Let's talk: editor@tmv.in
బీహార్‌లో మా మద్దతు కాంగ్రెస్‌కే: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే

బీహార్‌లో మా మద్దతు కాంగ్రెస్‌కే: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే

Pinjari Chand
13 అక్టోబర్, 2025

బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా కూటములకు వివిధ పార్టీలు మద్దతును తెలుపుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఎన్డీయే, మహాఘట్బంధన్ మధ్యే పోటీ ఉండనుంది. అయితే ఈసారి జన్ సురాజ్ కూడా పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నిస్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఆదివారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్​) ఎంపీ సుప్రియా సూలే బీహార్​లో జరిగే ఎన్నికల్లో మహాఘట్బందన్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. అవసరమైతే అక్కడ ప్రచారం చేస్తామని ఈ సందర్బంగా వివరించారు.

సాధ్యమైనంత సహాయం చేస్తాం

బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన కూటమికి సాధ్యమైనంతగా తాము సహాయం చేస్తామని, వారు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్లి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటామన్నారు. మహాఘట్బందన్ నుంచి ఇంకా సీఎం అభ్యర్థిని నిర్ణయించలేదు. త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. ఎన్డీయే కూడా ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు కదా అని గుర్తు చేశారు.

ప్రతి కుటుంబానికి ఉద్యోగమిస్తాం: ఆర్జేడీ

రాబోయే ఎన్నికల్లో మహాఘట్బంధన్ విజయం సాధిస్తుందని, నవంబర్ 14న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అప్పటి నుంచే రాష్ట్రంలో నిరుద్యోగాన్ని ప్రారదోలే ఉద్యమం చేబడతామని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నాయకుడు తేజస్వీ యాదవ్ వివరించారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.

ప్రతి కుటుంబానికి ఉద్యోగం సాధ్యమవుతుందా?

బీహార్ ఎన్నికల్లో ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పదేపదే చెబుతున్నారు. బీహార్ లో అన్ని శాఖల్లో కలిపి సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. బీహార్ లో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 73 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో బీహార్ లో దాదాపు కోటికి పైగా కుటుంబాలు ఉన్నాయి. ఈ విధంగా అన్ని ఉద్యోగాలు భర్తీ చేసినా కేవలం 2.4 శాతం కుటుంబాలు మాత్రమే లబ్ది పొందుతాయి. అన్ని కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడం కత్తి మీద సామే. ఒకవేళ కొత్త ఉద్యోగాల సృష్టి చేయాలంటే అందుకు చాలా సమయం పడుతుంది. అలాగే బడ్జెట్ లో కూడ అధిక మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 13 రెట్లు ప్రభుత్వ ఉద్యోగాలను పెంచాల్సి ఉంటుంది.

బీహార్‌లో మా మద్దతు కాంగ్రెస్‌కే: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే - Tholi Paluku