
బీహార్‌లో రికార్డు స్థాయి పోలింగ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గోన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 66.91 శాతం ఓటింగ్ నమోదై కొత్త రికార్డు సృష్టించింది. స్వాతంత్రం వచ్చిన తరువాత 1951 లో ఈ స్థాయిలో పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రెండో, తుదిదశలో 122 నియోజకవర్గాల్లో 3.70 కోట్ల ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలు చివరి గంటల్లో కూడా కొనసాగడంతో తుది శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గోని ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అత్యధికంగా కిషన్‌గంజ్ 76.26శాత, కతిహార్ 75.23, పూర్ణియా 73.79, సుపౌల్ 70.69, పశ్చిమ చంపారన్ 69.02,
బాంకా 68.91 శాతంగా ఓటింగ్ నమోదైంది. అతి తక్కువగా నవాడా నియోజకవర్గంలో 57.11 శాతం, రోహ్తాస్ 60.09, మధుబనీ 61.79, గయా టౌన్ 58.43, జంజ్హర్పూర్ 57.73శాతం పోలింగ్ నమోదైంది.
ఎనిమిది జిల్లాల్లో మంత్రుల భవిష్యత్తు
రెండో దశలో నితీశ్ క్యాబినెట్‌కు చెందిన 12 మంది మంత్రుల భవిష్యత్తు ఎలక్ట్రానిక్ యంత్రాల్లో నిక్షిప్తమయ్యింది.
జేడీయూ తరఫున – విజయేంద్ర యాదవ్ (సుపౌల్), లెసీ సింగ్ (ధమ్దాహా), జయంత్ కుశ్వాహా (ఆమర్‌పూర్), సుమిత్ సింగ్ (చకాయ్), మహమ్మద్ జమా ఖాన్ (చైన్‌పూర్), శీలా మండల్ (ఫూల్‌పరాస్) పోటీ చేస్తున్నారు.
బీజేపీ తరఫున – ప్రేమ్ కుమార్ (గయా), రేణు దేవి (బెట్టియాహ్), విజయ్ మండల్ (సికటీ), నితీశ్ మిశ్రా (ఝంజ్హార్పూర్), నీరజ్ బబ్లూ (ఛటాపూర్), కృష్ణానందన్ పాస్‌వాన్ (హర్సిద్ధి) రంగంలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి
గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లలో 12 సీట్లు ఈ దశలోనే ఉన్నాయి. వీటిలో రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ కుమార్ రామ్ (కుటుంబ), షకీల్ అహ్మద్ ఖాన్ (కడ్వా) వంటి కీలక నేతల భవిష్యత్తు కూడా ఈ దశలోనే తేలనుంది.
మొదటి దశలోనూ రికార్డు స్థాయిలో పోలింగ్
బీహార్ లో మొదటి దశలోనూ 65.08 శాతం ఓటింగ్ నమోదై బీహార్ చరిత్రలోనే అత్యధికంగా నిలిచింది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.
111 ఏళ్ల వయసులో ఓటు వేసిన నసీమా ఖతూన్
ఆమెకు వయస్సు అడ్డంకి కాలేదు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలనే ఉత్సాహం ఉంటే చాలు. బీహార్‌లోని సుపౌల్ జిల్లా, ఛటాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 111 ఏళ్ల నసీమా ఖతూన్ మంగళవారం వీల్‌చెయిర్‌పై వచ్చి ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
నేను నా ఓటు వేశా… నా బాధ్యతను నెరవేర్చా అని పోలింగ్ బూత్ నుంచి బయలుదేరుతూ నసీమా ఖతూన్ మీడియాతో చెప్పారు. ఆమె సుపౌల్ జిల్లాలో అత్యంత వయోవృద్ధ ఓటరని అధికారులు తెలిపారు.
