Let's talk: editor@tmv.in
బీహార్‌లో రికార్డు పోలింగ్ 64.66

బీహార్‌లో రికార్డు పోలింగ్ 64.66

Pinjari Chand
7 నవంబర్, 2025

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొన్నిచెదురు,మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ శనివారం రాత్రి 8 గంటల వరకు 64.66 శాతంగా నమోదైంది.ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డ్ పోలింగ్ గా నిలిచింది. ఇది రాష్ట్రంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఎక్కువ. 2015 లో 56.66శాతం, 2020లో 57.29శాతం పోలింగ్ నమోదైంది. 1998 లో 64.2 శాతం నమోదైంది. మళ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో పోలింగ్ సరళి కొనసాగింది. 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ ఇంటెన్సివ్ రోల్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ సారి పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ దశలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలలో సుమారు 3.75 కోట్లు ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ఎక్స్​ లో ‘ప్రజాస్వామ్య పండుగకు స్వాగతం. ప్రతి ఓటరుకు ఆహ్వానం అని పేర్కోంది. ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా భద్రతా దళాలను ఈసీఐ పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించింది.

భీంబంధ్ – 20 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం

ముంగేర్ జిల్లా నక్సల్ ప్రభావిత భీంబంధ్‌ ప్రాంతంలో 2005 తర్వాత తొలిసారిగా పోలింగ్ జరిగింది. 2005లో ఎస్పీ సురేంద్ర బాబు, ఏడుగురి పోలీస్‌ సిబ్బందిని హత్య చేసిన ఘటనల కారణంగా బూత్‌లను దూరంగా తరలించారు. ఈరోజు 374 రిజిస్టర్డ్ ఓటర్లు, అందులో 170 మహిళలు, తమ ఓటు హక్కును వినియోగించారు. రాజకీయ పరిస్థితులు 2005 తరువాత అనుకూలంగా లేవు. ఇప్పుడు మా గ్రామంలో పోలింగ్ జరుగుతోంది, చాలా సంతోషంగా ఉందని 81 ఏళ్ల విష్ణు దేవ్ సింగ్ మీడియాతో అన్నారు. తాజాగా 18 ఏళ్ల వయస్సు పూర్తిచేసుకున్న బదల్ ప్రతాప్ మొదటి సారి ఓటు వేసిన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. స్థానికులు, మహిళలు, వృద్ధులు సంతోషంగా పాల్గొన్నారు. ప్రజలు బూత్ దగ్గర రావడానికి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ కవరేజీ, సౌకర్యాలు కల్పించినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.

మహిళల ప్రేరణ

పాట్నాలో మహిళలు మిథిలా జిన్ జియ్యా నృత్యం ప్రదర్శించి ఓటింగ్‌ పై అవగాహన కల్పించారు. అదే సమయంలో, దర్బంగా మహిళలు ముఖం పై బుర్ఖా ధరించి వచ్చారు. వారే బుర్ఖా తీసి అధికారులకు సహకరించారు. వారిని తనిఖీ చేయడానికి ఈసీఐ అధికారులు అంగన్ వాడీ కార్యకర్తలను నియమించారు. ఈ నిబంధనను మహిళలు స్వాగతించారు. స్థానికులు రేహానా ఖాతున్ వంటి ఓటర్లు ఈ విధానం ఓటు చోరీని ఆపగలదని అభిప్రాయపడ్డారు.

మహిళలే బుర్ఖా ధరిస్తున్న ఓటర్ల ముఖాన్ని పరిశీలిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కేవలం సరైన వ్యక్తే ఓటు వేయగలుగుతారు. ఇది సరికొత్త హక్కు, దానిలో తప్పేమీ లేదని ఎలక్షన్ కమిషన్ అధికారి తర్నబ్ అన్సారీ అన్నారు.

దానాపూర్ – పడవల్లో పోలింగ్ కేంద్రాలకు

పాట్నా జిల్లా దానాపూర్ డియారా, వరద ప్రభావిత ప్రాంతంలో వంతెనలు లేకపోవడంతో స్థానికులు పడవల్లో బూత్‌లకు చేరుకున్నారు. మాకు వంతెన కావాలి. డాక్టర్‌, అంబులెన్స్, స్కూల్ బస్సులు వెళ్లలేవు. ఓటు వేయడానికి పడవలోనే వెళ్ళాలి అని ఓ మహిళ చెప్పింది.

లఖిసరాయ్ లో ఉప ముఖ్యమంత్రి పై దాడి

లఖిసరాయ్‌లో ఖోరియారీ గ్రామంలో ఆర్జేడీ కార్యకర్తలు ఉప ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హా కారు చుట్టూ చేరి రాళ్లు, స్లిప్పర్లు విసరుతూ ‘ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు.

ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు అయితే వారిపై కఠిన చర్య తీసుకుంటాం. ముంగేర్, లఖిసరాయ్, షేక్‌పురా జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ముంగేర్ రేంజ్ డీఐజీ రాకేష్ కుమార్ హెచ్చరించారు.

వారిపనే.. విజయ్ కుమార్ సిన్హా

విజయ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ వీరు ఆర్జేడీ గూండాలు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే గెలవనుంది. అందుకే వీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. గూండాలు నన్ను గ్రామానికి వెళ్ళనివ్వడం లేదు. విజయ్ సిన్హా గెలవబోతున్నాడు. వారు మా పోలింగ్ ఏజెంట్‌ను కొట్టారు. అతన్ని ఓటు వేయనివ్వలేదు. వారి గూండాయిజాన్ని చూడండి. ఇవి ఖోరియారి గ్రామంలోని 404, 405 బూత్ నంబర్లు. తన నియోజకవర్గంలోని ఖోరియారి గ్రామాన్ని సందర్శించినప్పుడు తన కారును రాష్ట్రీయ జనతాదళ్ మద్దతుదారులు చుట్టుముట్టారని, వారు రాళ్లు, ఆవు పేడ విసిరి "ముర్దాబాద్" అని నినాదాలు చేశారని సిన్హా అన్నారు.

ఆయా నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 60.13% ఓటింగ్ నమోదు అయింది. అత్యధికంగా బేగుసరాయ్ లో 67.32శాతం, గోపాల్ గంజ్ 64.96శాతం, ముజఫర్‌పూర్ 64.63శాతం, లఖిసరాయ్ 62.76శాతం, మధుపురా 65.74, పాట్నా: 55.02, భోజ్‌పూర్ 53.24, బక్సర్ 55.10, దర్బంగా 58.38, ఖగరియా 60.65, ముంగేర్ 54.90, నలందా 57.58, సహార్సా 62.65, సమస్తిపూర్ 66.65, సరణ 60.90, షేక్‌పురా 52.36, సివాన్ 57.41, వైశాలి 59.45శాతం నమోదైంది.

ప్రధాన నియోజకవర్గాల్లో

రాఘోపూర్ 64.01శాతం, మహువా 54.88, అలీనగర్ 58.05, తారపూర్ 58.33, లఖిసరాయ్ 60.51, చాప్రా 56.32, బాంకిపూర్ 40, ఫూల్వారి 62.14, రఘునాథ్‌పూర్ 51.18, సివాన్ 57.38, మోకామా 62.16శాతంగా నమోదైంది.

రాజకీయ నాయకుల స్పందనలు

లాలు ప్రసాద్ యాదవ్

పెన్నం మీద రొట్టె తిప్పుతూ ఉండాలి లేకుంటే కాలిపోతుంది. 20 ఏళ్లు ఎక్కువ. ఇప్పుడు యువ ప్రభుత్వానికి, కొత్త బీహార్ కోసం తేజస్వీ నాయకత్వం అవసరం.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ :

‘ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కేవలం హక్కు కాదు, బాధ్యత కూడా. ప్రతి ఓటరు ముందడుగు వేయాలి. ఇతరులను కూడా అందుకు ప్రేరేపించాలి.

పోలింగ్ పరిశీలనకు అంతర్జాతీయ పరిశీలకులు

ఈ దశలో ఇండోనేషియా, కొలంబియా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, బెల్జియం, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్ దేశాలతో సహ 16 దేశాల ప్రతినిధులు బీహార్‌లోని పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పర్యటన ఇంటర్నేషనల్ ఎలెక్టర్స్ విజిటర్స్ ప్రోగ్రాం ద్వారా జరిగిందని ఈసీఐ తెలిపింది. ప్రతినిధులు పాట్నా లోని కొన్ని బూత్‌లను సందర్శించి పోలింగ్ నిర్వహణ, ఓటర్ల సౌకర్యం, సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించారు.