Let's talk: editor@tmv.in
బీహార్‌లో ముగిసిన తొలిదశ ప్రచార పర్వం

బీహార్‌లో ముగిసిన తొలిదశ ప్రచార పర్వం

Pinjari Chand
5 నవంబర్, 2025

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతకు ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. పది రోజులపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ప్రచారపర్వంలో చివరి రోజు రెండు ప్రధాన కూటముల నేతలు హోరాహోరీగా సభలు నిర్వహించారు. ఒకవైపు ఎన్‌డీఏ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రులు నీతీష్‌కుమార్‌, యోగి ఆదిత్యనాథ్ తదితర నాయకులు ప్రచార రంగంలో చురుకుగా పాల్గోన్నారు. చంపారన్, ముంగేర్, వైశాలీ, పట్నా, సహర్సా, భోజ్పూర్, గయ తదితర నియోజకవర్గాల్లో నేతలు పాల్గోని ఎన్డీయే కూటమిని భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. మరోవైపు మహాఘట్బంధన్‌ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌, ముఖేష్ సహనీ, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ తదితరుల సభలతో బీహార్ లో సందడి నెలకొంది.

నమో యాప్‌ ద్వారా కార్యకర్తలకు మోడీ సందేశం

చివరి రోజు ప్రచార సమయం ముగిసే ముందు ప్రధానమంత్రి మోడీ ‘నమో యాప్‌’ ద్వారా బీహార్‌ భాజపా కార్యకర్తలతో ఆన్‌లైన్‌ ద్వారా సంభాషించారు. మీరు ప్రతి ఓటరికి భాజపా పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేయండి. బీహార్‌ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఆయన ఉత్సాహపరిచారు. భారీ మెజార్టీతో గెలుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

జంగిల్‌రాజ్‌ మళ్లీ రానివ్వొద్దు:అమిత్‌షా

దర్భంగా, మధుబని, ముజఫ్ఫర్‌పూర్‌ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌డీఏ సభల్లో అమిత్‌షా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లాలూ–రబ్రీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న జంగిల్‌రాజ్‌ను మళ్లీ రానివ్వొద్దు. ప్రజలు కమలం గుర్తుపై నొక్కి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మోడీ–నీతీష్‌ కూటమి బీహార్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తుంది. ప్రతి జిల్లాలో కౌశల్‌ వికాస్‌ కేంద్రాలు, పరిశ్రమల పార్కులు, రక్షణ కారిడార్‌ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

హామీల వర్షం కురిపించిన తేజస్వీ

ఇక మహాఘట్బంధన్‌ తరఫున ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ మధేపురా, పూర్నియా, భాగల్పూర్‌ జిల్లాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించారు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పంటలకు కనీస ధరతో పాటు అదనపు బోనస్‌ – ఇవే మా ‘తేజస్వీ ప్రణ్‌’లోని ప్రధాన హామీలని ఆయన వెల్లడించారు. అలాగే మహిళలకు మా బెహన్, మా యోజన కింద రూ.30 వేలు అందిస్తామన్నారు. అలాగే ఈ సారి జన్ సురాజ్ పార్టీని స్థాపించి ప్రశాంత్ ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. అయితే మూడు స్థానాల్లో అధికార పార్టీ ఒత్తిడి వల్ల గోపాల్ గంజ్, దానాపూర్, బ్రహ్మ్​పూర్ లలో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పీకే అభ్యర్థులుగా విద్యావంతులను బరిలో దించారు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ కూడా పార్టీని స్థాపించి ఎన్నికల్లో తలపడుతున్నారు.

సంచలనం రేపిన అనంత్ సింగ్ అరెస్ట్

మోకామా నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న జేడీయూ నేత అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జన్ సురాజ్ నాయకుడు దులర్ చంద్ హత్య కేసులో ఆయనను జైలుకు తరలించారు.

నిఘా పెంచిన ఎస్ఈసీ

ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి బీహార్‌లో ఆధారాలు లేని డబ్బు, మద్యం, డ్రగ్స్‌, ఇతర ఉచిత వస్తువులను విస్తృతంగా సీజ్‌ చేశారు. రూ. 9.62 కోట్ల నగదు, రూ. 42.14 కోట్ల విలువైన మద్యం, రూ. 24.61 కోట్ల డ్రగ్స్‌, రూ. 26 కోట్ల విలువైన ఇతర వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. మొత్తం విలువ రూ. 108 కోట్లకు పైగా చేరిందని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోలీసులు, ఆదాయశాఖ, ఎక్సైజ్‌ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు.

సిద్ధంగా పోలింగ్‌ బృందాలు

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, వీవీప్యాట్లు, భద్రతా బృందాలు ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నాయి. ఎక్కడైనా గందరగోళం ఏర్పడితే ముందస్తుగా సీసీటీవీ పర్యవేక్షణతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. నవంబర్‌ 6న జరిగే తొలి విడతలో మొత్తం 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సమయం ఈసారి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకుగా నిర్ణయించారు. అయితే కొన్ని నక్సలైట్ ప్రభావిత నియోజకవర్గాల్లో భద్రతా కారణాల వల్ల ఓటింగ్ సమయాన్ని మధ్యాహ్నం 4 గంటలకే ముగిస్తారు.

బీహార్‌లో ముగిసిన తొలిదశ ప్రచార పర్వం - Tholi Paluku