుష ఘటనలను ప్రస్తావించిన తేజస్వి యాదవ్, ఈ ఘటనలపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మౌనం వహించడం నేరపూరితమని విమర్శించారు. అధికారంలో ఉన్నవారే నేరస్తులను కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎక్స్ లో చేసిన పోస్టులో అవినీతి, అణచివేత, నేరాలు, అత్యాచారాలకు ఈ డబుల్ ఇంజిన్ ఎన్డీఏ ప్రభుత్వం సాధనంగా మారింది. మైనర్ బాలికలు, విద్యార్థినులు, మహిళలపై జరుగుతున్న దుర్మార్గాలను ప్రభుత్వం కళ్లముందే చూస్తూ మౌనం పాటిస్తోందని తేజస్వి మండిపడ్డారు.

మధేపురాలో ఒక వితంతువుపై గ్యాంగ్‌రేప్ చేసి హత్య చేయడం, ఖగారియాలో నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం, పాట్నాలో నీట్ అభ్యర్థినిపై అత్యాచారం అనంతరం హత్య చేసి ఆధారాలు దాచిపెట్టేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన తెలిపారు.

ఈ ఘటనలకు నిరసనగా జరిగిన ఆందోళనలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తేజస్వి ఖండించారు. నేరస్తులను అతిథుల్లా చూసి కాపాడే పోలీసులు, బాధితులకు న్యాయం చేయాలని అడిగిన ఆర్జేడీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడం ఎందుకు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడి చాలా కాలమైంది. ప్రభుత్వ మౌనం వల్లే నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రజల సహనం క్షీణిస్తోంది. ఇకపై ప్రజలు తమ పోరాట శక్తిని ఎలా చూపించాలో ఈ ప్రభుత్వం చూడాల్సి ఉంటుందని తేజస్వి యాదవ్ హెచ్చరించారు.

హాస్టల్‌లోనే పుస్తకాలు, వస్తువులన్నీ ఉన్నాయి తల్లిదండ్రుల ఆవేదన

పాట్నా లో నీట్‌కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నేపథ్యంలో, ఆ హాస్టల్ బయటకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ యాజమాన్యం సహకరించట్లేదని, తమ పిల్లల చదువుకు అవసరమైన వస్తువులు తీసుకెళ్లేందుకు కూడా లోపలికి అనుమతించడం లేదని వారు ఆరోపించారు.పోలీసుల ప్రకారం నీట్ అభ్యర్థి అయిన యువతి చికిత్స సమయంలో మృతి చెందింది. ఈ కేసులో లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు వైద్యులు లైంగిక దాడి జరిగిందని నిర్ధారించలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం బీహార్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు.

హాస్టల్ వెలుపల ఉన్న తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమను ప్రాంగణంలోకి అనుమతించడం లేదని చెప్పారు. ఓ విద్యార్థి తల్లి పూనమ్ సింగ్ మాట్లాడుతూ నా బిడ్డ ల్యాప్‌టాప్‌, పుస్తకాలు, మంచం, బట్టలన్నీ హాస్టల్‌లోనే ఉన్నాయి. ఎన్నిసార్లు అడిగినా స్పందించడం లేదు, తలుపులు తెరవడం లేదు. పిల్లలు చదవలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై మరో విద్యార్థి తండ్రి సంతోష్ కుమార్ మాట్లాడుతూ మేము కేవలం మా పిల్లల పుస్తకాలు, అవసరమైన వస్తువులు తీసుకెళ్లడానికే వచ్చాం. అన్నీ హాస్టల్‌లోనే ఉన్నాయి. ఎవ్వరూ తలుపులు తీయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారు? పోలీసులు కూడా స్పష్టంగా ఏమీ చెప్పడం లేదని అన్నారు.

పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు

ఇదివరకే బీహార్‌కు చెందిన జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్, పాట్నా ఎస్‌ఎస్‌పీ కార్తికేయ్ కె. శర్మను కలసి ఈ ఘటనపై చర్చించారు. బాధితురాలి కుటుంబంపై కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారని ఆయన తెలిపారు. బాధితురాలి కుటుంబాన్ని కలిసిన అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో పక్షపాత ధోరణి ఉందని కుటుంబం ఆరోపించిందన్నారు. న్యాయం కోసం జనవరి 12న కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టగా, పోలీసులు లాఠీచార్జ్ చేశారని, కొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనను చూస్తే యువతిని వేధించినట్లు అనిపిస్తోంది. లోతైన దర్యాప్తు అవసరమని పోలీసులు కూడా అంగీకరించారు. బాధిత కుటుంబం—దర్యాప్తు చేసిన అధికారులు పాక్షికంగా వ్యవహరించారని, కేసు వదిలేయాలంటూ ఒత్తిడి తెచ్చారని, లంచం కూడా ఆఫర్ చేశారని ఆరోపిస్తోంది. సిట్ ఆమెకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

ఈ సందర్భంగా పాట్నా ఎస్‌ఎస్‌పీ కార్తికేయ్ శర్మ మాట్లాడుతూ కేసు దర్యాప్తు పరిధిని విస్తరించేందుకు సిట్ ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని అంశాలపై నివేదికలు వచ్చిన తర్వాత దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తాం. బలహీన వర్గాల కోసం అదనపు డీజీపీ కూడా ఈ కేసును సమీక్షించారు. పలు కొత్త కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

ఇదివరకే జనవరి 12న పాట్నా ఏఎస్పీ (సదర్) అభినవ్ కుమార్ మాట్లాడుతూ ఈ కేసులో లైంగిక దాడి ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని, వదంతులు ప్రచారం చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోస్ట్‌మార్టమ్‌ను వీడియో చిత్రీకరణతో నిర్వహించాం. ఆధారాల ఆధారంగానే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవ్వరినీ అరెస్టు చేయలేమని ఆయన స్పష్టం చేశారు. హాస్టల్ నిర్వాహకుడు, మేనేజర్‌లను విచారించినప్పటికీ, ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకునేంత ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.