Let's talk: editor@tmv.in
బీహార్‌లో మళ్లీ ఎన్డీయేకే పట్టం

బీహార్‌లో మళ్లీ ఎన్డీయేకే పట్టం

Shaik Mohammad Shaffee
15 నవంబర్, 2025

దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 202 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్కును సునాయాసంగా దాటింది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి (మహాఘట్‌బంధన్) అత్యంత నిరాశపరిచే ప్రదర్శన చేసింది.

ఎన్డీయే కూటమి బలం

ఎన్డీయే కూటమిలో భాగస్వాములైన పార్టీల ప్రదర్శన అత్యంత బలంగా ఉంది. భారతీయ జనతా పార్టీ కూటమిలో అత్యధికంగా 89 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) 85 స్థానాలు దక్కించుకుంది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 19 స్థానాలు గెలుచుకుంది. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 5 స్థానాలు, ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా 4 స్థానాలు గెలుచుకున్నాయి.

ఇండియా కూటమి పేలవ ప్రదర్శన

ప్రతిపక్ష ఇండియా కూటమి కేవలం 34 స్థానాలకే పరిమితమై, ఘోర పరాజయాన్ని చవిచూసింది. మహాకూటమిలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) 25 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ 2 స్థానాలు, మరియు సీపీఐ(ఎం) ఒక స్థానం మాత్రమే గెలుచుకున్నాయి. వీటితో పాటు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం 5 స్థానాలు, బహుజన్ సమాజ్ పార్టీ, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ చెరో ఒక స్థానం గెలుచుకున్నాయి.

ఓట్ల శాతం వివరాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన తుది ఓట్ల శాతం ప్రకారం, ఎన్డీయే కూటమి మొత్తం 44.31 శాతం ఓట్లను దక్కించుకోగా, ఇందులో బీజేపీ 20.08 శాతం, జేడీయూ 19.26 శాతం, ఎల్‌జేపీ(ఆర్‌వీ) 4.97 శాతం ఓట్లను సాధించాయి. మరోవైపు ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ మొత్తం ఓట్ల శాతం 34.15గా ఉంది. ఈ కూటమిలో ఆర్జేడీ అత్యధికంగా 23 శాతం ఓట్లను సాధించినప్పటికీ, కాంగ్రెస్ కేవలం 8.71 శాతం ఓట్లకే పరిమితమైంది. ఇతర పార్టీల విషయానికి వస్తే సీపీఐ(ఎంఎల్) (ఎల్) 2.84 శాతం, ఏఐఎంఐఎం 1.85 శాతం, బీఎస్‌పీ 1.62 శాతం ఓట్లను దక్కించుకున్నాయి. ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేయడానికి ఇష్టపడని వారు ఉపయోగించే నోటాకు 1.81 శాతం ఓట్లు లభించగా, ఇతర పార్టీలు/స్వతంత్రులు మొత్తం 14 శాతం ఓట్లను పొందారు.

కీలక నేతల విజయం

నితీష్ కుమార్ హర్నౌత్ స్థానంలో 48,000 ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధించి, సుస్థిరత్వం, సుపరిపాలనపై ఉన్న నమ్మకాన్ని బలపరిచారు. ఎన్డీయే నుంచి ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి (తారాపూర్ నుంచి 45,843 ఓట్ల మెజారిటీతో), విజయ్ కుమార్ సిన్హా (లఖిసరాయ్ నుంచి 24,940 ఓట్ల మెజారిటీతో), రాష్ట్ర మంత్రులు ప్రేమ్ కుమార్ (గయా టౌన్ నుంచి), మహేశ్వర్ హజారీ (కళ్యాణ్‌పూర్ నుంచి), సంజయ్ సారోగి (దర్భంగా నుంచి) విజయం సాధించిన ప్రముఖుల్లో ఉన్నారు. మొదటిసారి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి, గాయని మైథిలీ ఠాకూర్ కూడా అలినగర్ స్థానంలో 11,730 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. క్రీడాకారిణి శ్రేయసి సింగ్ (జమూయి), మాజీ మంత్రి రాణా రణధీర్ సింగ్ (మధుబన్) కూడా గెలిచారు.

ఇండియా కూటమి నుంచి ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రాఘోపూర్ స్థానం నుంచి 14,532 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్‌పై విజయం సాధించారు. దివంగత మొహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామా షాహబ్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి సందీప్ సౌరవ్ కూడా గెలుపొందారు. అలాగే జైలులో ఉన్నప్పటికీ, జజేడీయూ అభ్యర్థి అనంత సింగ్ మోకామా స్థానం నుంచి విజయం సాధించారు. ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన హత్య కేసులో జైలులో ఉన్న ఆయన, ఆర్‌జేడీ అభ్యర్థి వీణా దేవిని ఓడించారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) రాష్ట్ర అధ్యక్షుడు రాజూ తివారీ గోవింద్‌గంజ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 32,000 ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారు. తేజ్ ప్రతాప్ యాదవ్ (జేజేడీ) మహువాలో మూడో స్థానానికే పరిమితమై, ఎల్‌జేపీ(ఆర్‌వీ) అభ్యర్థి సంజయ్ కుమార్ సింగ్ చేతిలో 44,997 ఓట్ల తేడాతో ఓడిపోయి పెద్ద షాక్ ఇచ్చారు.

ఎన్డీయేలో బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయగా, ఎల్‌జేపీ (ఆర్‌వి) 28 స్థానాల్లో పోటీ చేసింది. మహాకూటమిలో ఆర్‌జేడీ 141 స్థానాల్లో, కాంగ్రెస్ 61 స్థానాల్లో మరియు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ 20 స్థానాల్లో పోటీ చేశాయి.

ఖాతా తెరవని పీకే ‘జన్‌ సురాజ్ పార్టీ’

మరోవైపు మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్‌ సురాజ్ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 238 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ, ఈ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక, ఖాతా తెరవడంలో విఫలమైంది. రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి, ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో విజయవంతమైన ప్రశాంత్ కిషోర్, తన సొంత పార్టీ జన్‌ సురాజ్ విషయంలో మాత్రం ప్రజల మద్దతును పొందలేకపోయారు. ప్రశాంత్ కిషోర్ వంటి ఎన్నికల వ్యూహకర్త తన సొంత పార్టీ విషయంలో 'అట్టర్ ఫ్లాప్' కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎన్డీయే సాధించిన ఈ అఖండ విజయం బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ నాయకత్వ స్థిరత్వాన్ని, అభివృద్ధి రాజకీయాలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఈ విజయం ఆయనకు ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం సుగమం చేసింది. ఈ ఫలితాలు పాలక కూటమి స్థిరత్వాన్ని, ప్రతిపక్షంలో ఉన్న చీలిక, తగ్గుతున్న ప్రజాదరణను స్పష్టం చేస్తున్నాయి. బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చిన ఈ తీర్పు, రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర పాలన దిశను నిర్దేశించనుంది.

బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎవరు ఏమన్నారంటే?

“ఈ గెలుపు వికసిత్ బీహార్‌పై విశ్వాసం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయం. జంగల్‌రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు ఏ వేషంలో వచ్చినా.. వారికి దోచుకునే అవకాశం లభించదు”- కేంద్ర హోం మంత్రి అమిత్ షా

“ప్రధాని మోడీ, నితీష్ ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ విధానాలపై ప్రజల నమ్మకానికి ఈ విజయం నిదర్శనం. జంగల్‌రాజ్‌, అవినీతిని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారు. సుపరిపాలన, స్థిరత్వం, అభివృద్ధికి ఓటేశారు” - కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

" మహాఘట్‌బంధన్‌పై విశ్వాసం వ్యక్తం చేసిన బీహార్‌లోని కోట్లాది మంది ఓటర్లకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బీహార్‌లో ఈ ఫలితం నిజంగా ఆశ్చర్యం కలిగించింది. మొదటి నుంచీ సక్రమంగా జరగని ఎన్నికల్లో మేము విజయం సాధించలేకపోయాం. ఈ పోరాటం రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ ఫలితంపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తాయి"- లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

“బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రజలు ఇచ్చిన తీర్పు. మాకు ఒక గుణపాఠం లాంటిది. కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి కొత్త వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. దీని కోసం కసరత్తు చేస్తాం’ - కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

“బీహార్‌లో ఎస్‌ఐఆర్ ద్వారా అంతా నడిపించారు. ఇటువంటి ఎన్నికల కుట్రలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో సాగవు”- ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌

“2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి భారీ మెజారిటీని అందించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీకి అలాగే మిత్రపక్షాల నేతలు చిరాగ్ పాశ్వాన్, జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాలకు ప్రత్యేక కృతజ్ఞతలు”- బీహార్ సీఎం, జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్

“బీహార్‌ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయే కూటమికి చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నీతీశ్‌ కుమార్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలకు అభినందనలు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ సారథ్యంలోనే బిహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి కొనసాగుతుంది” - కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్

“బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధికి గొప్ప విజయం దక్కింది. ఈ విజయం బీహార్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఉన్న విశ్వాసానికి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఉన్న నమ్మకానికి నిదర్శనం” - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

బీహార్‌లో మళ్లీ ఎన్డీయేకే పట్టం - Tholi Paluku